Salaries of employees
-
విద్యుత్ ఉద్యోగుల ‘పీఆర్సీ’ గడువు పెంపు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పడ్డ పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) ఈ నెల 30 వరకూ వినతులు స్వీకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఆపరేషన్స్) సర్కిల్ కార్యాలయంలో ఫిబ్రవరి 15 నుంచి వినతులు స్వీకరించడం మొదలెట్టిన పీఆర్సీ.. తొలుత ఫిబ్రవరి నెలాఖరు వరకూ షెడ్యూల్ ఇవ్వగా, అనంతరం ఈ నెల 13 వరకూ గడువు పొడిగించుకుంటూ వచ్చింది. అయినప్పటికీ ఇంకా వినతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించి ఈ నెలాఖరు వరకూ అవకాశం కల్పిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ ట్రాన్స్ కో, ఏపీ జెన్ కో, మూడు డిస్కంల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ యూనియన్ల నుంచి మంగళవారం నుంచి శుక్రవారం వరకూ రోజూ ఉదయం 11 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా స్వీకరిస్తారు. అయితే స్వయంగా వెళ్లి వినతులిచ్చే అవకాశం లేనివారి కోసం ఈ–మెయిల్ prc2022 powerutilities@gmail.com, వాట్సప్ నంబర్ 8500676988 సదుపాయాలను కూడా ఈసారి పీఆర్సీ అందుబాటులోకి తెచ్చింది. -
వేతనాలు, పింఛన్లు ఫిబ్రవరి 1న చెల్లించాల్సిందే
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ జీవోలను అనుసరించి, కొత్త పేస్కేళ్ల ప్రకారం ఉద్యోగులకు పెన్షనర్లకు ఫిబ్రవరి 1న జీతాలు, పింఛన్లు చెల్లించాల్సిందేనని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇందుకోసం నిర్దేశిత సమయంలోగా వేతనాలు, పింఛన్ల బిల్లుల రూపకల్పన జరగాలని పేర్కొంది. లేదంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని తాజాగా సర్క్యులర్ మెమోలో హెచ్చరించింది. వాస్తవానికి కొత్త జీవోల ప్రకారం జనవరి నుంచి ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. కొత్త జీతాలు వస్తే ఈ వాస్తవం బయటపడుతుంది. ఈ కారణంతోనే కొందరు కొత్త జీవోల ప్రకారం జీతాలు విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో కొత్త పీఆర్సీ జీవోలను అనుసరించి వెంటనే బిల్లులు రూపొందించి, జనవరి వేతనాలను ఫిబ్రవరిలో చెల్లించాలని ఆర్థిక శాఖ ఇంతకు ముందే ఆదేశించింది. అయితే, బిల్లుల రూపకల్పనను సమీక్షించగా చాలా వెనుకబడి ఉన్నట్లు తేలిందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ తాజా మెమోలో తెలిపారు. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సచివాలయ విభాగాలు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు, డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారులు, ట్రెజరీ అధికారులు సమయంలోగా బిల్లుల రూపకల్పన, ప్రాసెస్తో పాటు జనవరి వేతనాలు, పెన్షన్లను ఫిబ్రవరి 1న చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీడీవోలు, ట్రెజరీ ఆఫీసర్లు, పీఏవోలు గురువారంలోగా కొత్త పేస్కేళ్లను నిర్ధారించి, శుక్రవారంలోగా బిల్లులను ఆమోదించి అప్లోడ్ చేయాల్సి ఉందని, వేతనాలు, పెన్షన్లను ఫిబ్రవరి 1న చెల్లించాల్సి ఉందని చెప్పారు. నిర్దేశిత సమయంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో, ఆర్థిక శాఖ ఆదేశాలను పాటించడంలో విఫలమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
