
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ జీవోలను అనుసరించి, కొత్త పేస్కేళ్ల ప్రకారం ఉద్యోగులకు పెన్షనర్లకు ఫిబ్రవరి 1న జీతాలు, పింఛన్లు చెల్లించాల్సిందేనని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇందుకోసం నిర్దేశిత సమయంలోగా వేతనాలు, పింఛన్ల బిల్లుల రూపకల్పన జరగాలని పేర్కొంది. లేదంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని తాజాగా సర్క్యులర్ మెమోలో హెచ్చరించింది. వాస్తవానికి కొత్త జీవోల ప్రకారం జనవరి నుంచి ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. కొత్త జీతాలు వస్తే ఈ వాస్తవం బయటపడుతుంది.
ఈ కారణంతోనే కొందరు కొత్త జీవోల ప్రకారం జీతాలు విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో కొత్త పీఆర్సీ జీవోలను అనుసరించి వెంటనే బిల్లులు రూపొందించి, జనవరి వేతనాలను ఫిబ్రవరిలో చెల్లించాలని ఆర్థిక శాఖ ఇంతకు ముందే ఆదేశించింది. అయితే, బిల్లుల రూపకల్పనను సమీక్షించగా చాలా వెనుకబడి ఉన్నట్లు తేలిందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ తాజా మెమోలో తెలిపారు.
అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సచివాలయ విభాగాలు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు, డ్రాయింగ్ డిస్‌బర్స్‌మెంట్ అధికారులు, ట్రెజరీ అధికారులు సమయంలోగా బిల్లుల రూపకల్పన, ప్రాసెస్‌తో పాటు జనవరి వేతనాలు, పెన్షన్లను ఫిబ్రవరి 1న చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీడీవోలు, ట్రెజరీ ఆఫీసర్లు, పీఏవోలు గురువారంలోగా కొత్త పేస్కేళ్లను నిర్ధారించి, శుక్రవారంలోగా బిల్లులను ఆమోదించి అప్‌లోడ్ చేయాల్సి ఉందని, వేతనాలు, పెన్షన్లను ఫిబ్రవరి 1న చెల్లించాల్సి ఉందని చెప్పారు. నిర్దేశిత సమయంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో, ఆర్థిక శాఖ ఆదేశాలను పాటించడంలో విఫలమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.