సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కడా ఆగలేదని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ‘కోవిడ్ కారణంగా అంతర్జాతీయంగా ఇబ్బందులు వచ్చాయి. మనమూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా చెల్లిస్తున్నాం. ఈ విషయంలో ఉద్యోగుల నుంచి సహకారం ఉంది. దీనిని కూడా ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయి. కోవిడ్ సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదని సంక్షేమ పథకాల ద్వారా డబ్బు ఇచ్చాం’ అని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక శాఖ పరిధిలోకి చేర్చిన నేపథ్యంలో మంత్రి బుగ్గన మంగళవారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బుగ్గన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..
ఏపీఎస్‌డీసీ ద్వారా రుణాలు సంక్షేమానికే..
రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్‌డీసీ) ఏర్పాటు చేసిందే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు కోసం. ఈ కార్పొరేషన్ ఏర్పాటుపై చట్టమే చేశాం. అందులో అన్ని విషయాలూ ఉన్నాయి. దీని ద్వారా తీసుకున్న రుణాలను అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
ఒప్పందాలన్నీ గవర్నర్ పేరు మీదే
పరిపాలన అంతా ఎప్పుడూ గవర్నర్ పేరు మీదనే సాగుతుంది. అప్పులు తీసుకున్నా, జీవోలు జారీ చేసినా, ఎలాంటి ఒప్పందాలయినా గవర్నర్ పేరు మీదే జరుగుతాయి. గత ప్రభుత్వాలు ఎవరి పేరుతో అప్పులు చేశాయి? భూములు తనఖా పెట్టి బ్యాంకు రుణాలు తీసుకోవడం కూడా అత్యంత సహజం. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రభుత్వ నిధుల వినియోగంపై కాగ్ అభ్యంతరాలు చాలా సహజం. వాటికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూనే ఉంది.
ఆర్థిక శాఖకు అనుబంధంగానే వాణిజ్య పన్నుల శాఖ
జీఎస్టీ అమల్లో ఉన్నందున ఆర్థిక శాఖకు అనుబంధంగానే వాణిజ్య పన్నుల శాఖ ఉండాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామే నాతో ఈ విషయాన్ని చెప్పారు. ఆయన ఏమీ బాధ పడటంలేదు. పన్నుల వసూళ్ల గురించి డీలర్ బేస్‌పై ప్రాథమికంగా చర్చించాం. ముఖ్యమంత్రి కొత్తగా ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్ష చేశాను. రాష్ట్రానికి ఇంతవరకు జీఎస్‌టీ కింద రూ.3,274 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇంకా రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు జీఎస్‌టీ బకాయిలు రావాలి.
ఉద్యోగుల జీతాలు ఎక్కడా ఆగలేదు
Published Wed, Nov 3 2021 5:25 AM | Last Updated on Wed, Nov 3 2021 5:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment