సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఆదేశాలు తెలంగాణ విద్యుత్ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీన్ని కోర్టు ధిక్కరణగానే పరిగణిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేసింది. శిక్షకు అర్హులుగా ప్రకటించి శిక్షా కాలాన్ని వెల్లడించకముందు కమిటీ ఆదేశాలు అమలు చేయడానికి చివరి అవకాశంగా మరో రెండు వారాలు గడువు ఇస్తున్నామని తెలిపింది. తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏ మేరకు ఆదేశాలు అమలు చేశాయో ఈ నెల 31న సమీక్షిస్తామని స్పష్టం చేసింది.
ఆ 84 మంది పిటిషన్లపై తీర్పు
రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు జస్టిస్ ధర్మాధికారి కమిటీని నియమించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 655 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలకు కేటాయిస్తూ కమిటీ నిర్ణయించింది. అదేవిధంగా తెలంగాణ నుంచి 655 మంది ఉద్యోగులను ఏపీకి పంపాలని సిఫారసు చేసింది.
అయితే 571 మందికే పోస్టింగ్‌లు ఇచ్చిన తెలంగాణ విద్యుత్ సంస్థలు.. 84 మందిని ఏపీ నుంచి అదనంగా పంపారని పేర్కొన్నాయి. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణకు పాల్పడ్డాయంటూ 84 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించి మంగళవారం తుదితీర్పు వెలువరించింది.
వేతనాలు చెల్లించడానికి వీలుగా గడువు
‘84 మంది పిటిషనర్లను ఏపీ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేయడంతో పాత సంస్థతో ఆయా ఉద్యోగులకు ఎలాంటి సంబంధాలు లేవు. జస్టిస్ ధర్మా«దికారి కమిటీ తుది నివేదికను సుప్రీంకోర్టు ఆమోదించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు దానికి బాధ్యత వహించాల్సిందే. ఉద్దేశపూర్వకంగా తప్పించుకోవాలని చూస్తే కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినట్లే. కోర్టు ముందు పదేపదే అభ్యంతరాలు లేవనెత్తడానికి అనుమతించబోం. అలా అనుమతిస్తే ఏకసభ్య కమిటీ ఉద్దేశం నెరవేరదు.
కోర్టు ఆదేశాల విషయంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపినట్లు భావిస్తున్నాం. వాటిని దోషులు గానూ పరిగణిస్తాం. తగిన శిక్షకు కూడా గురవుతాయి. అయితే ఏపీ నుంచి రిలీవ్ అయిన 84 మంది ఉద్యోగులు నాటి నుంచి జీతం కూడా తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో చివరి అవకాశం ఇస్తున్నాం. ఆ 84 మంది రిలీవ్ అయిన రోజు నుంచి వేతనాలు, ఇతర ప్రయోజనాలు చెల్లించడానికి 2 వారాలు గడువు ఇస్తున్నాం’ అని తీర్పులో సుప్రీం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment