సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ట్రెజరీ కార్యాలయాలు సెలవు రోజైన ఆదివారం సైతం శరవేగంగా బిల్లుల ప్రాసెస్ నిర్వహించాయి. ఆర్థికశాఖ ఆదేశాలతో ప్రత్యక్షంగా కలెక్టర్లే రంగంలోకి దిగి ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నెలాఖరు కావడంతో సాయంత్రం కల్లా పూర్తి చేసేలా అన్ని జిల్లాల్లో ప్రాసెస్ జరుగుతోంది.
శని, ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రెజరీ ఉద్యోగులు బిల్లులను అప్‌లోడ్ చేశారు. ట్రెజరీల్లో సుమారు 2 లక్షల బిల్లులు కొత్త పీఆర్సీ ప్రకారం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పే అండ్ అకౌంట్స్‌లో 50 వేల బిల్లులను అధికారులు ప్రాసెస్ చేశారు. ఆర్థికశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బిల్లులు సిద్ధం చేస్తున్నారు. నేటి నుంచి పెన్షనర్ల బిల్లులను ఉద్యోగులు సిద్ధం చేయనున్నారు. కాగా, 1వ తేదీ వరకు ఉద్యోగులకు కొత్త జీతాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ సన్నద్ధమవుతుంది.
కొత్త జీతాలతో వాస్తవాలు వెల్లడి..
కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలను అందుకోవడం ద్వారా ఉద్యోగులు వాస్తవాలను అర్థం చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. అందరి జీతాలు పెరిగాయని స్పష్టం చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయం. అందుకనే శరవేగంగా జీతాల బిల్లుల ప్రాసెస్ చేపట్టింది. కొన్ని రాజకీయ శక్తులు పన్నిన కుట్రలకు ఉద్యోగులు బలి కాకుండా కాపాడుకుంటూ నిజం ఏమిటో తెలియజేసేలా చర్యలు చేపట్టింది. జీతాలు తగ్గుతాయన్న ఆరోపణల్లో నిజం లేదని నిరూపించనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులు, పెన్షనర్లకు చెందిన మొత్తాలను ఫిబ్రవరి 1 నాటికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనికి అడ్డుపడే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని గట్టి సంకేతాలనిచ్చింది. విజయనగరంలో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించిన డీడీవోలకు మెమోలిచ్చారు. తమ ఎత్తుగడలు పారవనే కొన్ని సంఘాలు ఉద్దేశపూర్వకంగా జీతాల బిల్లుల ప్రాసెస్ పనులకు అడ్డుపడుతున్నట్లు తెలిసింది.
విజయనగరంలో మెమోలు
విజయనగరం జిల్లాలో జనవరి వేతనాల ప్రక్రియ పనులను చేపట్టకుండా కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఆర్థిక శాఖ ఆదేశాలను అమలు చేయని 175 మంది డీడీవోలకు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మెమోలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో ట్రెజరీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానమైన 177 కార్యాలయాల సిబ్బందికి సంబంధించిన డీడీవోల వివరాలను సేకరించారు. 2 విభాగాల నుంచి మాత్రమే వేతనాల పనులను పూర్తి చేయగా మిగిలిన 175 శాఖల డీడీఓలు ప్రారంభించలేదని గుర్తించి వారందరికీ మెమోలను జారీ చేశారు. సోమవారం కూడా సమయం ఉన్నందున బిల్లుల ప్రాసెస్ జరిగేలా చర్యలు చేపట్టారు.
చిత్తూరులో సజావుగా..
చిత్తూరు జిల్లాలో కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు బిల్లుల చెల్లింపు జరిగేలా కలెక్టర్ హరినారాయణన్ పర్యవేక్షించారు. జిల్లా ట్రెజరీ కార్యాలయం, 17 సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఆదివారం పనిచేసినట్లు చెప్పారు. అలసత్వం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించామన్నారు.
ఉత్తర్వులు పాటించాల్సిందే..
