ఎవరి వాదనలు వారివే !
* ‘విద్యుత్’ విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ భేటీ
* మునుపటి వైఖరికే కట్టుబడినట్లు ఇరు రాష్ట్రాల వాదనలు
* నేడు మరోసారి సమావేశం కానున్న కమిటీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై మునుపటి వాదనలకే కట్టుబడి ఉన్నామని, తమ వైఖరిలో మార్పు లేదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు పునరుద్ఘాటించాయి. విద్యుత్ ఉద్యోగుల విభజన కోసం మార్గదర్శకాల రూపకల్పన, వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ డీఎం ధర్మాధికారి నేతృత్వంలో హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమైంది.
కమిటీలో సభ్యులుగా ఉన్న ఇరు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను జస్టిస్ ధర్మాధికారికి వినిపించారు. స్థానికత ఆధారంగా జరిపిన ఉద్యోగుల విభజనకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ పేర్కొంది. విద్యుత్ ఉద్యోగుల విభజనలో ఏపీ ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదని, అందుకే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 82 ప్రకారమే ఏపీ స్థానికత గల 1,253 మంది ఉద్యోగులను ఏపీకు రిలీవ్ చేశామని తెలంగాణ అధికారులు వివరించారు. విద్యుత్ సంస్థలన్నింటికీ వర్తించే కామన్ కమిటీకి బదులు ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజన కోసం మాత్రమే ఏపీ ట్రాన్స్‌కో కమిటీ వేసిందని పేర్కొన్నారు.
అయితే, తెలంగాణ ట్రాన్స్‌కో నేతృత్వంలో కామన్ కమిటీ ఏర్పాటు చేసి పోలీసు నివేదిక, నియామక ఉత్తర్వుల ఆధారంగా స్థానికతను నిర్ధారించి ఉద్యోగుల విభజన జరిపామని తెలిపారు. కోర్టు వెలుపల ఈ వివాద పరిష్కారం కోసం మూడు సార్లు సమావేశమైనా ఏపీ సహకరించలేదన్నారు. 2009 నుంచి మాత్రమే విద్యుత్ సంస్థల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తి ఆధారంగా జోనల్ విధానం అమలవుతోందని తెలిపారు. అంతకుముందు గత పాలకులు ముల్కీ నిబంధనలు, గిర్‌గ్లానీ సిఫారసులు, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి అడ్డగోలు నియామకాలు జరపడంతో తెలంగాణకు తీరని నష్టం జరిగిందని గుర్తు చేశారు.
ఏ ప్రాంతంలోని ఉద్యోగాలు ఆ ప్రాంతం వారికే దక్కాలని తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలు పుట్టుకొచ్చాయన్నారు. ఈ విషయాన్నే శ్రీకృష్ణ కమిటీ సైతం ధ్రువీకరించిందన్నారు. కమల్‌నాథన్ కమిటీ కేవలం ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల విభజనతో ఈ కమిటీకి సంబంధం లేదని వాదించారు. స్థానికత ఆధారంగా తెలంగాణ చేపట్టిన విద్యుత్ ఉద్యోగుల విభజన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఏపీ విద్యుత్ సంస్థలు వాదించాయి. కమల్‌నాథన్ కమిటీకి విద్యుత్ ఉద్యోగుల విభజన బాధ్యతలు అప్పగించాలని కోరింది.
ఇదిలా ఉండగా.. విద్యుత్ ఉద్యోగుల విభజనపై సమగ్ర నివేదికను ఆదివారం రెండో రోజు జరగనున్న సమావేశంలో సమర్పించాలని జస్టిస్ ధర్మాధికారి ఏపీ విద్యుత్ సంస్థలను ఆదేశించారు.
సీఎండీలు ఔట్
హైకోర్టు నియమించిన కమిటీలో సభ్యులుగా ఉన్న ఇరు రాష్ట్రాల అధికారులను జస్టిస్ ధర్మాధికారి సమావేశంలో పాల్గొనేందుకు అనుమతించారు. సమావేశం లో పాల్గొనేందుకు వచ్చిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులను ప్రారంభంలోనే బయటకు పంపించి వేశారు. దీంతో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీ కె.విజయానంద్, తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తదితరులు బయటకు వెళ్లిపోయారు.