సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు బిల్లులు రూపొందించి, ప్రాసెస్ చేయడం, ఆమోదించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై రాష్ట్ర ఆర్థిక శాఖ కొరఢా ఝళిపించింది. ఎన్ని సార్లు ఆదేశాలు జారీ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లను, విభాగాధిపతులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శనివారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలు, పెన్షన్లు చెల్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. జీతాలు పెరగలేదని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం సరికాదని నిరూపించాలని ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తోంది.
జనవరి 1న తీసుకున్న వేతనం, ఫిబ్రవరి 1న తీసుకునే వేతనంతో పోల్చి చూసుకోవడం ద్వారా ఉద్యోగులు వాస్తవాలు గ్రహిస్తారని భావిస్తోంది. అందరికీ జీతాలు పెరిగాయన్న ప్రభుత్వ వాదన నిజమేనని ఉద్యోగులు తెలుసుకోవడం ద్వారా అసంతృప్తి తగ్గుతుందని ఈ ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ఉద్యోగ సంఘాల వెనుక ఉన్న రాజకీయ ప్రమేయం, వాళ్లను రాజకీయంగా వాడుకోవాలని చూస్తుండటం తదితర విషయాలన్నీ ఉద్యోగులు గ్రహిస్తారని.. అందుకోసమే ఎలాగైనా ఫిబ్రవరి 1న జీతాలు చెల్లించేలా చూడాలని ప్రభుత్వం తాపత్రయ పడుతోంది. రెండు నెలల మధ్య జీతంలో తేడా ఎంత ఉందో తెలుసుకోవడం ద్వారా అత్యధిక శాతం ఉద్యోగులు వాస్తవాలు గ్రహిస్తారని భావిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం జారీ అయిన మెమోలోని వివరాలు ఇలా ఉన్నాయి.
► ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నుంచి పెరిగిన వేతనాలను ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించాలి.
► ఇందుకోసం కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేళ్లు నిర్ధారించి ప్రాసెస్ చేసి.. వేతనాలు, పెన్షన్ బిల్లులను ఆమోదించడానికి పలు సార్లు నిర్ధిష్ట టైమ్‌లైన్‌తో ఆదేశాలు జారీ చేశాం. అయినా అందుకు అనుగుణంగా విధులు నిర్వహించడంలో చాలా మంది డీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించి బిల్లులు రూపొందించలేదు. వేతన బిల్లులను ఎస్‌టీవోలు ఆమోదించ లేదు. ఇలాంటి వారందరినీ ఉపేక్షించేది లేదు.
► కోవిడ్ క్లిష్ట సమయంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పూర్తి, పార్ట్ టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు, రోజు వారీ వేతన కార్మికులు, హోంగార్డులు, ఆశా కార్యకర్తలు, అంగన్ వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన సర్వీస్ ప్రొవైడర్లకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి కల్పించిన అధికారులు, ఉద్యోగులపై సీసీఏ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి.
► శనివారం సాయంత్రం 6 గంటల వరకు వేచి చూసి, విధి నిర్వహణలో వైఫల్యం చెందిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి వేతనాలను ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించేందుకు అవసరమైతే ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్ ఆఫీసర్ ప్రతిపాదించాలి.
జీతాలు, పెన్షన్ల చెల్లింపులో నిర్లక్ష్యంపై సర్కారు కన్నెర్ర
Published Sun, Jan 30 2022 2:53 AM | Last Updated on Sun, Jan 30 2022 10:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment