సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలు సాధించిన సమష్టి విజయం ప్రధాని నరేంద్రమోదీని సైతం వణికిస్తుందని, ఆ భయంతోనే ఆయన తెలంగాణపై విషం కక్కుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? అని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని సైతం మథనపడుతున్నారని చెప్పారు. మింట్ ఆవరణలో బుధవారం జరిగిన విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్(హెచ్82) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర గౌరవాన్ని పెంచారని, అందుకే వారికి ఉద్యోగ భద్రత కల్పించి, ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన వేతనాలను అందజేస్తుందని చెప్పారు.
ఉద్యోగుల పాత్ర మరవలేనిది: ఈటల
తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర మరవలేనిదని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదేనని, తెలంగాణ అభివృద్ధి చెందుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కొనియాడారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీధర్, కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
‘విద్యుత్ సంస్థల విజయం ప్రధానినే వణికిస్తోంది’
Published Thu, Feb 13 2020 1:43 AM | Last Updated on Thu, Feb 13 2020 1:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment