Justice dharmadhikari
-
కోర్టు ధిక్కరణే.. అయినా చివరి చాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఆదేశాలు తెలంగాణ విద్యుత్ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీన్ని కోర్టు ధిక్కరణగానే పరిగణిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేసింది. శిక్షకు అర్హులుగా ప్రకటించి శిక్షా కాలాన్ని వెల్లడించకముందు కమిటీ ఆదేశాలు అమలు చేయడానికి చివరి అవకాశంగా మరో రెండు వారాలు గడువు ఇస్తున్నామని తెలిపింది. తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏ మేరకు ఆదేశాలు అమలు చేశాయో ఈ నెల 31న సమీక్షిస్తామని స్పష్టం చేసింది. ఆ 84 మంది పిటిషన్లపై తీర్పు రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు జస్టిస్ ధర్మాధికారి కమిటీని నియమించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 655 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలకు కేటాయిస్తూ కమిటీ నిర్ణయించింది. అదేవిధంగా తెలంగాణ నుంచి 655 మంది ఉద్యోగులను ఏపీకి పంపాలని సిఫారసు చేసింది. అయితే 571 మందికే పోస్టింగ్లు ఇచ్చిన తెలంగాణ విద్యుత్ సంస్థలు.. 84 మందిని ఏపీ నుంచి అదనంగా పంపారని పేర్కొన్నాయి. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణకు పాల్పడ్డాయంటూ 84 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించి మంగళవారం తుదితీర్పు వెలువరించింది. వేతనాలు చెల్లించడానికి వీలుగా గడువు ‘84 మంది పిటిషనర్లను ఏపీ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేయడంతో పాత సంస్థతో ఆయా ఉద్యోగులకు ఎలాంటి సంబంధాలు లేవు. జస్టిస్ ధర్మా«దికారి కమిటీ తుది నివేదికను సుప్రీంకోర్టు ఆమోదించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు దానికి బాధ్యత వహించాల్సిందే. ఉద్దేశపూర్వకంగా తప్పించుకోవాలని చూస్తే కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినట్లే. కోర్టు ముందు పదేపదే అభ్యంతరాలు లేవనెత్తడానికి అనుమతించబోం. అలా అనుమతిస్తే ఏకసభ్య కమిటీ ఉద్దేశం నెరవేరదు. కోర్టు ఆదేశాల విషయంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపినట్లు భావిస్తున్నాం. వాటిని దోషులు గానూ పరిగణిస్తాం. తగిన శిక్షకు కూడా గురవుతాయి. అయితే ఏపీ నుంచి రిలీవ్ అయిన 84 మంది ఉద్యోగులు నాటి నుంచి జీతం కూడా తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో చివరి అవకాశం ఇస్తున్నాం. ఆ 84 మంది రిలీవ్ అయిన రోజు నుంచి వేతనాలు, ఇతర ప్రయోజనాలు చెల్లించడానికి 2 వారాలు గడువు ఇస్తున్నాం’ అని తీర్పులో సుప్రీం స్పష్టం చేసింది. -
ఇక జస్టిస్ ధర్మాధికారిదే నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో జస్టిస్ డీఎం ధర్మాధికారి ఏకసభ్య కమిషన్ ఏడాదిగా జరుపుతున్న మధ్యవర్తిత్వం ముగిసింది. హైదరాబాద్లోని ఓ హోటల్లో ధర్మాధికారి ఆదివారం రెండో రోజు నిర్వహించిన సమావేశంలో సైతం 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ స్థానికత కలిగి ఉన్నారన్న కారణంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు 2015 జూన్లో 1,157 మంది ఉద్యోగులను ఏకపక్షంగా ఏపీకి రిలీవ్ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో ఉద్యోగుల విభజన కోసం ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు స్వీకరించాలని గతంలో ధర్మాధికారి మార్గదర్శకాలు జారీ చేశారు. రిలీవైన 1,157 మంది ఉద్యోగుల్లో 613 మంది ఏపీకి, 504 తెలంగాణకు ఆప్షన్లు ఇవ్వగా.. మిగిలినవారు ఏ రాష్ట్రానికీ ఆప్షన్లు ఇవ్వలేదు. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 256 మంది తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారు. ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన 613 మందిని ఏపీ విద్యుత్ సంస్థలు తీసుకుంటే, తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 256 మందిలో సగంమందిని తీసుకుంటామని తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆదివారం సమావేశంలో ఆఫర్ ఇచ్చాయి. దీనిని ఏపీ విద్యుత్ సంస్థలు తిరస్కరించాయి. దీంతో మధ్యవర్తిత్వపు ప్రక్రియ ముగిసిందని, తానే తుది నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టుకు నివేదిస్తానని పేర్కొంటూ జస్టిస్ ధర్మాధికారి సమావేశాన్ని ముగించారు. 