![PM Modi Announce BC CM, Etela Rajender At BC Garjana Meeting HYD - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/8/Etela-Rajender.jpg.webp?itok=DBskhoH_)
సాక్షి, హైదరాబాద్: బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని బీసీవర్గాలంతా కలసి బీజేపీని గెలిపిస్తే పరిపాలనా అనుభవమున్న ఈటలను ముఖ్యమంత్రి చేస్తామని మోదీ పేర్కొన్నారని అంటున్నాయి. నిజానికి బీజేపీ ‘బీసీల ఆత్మ గౌరవసభ’ వేదికగా సీఎం అభ్యర్థిపై ప్రధాని స్పష్టత ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు.
సభ ముగిశాక 33 బీసీ, కుల సంఘాల ప్రతినిధులతో భేటీ సందర్భంగా ‘మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను, బీసీలను గెలిపించుకోండి. అందరికీ అందుబాటులో ఉండే ఈటల రాజేందరే మీ నాయకుడు’ అని ప్రధాని స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర పార్టీ నేతలతో విడిగా భేటీ అయినప్పుడూ ఈ విషయాన్ని పేర్కొన్నట్టు సమాచారం.
సభలో పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని..
సభా వేదికపై మరోవైపు కూర్చున్న ఈటల రాజేందర్‌ను ప్రధాని మోదీ పిలిపించి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పారీ్టల తీరు, బీజేపీ అభ్యర్థుల ఖరారు, ఎన్నికల సన్నద్ధత తీరు, పార్టీ బీసీ నినాదానికి ప్రజల్లో వస్తున్న స్పందనపై మోదీ ఆరా తీసినట్టు సమాచారం. గజ్వేల్‌లో తన నామినేషన్ సందర్భంగా 20వేల మంది వరకు వచ్చారని, ప్రజల్లో మంచి స్పందన ఉందని ఈటల వివరించినట్టు తెలిసింది. అంతకుముందు సభాస్థలికి ఓపెన్ టాప్ జీప్‌లో వచ్చినప్పుడు వెనుక ఉన్న ఈటలను మోదీ ముందుకు పిలిపించుకుని తన పక్కన నిలబెట్టుకున్నారని పార్టీ నేతలు తెలిపారు.
చదవండి: తప్పు చేసిన వారిని వదలం: ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment