Telangana power companies
-
కోర్టు ధిక్కరణే.. అయినా చివరి చాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఆదేశాలు తెలంగాణ విద్యుత్ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీన్ని కోర్టు ధిక్కరణగానే పరిగణిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేసింది. శిక్షకు అర్హులుగా ప్రకటించి శిక్షా కాలాన్ని వెల్లడించకముందు కమిటీ ఆదేశాలు అమలు చేయడానికి చివరి అవకాశంగా మరో రెండు వారాలు గడువు ఇస్తున్నామని తెలిపింది. తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏ మేరకు ఆదేశాలు అమలు చేశాయో ఈ నెల 31న సమీక్షిస్తామని స్పష్టం చేసింది. ఆ 84 మంది పిటిషన్లపై తీర్పు రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు జస్టిస్ ధర్మాధికారి కమిటీని నియమించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 655 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలకు కేటాయిస్తూ కమిటీ నిర్ణయించింది. అదేవిధంగా తెలంగాణ నుంచి 655 మంది ఉద్యోగులను ఏపీకి పంపాలని సిఫారసు చేసింది. అయితే 571 మందికే పోస్టింగ్‌లు ఇచ్చిన తెలంగాణ విద్యుత్ సంస్థలు.. 84 మందిని ఏపీ నుంచి అదనంగా పంపారని పేర్కొన్నాయి. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణకు పాల్పడ్డాయంటూ 84 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించి మంగళవారం తుదితీర్పు వెలువరించింది. వేతనాలు చెల్లించడానికి వీలుగా గడువు ‘84 మంది పిటిషనర్లను ఏపీ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేయడంతో పాత సంస్థతో ఆయా ఉద్యోగులకు ఎలాంటి సంబంధాలు లేవు. జస్టిస్ ధర్మా«దికారి కమిటీ తుది నివేదికను సుప్రీంకోర్టు ఆమోదించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు దానికి బాధ్యత వహించాల్సిందే. ఉద్దేశపూర్వకంగా తప్పించుకోవాలని చూస్తే కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినట్లే. కోర్టు ముందు పదేపదే అభ్యంతరాలు లేవనెత్తడానికి అనుమతించబోం. అలా అనుమతిస్తే ఏకసభ్య కమిటీ ఉద్దేశం నెరవేరదు. కోర్టు ఆదేశాల విషయంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపినట్లు భావిస్తున్నాం. వాటిని దోషులు గానూ పరిగణిస్తాం. తగిన శిక్షకు కూడా గురవుతాయి. అయితే ఏపీ నుంచి రిలీవ్ అయిన 84 మంది ఉద్యోగులు నాటి నుంచి జీతం కూడా తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో చివరి అవకాశం ఇస్తున్నాం. ఆ 84 మంది రిలీవ్ అయిన రోజు నుంచి వేతనాలు, ఇతర ప్రయోజనాలు చెల్లించడానికి 2 వారాలు గడువు ఇస్తున్నాం’ అని తీర్పులో సుప్రీం స్పష్టం చేసింది. -
బకాయిలపై న్యాయ పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణల మధ్య విద్యుత్ బకాయిల అంశంపై న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఏపీ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించి రూ.6,756.92 కోట్లను నెలరోజుల్లో ఏపీ జెన్కోకు చెల్లించాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణకు రూ.17,828 కోట్లు రావాల్సి ఉందని.. దీనిని కేంద్రం పట్టించుకోలేదని తెలంగాణ విద్యుత్ సంస్థలు మండిపడుతున్నాయి. దీనిపై ఈ నెల 3న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో నిరసన తెలిపినట్టు గుర్తుచేస్తున్నాయి. కేంద్ర సహకారం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు చెబుతున్నాయి. ఆరేళ్లుగా పెన్షన్ ట్రస్ట్ వివాదం రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీ ట్రస్ట్‌లో జమచేసి ఉన్న నిధుల పంపకాలు జరగలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీకి సంబంధించిన నిధులను విద్యుత్ సంస్థలు ఈ ట్రస్టులో జమ చేసేవి. విభజన నాటికి ట్రస్టులో దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు నిల్వ ఉండగా.. ట్రస్ట్ నిర్వహణ ఏపీకి వెళ్లింది. విద్యుత్ వివాదాల నేపథ్యంలో ఆరేళ్ల కింద ఈ ట్రస్టు నుంచి తెలంగాణకు చెల్లింపులను ఏపీ నిలిపివేసింది. దీంతో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్ష న్లు, గ్రాట్యుటీ, ఈఎల్ మొత్తాలను తెలం గాణ విద్యుత్ సంస్థలు సొంత నిధుల నుంచే చెల్లిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి రావాల్సిన పెన్షన్ ట్రస్ట్ బకాయిలను ఇప్పించాలని విద్యుత్ సంస్థలు తాజాగా హైకోర్టు ను ఆశ్రయించాయి. ఇక ఈ వివాదాల కారణంగా విద్యుత్ సంస్థలు పెన్షన్ ట్రస్ట్‌లో నిధులు జమ చేయడం లేదని.. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపు ఇబ్బందికరంగా మారుతుందని ఉద్యోగ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘విద్యుత్ సంస్థల విజయం ప్రధానినే వణికిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలు సాధించిన సమష్టి విజయం ప్రధాని నరేంద్రమోదీని సైతం వణికిస్తుందని, ఆ భయంతోనే ఆయన తెలంగాణపై విషం కక్కుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? అని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని సైతం మథనపడుతున్నారని చెప్పారు. మింట్ ఆవరణలో బుధవారం జరిగిన విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్(హెచ్82) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర గౌరవాన్ని పెంచారని, అందుకే వారికి ఉద్యోగ భద్రత కల్పించి, ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన వేతనాలను అందజేస్తుందని చెప్పారు. ఉద్యోగుల పాత్ర మరవలేనిది: ఈటల తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర మరవలేనిదని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదేనని, తెలంగాణ అభివృద్ధి చెందుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కొనియాడారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీధర్, కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
జీతాల కోసం న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఏపీ స్థానికత గల ఉద్యోగులు జీతాల కోసం న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నారు. రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్ని కోర్టులో నిలదీయనున్నారు. ఇందులోభాగంగా పిటిషన్ల దాఖలుపై చర్చించేందుకు సోమ, మంగళవారాల్లో భేటీ అయ్యే ఆలోచనలో ఉన్నారు. అయితే స్థానికత అంశం ఇప్పటికే కోర్టులో ఉన్న కారణంగా, జీతాల కోసం కోర్టుకెళ్లడం ఏమేర సాధ్యమనే దానిపై వారు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. స్థానికత ఆధారంగా ఈ నెల 11న తెలంగాణ ప్రభుత్వం 1,251 మంది ఉద్యోగుల్ని రిలీవ్ చేసింది. దీనిపై వారు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఏపీ ట్రాన్స్‌కో సైతం కోర్టుకెక్కింది. దీంతో రిలీవ్ ఆర్డర్లను నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే వీటిని టీఎస్ విద్యుత్ సంస్థలు పట్టించుకోవడం లేదు. ఆ రాష్ట్రం కూడా కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఏపీ స్థానికతతో రిలీవ్ అయిన ఉద్యోగుల ఏ రాష్ట్రంలోనూ పనిచేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల 10వ తేదీ వరకే వీరంతా తమ సంస్థల్లో పనిచేసినట్టు తెలంగాణ విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ఈ మేరకే జీతాల పట్టికలో చేర్చాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు గణాంక శాఖను ఆదేశించారు. వచ్చే పది రోజుల వేతనంలోనూ ఆదాయ పన్ను కింద సింహభాగం చెల్లించాల్సి ఉంటుంది. తత్ఫలితంగా ఈ నెల వేతనం అందే అవకాశం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చేసేందుకు ముందుకొచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోగా తెలంగాణలోనే ఉండి న్యాయపోరాటం చేయాలని చెప్పడంతో వారంతా నలిగిపోతున్నారు.