2018 నవంబర్ 28న సుప్రీంకోర్టు ధర్మాధికారి కమిషన్ను ఏర్పాటు చేసింది. మెట్టు దిగినా..: రిలీవైన 1,157 మందిలో తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 504 మందితోపాటు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన 256లో సగం మందిని తీసుకోవడానికి రాష్ట్ర విద్యుత్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలంగాణ విద్యుత్ జేఏసీ నేతలు శివాజీ, అంజయ్యలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి తోడు నాలుగేళ్ల కింద ఏపీ నుంచి 242 మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు చేర్చుకున్నాయన్నారు. దీంతో మొత్తం 874 మంది ఉద్యోగులను తీసుకునేందుకు తెలంగాణ సంసిద్ధత వ్యక్తం చేయగా, 613 మందిని తీసుకోవడానికి ఏపీ అంగీకరించలేదని ఆరోపించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు మెట్టు కిందికి దిగినా, ఏపీ విద్యుత్ సంస్థలు మొండికేశాయని విమర్శించారు. -
విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగుల పంపకాలకు సంబంధించి జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్ వేసిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల తరపున న్యాయవాది మాట్లాడుతూ.. కేవలం 1157మంది ఉద్యోగుల కేటాయింపుల్లో సమస్య ఉంటే జస్టిస్ ధర్మాధికారి కమిటీ మాత్రం మొత్తం 10,400 మంది ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. అందరికీ ఆప్షన్లు ఇచ్చిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఉద్యోగుల విభజనను మరింత క్లిష్టం చేసిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ అరణ్మిశ్రా ధర్మాసనం తుది కేటాయింపులు జరిగాక దానిపై సవాలు చేసుకోవచ్చని పిటిషనర్లకు సూచించింది. తుది కేటాయింపులపై సవాలు చేసుకునే స్వతంత్రతను కూడా పిటిషనర్లకే ఇచ్చింది. -
మళ్లీ అన్యాయం చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో జరిగిన నియామకాలన్నింటిలో రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని, కేవలం 28 శాతం మంది మాత్రమే తెలంగాణ స్థానికత కలిగిన వారున్నారని తెలంగాణ విద్యుత్ సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. శనివారం ఇక్కడ విద్యుత్ ఉద్యోగుల విభజన కోసం సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ డీఎం ధర్మాధికారి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్, అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగ సంఘాలు కమిషన్ ముందు తమ వాదనలను వినిపించాయి. తెలంగాణ డిస్కంలు చేసిన 1,157 మంది ఉద్యోగులకే విభజన ప్రక్రియ పరిమితం చేయాలని సంఘాలన్నీ ముక్తకంఠంతో కోరాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏడాది లోపు ఆయా సంస్థలే ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు సిద్ధం చేసుకుని, విభజన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని కానీ ఏడాది వేచిచూసిన తర్వాతే తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీ స్థానికత కలిగిన 1,157 మంది ఉద్యోగులను రిలీవ్ చేశాయని నివేదించాయి. హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన ప్రక్రియలో 612 మంది ఏపీకి వెళ్తామని ఆప్షన్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఏపీ సంఘాలు, సంస్థలు చెప్తునట్లుగా రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలనే వాదన సరైంది కాదన్నారు. 2008 దాకా విద్యుత్ సంస్థలో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయలేదని, అప్పటిదాకా జరిగిన అన్ని నియామకాల్లోనూ తెలంగాణ స్థానికత కలిగిన వారు 28శాతం ఉండగా, ఏపీ స్థానికత కలిగిన ఇంజనీర్ల వాటా 72 శాతంగా ఉందని పేర్కొన్నారు. కమల్నాథన్ కమిటీ మార్గదర్శకాలు కార్పొరేషన్లకు వర్తించవని గుర్తు చేశారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఏ రాష్ట్రంలో నాలుగేళ్లు గరిష్టంగా చదివితే అదే రాష్ట్రాన్ని స్థానికంగా పరిగణనలోకి తీసుకుని విభజన ప్రక్రియను పూర్తి చేయాలని సంఘాలు పేర్కొన్నాయి. దీంతో ఆదివారం కూడా విద్యుత్ సంస్థల ప్రతినిధులతో జస్టిస్ ధర్మాధికారి భేటీ కానున్నారు. సమావేశానికి తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు, ఏపీ ట్రాన్స్కో సీఎండీ విజయానంద్, ఏపీ ట్రాన్స్కో జేఎండీ దినేశ్ పరుచూరి, తెలంగాణ ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాస్రావు, డిస్కంల సీఎండీలు హాజరయ్యారు. -
ఎవరి వాదనలు వారివే !
* ‘విద్యుత్’ విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ భేటీ * మునుపటి వైఖరికే కట్టుబడినట్లు ఇరు రాష్ట్రాల వాదనలు * నేడు మరోసారి సమావేశం కానున్న కమిటీ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై మునుపటి వాదనలకే కట్టుబడి ఉన్నామని, తమ వైఖరిలో మార్పు లేదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు పునరుద్ఘాటించాయి. విద్యుత్ ఉద్యోగుల విభజన కోసం మార్గదర్శకాల రూపకల్పన, వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ డీఎం ధర్మాధికారి నేతృత్వంలో హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ శనివారం హైదరాబాద్లోని ఓ హోటల్లో సమావేశమైంది. కమిటీలో సభ్యులుగా ఉన్న ఇరు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను జస్టిస్ ధర్మాధికారికి వినిపించారు. స్థానికత ఆధారంగా జరిపిన ఉద్యోగుల విభజనకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ పేర్కొంది. విద్యుత్ ఉద్యోగుల విభజనలో ఏపీ ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదని, అందుకే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 82 ప్రకారమే ఏపీ స్థానికత గల 1,253 మంది ఉద్యోగులను ఏపీకు రిలీవ్ చేశామని తెలంగాణ అధికారులు వివరించారు. విద్యుత్ సంస్థలన్నింటికీ వర్తించే కామన్ కమిటీకి బదులు ట్రాన్స్కో ఉద్యోగుల విభజన కోసం మాత్రమే ఏపీ ట్రాన్స్కో కమిటీ వేసిందని పేర్కొన్నారు. అయితే, తెలంగాణ ట్రాన్స్కో నేతృత్వంలో కామన్ కమిటీ ఏర్పాటు చేసి పోలీసు నివేదిక, నియామక ఉత్తర్వుల ఆధారంగా స్థానికతను నిర్ధారించి ఉద్యోగుల విభజన జరిపామని తెలిపారు. కోర్టు వెలుపల ఈ వివాద పరిష్కారం కోసం మూడు సార్లు సమావేశమైనా ఏపీ సహకరించలేదన్నారు. 2009 నుంచి మాత్రమే విద్యుత్ సంస్థల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తి ఆధారంగా జోనల్ విధానం అమలవుతోందని తెలిపారు. అంతకుముందు గత పాలకులు ముల్కీ నిబంధనలు, గిర్గ్లానీ సిఫారసులు, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి అడ్డగోలు నియామకాలు జరపడంతో తెలంగాణకు తీరని నష్టం జరిగిందని గుర్తు చేశారు. ఏ ప్రాంతంలోని ఉద్యోగాలు ఆ ప్రాంతం వారికే దక్కాలని తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలు పుట్టుకొచ్చాయన్నారు. ఈ విషయాన్నే శ్రీకృష్ణ కమిటీ సైతం ధ్రువీకరించిందన్నారు. కమల్నాథన్ కమిటీ కేవలం ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల విభజనతో ఈ కమిటీకి సంబంధం లేదని వాదించారు. స్థానికత ఆధారంగా తెలంగాణ చేపట్టిన విద్యుత్ ఉద్యోగుల విభజన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఏపీ విద్యుత్ సంస్థలు వాదించాయి. కమల్నాథన్ కమిటీకి విద్యుత్ ఉద్యోగుల విభజన బాధ్యతలు అప్పగించాలని కోరింది. ఇదిలా ఉండగా.. విద్యుత్ ఉద్యోగుల విభజనపై సమగ్ర నివేదికను ఆదివారం రెండో రోజు జరగనున్న సమావేశంలో సమర్పించాలని జస్టిస్ ధర్మాధికారి ఏపీ విద్యుత్ సంస్థలను ఆదేశించారు. సీఎండీలు ఔట్ హైకోర్టు నియమించిన కమిటీలో సభ్యులుగా ఉన్న ఇరు రాష్ట్రాల అధికారులను జస్టిస్ ధర్మాధికారి సమావేశంలో పాల్గొనేందుకు అనుమతించారు. సమావేశం లో పాల్గొనేందుకు వచ్చిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులను ప్రారంభంలోనే బయటకు పంపించి వేశారు. దీంతో ఏపీ ట్రాన్స్కో సీఎండీ, జెన్కో ఎండీ కె.విజయానంద్, తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తదితరులు బయటకు వెళ్లిపోయారు.