ప్రకాశం జిల్లాలో అన్ని శాఖల డీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పని చేయాలని ఆదేశించినట్లు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అన్ని శాఖల హెచ్‌ఓడీలు, జిల్లా అధికారులకు డీడీవోలతో పని చేయించాలని, లేనిపక్షంలో మెమోలు జారీ చేయాలని ఆదేశించామన్నారు. పనిచేయని డీడీవోలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఉత్తరాంధ్రలో వేగంగా..
విశాఖపట్నం జిల్లాలో బిల్లుల ప్రక్రియను సోమవారం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, డీఆర్వో శ్రీనివాసమూర్తి తెలిపారు. మొత్తం 1,299 మంది డీడీవోలుండగా ఇప్పటి వరకు 227 మంది వేతన బిల్లుల ప్రక్రియను ప్రారంభించారన్నారు. 39 మంది డీడీవోలు తమ పనిని పూర్తి చేశారు. మిగిలిన ప్రక్రియ సోమవారం పూర్తి కానుంది. పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి డీడీఓలు 1,068 మంది ఉండగా ఇప్పటివరకు 180 మంది బిల్లుల పని ప్రారంభించారు. వీరిలో 31 మంది పూర్తి చేశారు.
ఉభయ గోదావరిలో రెండు రోజులుగా..
పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా 15 సబ్ ట్రెజరీల్లో 145 మంది ట్రెజరీ ఉద్యోగులు విధుల్లో పాల్గొని పోలీసు, అగ్నిమాపక, ట్రెజరీ, విజలెన్స్, ఏసీబీ తదితర విభాగాల్లో 1,200 మంది ఉద్యోగుల బిల్లులను ప్రాసెస్ చేశారు. 26,800 మంది పింఛనుదారుల బిల్లులను సైతం ప్రాసెస్ చేసినట్టు అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ట్రెజరీతో పాటు సబ్ ట్రెజరీల్లో రెండు రోజులుగా పోలీసు, ఏపీఎస్పీ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, న్యాయశాఖ ఉద్యోగుల జీతాల బిల్లులు 8 వేల వరకు పూర్తి చేశారు. పెన్షన్లకు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఆన్‌లైన్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.
ఆదేశాలను కచ్చితంగా పాటిస్తాం
గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలను ఖాతాల్లో జమ చేసే పనిలో ఖజానా శాఖ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని 17 సబ్ ట్రెజరీ కార్యాలయాలతోపాటు కలెక్టరేట్‌లోని ఖజానా కార్యాలయంలోనూ విధులు నిర్వహిస్తున్నట్లు ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.రాజగోపాలరావు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1కల్లా జిల్లాలోని 39 వేల మంది పెన్షనర్ల ఖాతాల్లోకి నగదు మొత్తం జమ అవుతుందన్నారు. జిల్లాలో 35,706 మంది ఉద్యోగులకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో డీడీవోలు 50 బిల్లులను ప్రాసెస్ చేశారని కలెక్టర్ నివాస్ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,283 డీడీవోల పరిధిలో 34,346 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 16,392 మంది ఉద్యోగులకు సంబంధించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు.
అనంత, కర్నూలు, నెల్లూరుల్లోను..
అనంతపురం జిల్లాలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో డీడీఓలు, ఎస్టీఓలు విధుల్లోకి వచ్చారు. కర్నూలు జిల్లాలో జనవరి నెల వేతనాలను కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు పంపాలని అన్ని శాఖల డీడీవోలను ఆదేశించినట్టు కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి బిల్లులు రాగా ట్రెజరీ అధికారులు ప్రాసెస్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పలు శాఖలకు చెందిన 200 మంది డీడీవోలు జనవరి జీతాల బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీకి పంపినట్టు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు చెప్పారు. మిగతావి కూడా సిద్ధమవుతున్నాయని, సోమవారం వరకు అవకాశం ఉన్నందున మోమోలు ఇవ్వలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment