జీతాల కోసం న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఏపీ స్థానికత గల ఉద్యోగులు జీతాల కోసం న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నారు. రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్ని కోర్టులో నిలదీయనున్నారు. ఇందులోభాగంగా పిటిషన్ల దాఖలుపై చర్చించేందుకు సోమ, మంగళవారాల్లో భేటీ అయ్యే ఆలోచనలో ఉన్నారు. అయితే స్థానికత అంశం ఇప్పటికే కోర్టులో ఉన్న కారణంగా, జీతాల కోసం కోర్టుకెళ్లడం ఏమేర సాధ్యమనే దానిపై వారు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. స్థానికత ఆధారంగా ఈ నెల 11న తెలంగాణ ప్రభుత్వం 1,251 మంది ఉద్యోగుల్ని రిలీవ్ చేసింది. దీనిపై వారు కోర్టును ఆశ్రయించారు.
మరోవైపు ఏపీ ట్రాన్స్‌కో సైతం కోర్టుకెక్కింది. దీంతో రిలీవ్ ఆర్డర్లను నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే వీటిని టీఎస్ విద్యుత్ సంస్థలు పట్టించుకోవడం లేదు. ఆ రాష్ట్రం కూడా కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఏపీ స్థానికతతో రిలీవ్ అయిన ఉద్యోగుల ఏ రాష్ట్రంలోనూ పనిచేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల 10వ తేదీ వరకే వీరంతా తమ సంస్థల్లో పనిచేసినట్టు తెలంగాణ విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి.
ఈ మేరకే జీతాల పట్టికలో చేర్చాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు గణాంక శాఖను ఆదేశించారు. వచ్చే పది రోజుల వేతనంలోనూ ఆదాయ పన్ను కింద సింహభాగం చెల్లించాల్సి ఉంటుంది. తత్ఫలితంగా ఈ నెల వేతనం అందే అవకాశం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చేసేందుకు ముందుకొచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోగా తెలంగాణలోనే ఉండి న్యాయపోరాటం చేయాలని చెప్పడంతో వారంతా నలిగిపోతున్నారు.