ఉద్యోగుల జీతాలు ఎక్కడా ఆగలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కడా ఆగలేదని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ‘కోవిడ్ కారణంగా అంతర్జాతీయంగా ఇబ్బందులు వచ్చాయి. మనమూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా చెల్లిస్తున్నాం. ఈ విషయంలో ఉద్యోగుల నుంచి సహకారం ఉంది. దీనిని కూడా ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయి. కోవిడ్ సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదని సంక్షేమ పథకాల ద్వారా డబ్బు ఇచ్చాం’ అని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక శాఖ పరిధిలోకి చేర్చిన నేపథ్యంలో మంత్రి బుగ్గన మంగళవారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బుగ్గన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఏపీఎస్డీసీ ద్వారా రుణాలు సంక్షేమానికే.. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ) ఏర్పాటు చేసిందే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు కోసం. ఈ కార్పొరేషన్ ఏర్పాటుపై చట్టమే చేశాం. అందులో అన్ని విషయాలూ ఉన్నాయి. దీని ద్వారా తీసుకున్న రుణాలను అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఒప్పందాలన్నీ గవర్నర్ పేరు మీదే పరిపాలన అంతా ఎప్పుడూ గవర్నర్ పేరు మీదనే సాగుతుంది. అప్పులు తీసుకున్నా, జీవోలు జారీ చేసినా, ఎలాంటి ఒప్పందాలయినా గవర్నర్ పేరు మీదే జరుగుతాయి. గత ప్రభుత్వాలు ఎవరి పేరుతో అప్పులు చేశాయి? భూములు తనఖా పెట్టి బ్యాంకు రుణాలు తీసుకోవడం కూడా అత్యంత సహజం. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రభుత్వ నిధుల వినియోగంపై కాగ్ అభ్యంతరాలు చాలా సహజం. వాటికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూనే ఉంది. ఆర్థిక శాఖకు అనుబంధంగానే వాణిజ్య పన్నుల శాఖ జీఎస్టీ అమల్లో ఉన్నందున ఆర్థిక శాఖకు అనుబంధంగానే వాణిజ్య పన్నుల శాఖ ఉండాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామే నాతో ఈ విషయాన్ని చెప్పారు. ఆయన ఏమీ బాధ పడటంలేదు. పన్నుల వసూళ్ల గురించి డీలర్ బేస్పై ప్రాథమికంగా చర్చించాం. ముఖ్యమంత్రి కొత్తగా ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్ష చేశాను. రాష్ట్రానికి ఇంతవరకు జీఎస్టీ కింద రూ.3,274 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇంకా రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు జీఎస్టీ బకాయిలు రావాలి. -
జీతాల కోసం న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఏపీ స్థానికత గల ఉద్యోగులు జీతాల కోసం న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నారు. రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్ని కోర్టులో నిలదీయనున్నారు. ఇందులోభాగంగా పిటిషన్ల దాఖలుపై చర్చించేందుకు సోమ, మంగళవారాల్లో భేటీ అయ్యే ఆలోచనలో ఉన్నారు. అయితే స్థానికత అంశం ఇప్పటికే కోర్టులో ఉన్న కారణంగా, జీతాల కోసం కోర్టుకెళ్లడం ఏమేర సాధ్యమనే దానిపై వారు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. స్థానికత ఆధారంగా ఈ నెల 11న తెలంగాణ ప్రభుత్వం 1,251 మంది ఉద్యోగుల్ని రిలీవ్ చేసింది. దీనిపై వారు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఏపీ ట్రాన్స్కో సైతం కోర్టుకెక్కింది. దీంతో రిలీవ్ ఆర్డర్లను నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే వీటిని టీఎస్ విద్యుత్ సంస్థలు పట్టించుకోవడం లేదు. ఆ రాష్ట్రం కూడా కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఏపీ స్థానికతతో రిలీవ్ అయిన ఉద్యోగుల ఏ రాష్ట్రంలోనూ పనిచేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల 10వ తేదీ వరకే వీరంతా తమ సంస్థల్లో పనిచేసినట్టు తెలంగాణ విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ఈ మేరకే జీతాల పట్టికలో చేర్చాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు గణాంక శాఖను ఆదేశించారు. వచ్చే పది రోజుల వేతనంలోనూ ఆదాయ పన్ను కింద సింహభాగం చెల్లించాల్సి ఉంటుంది. తత్ఫలితంగా ఈ నెల వేతనం అందే అవకాశం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చేసేందుకు ముందుకొచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోగా తెలంగాణలోనే ఉండి న్యాయపోరాటం చేయాలని చెప్పడంతో వారంతా నలిగిపోతున్నారు.