ddo
-
జీతాలు, పెన్షన్ల చెల్లింపులో నిర్లక్ష్యంపై సర్కారు కన్నెర్ర
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు బిల్లులు రూపొందించి, ప్రాసెస్ చేయడం, ఆమోదించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై రాష్ట్ర ఆర్థిక శాఖ కొరఢా ఝళిపించింది. ఎన్ని సార్లు ఆదేశాలు జారీ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లను, విభాగాధిపతులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శనివారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలు, పెన్షన్లు చెల్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. జీతాలు పెరగలేదని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం సరికాదని నిరూపించాలని ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తోంది. జనవరి 1న తీసుకున్న వేతనం, ఫిబ్రవరి 1న తీసుకునే వేతనంతో పోల్చి చూసుకోవడం ద్వారా ఉద్యోగులు వాస్తవాలు గ్రహిస్తారని భావిస్తోంది. అందరికీ జీతాలు పెరిగాయన్న ప్రభుత్వ వాదన నిజమేనని ఉద్యోగులు తెలుసుకోవడం ద్వారా అసంతృప్తి తగ్గుతుందని ఈ ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ఉద్యోగ సంఘాల వెనుక ఉన్న రాజకీయ ప్రమేయం, వాళ్లను రాజకీయంగా వాడుకోవాలని చూస్తుండటం తదితర విషయాలన్నీ ఉద్యోగులు గ్రహిస్తారని.. అందుకోసమే ఎలాగైనా ఫిబ్రవరి 1న జీతాలు చెల్లించేలా చూడాలని ప్రభుత్వం తాపత్రయ పడుతోంది. రెండు నెలల మధ్య జీతంలో తేడా ఎంత ఉందో తెలుసుకోవడం ద్వారా అత్యధిక శాతం ఉద్యోగులు వాస్తవాలు గ్రహిస్తారని భావిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం జారీ అయిన మెమోలోని వివరాలు ఇలా ఉన్నాయి. ► ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నుంచి పెరిగిన వేతనాలను ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించాలి. ► ఇందుకోసం కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేళ్లు నిర్ధారించి ప్రాసెస్ చేసి.. వేతనాలు, పెన్షన్ బిల్లులను ఆమోదించడానికి పలు సార్లు నిర్ధిష్ట టైమ్‌లైన్‌తో ఆదేశాలు జారీ చేశాం. అయినా అందుకు అనుగుణంగా విధులు నిర్వహించడంలో చాలా మంది డీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించి బిల్లులు రూపొందించలేదు. వేతన బిల్లులను ఎస్టీవోలు ఆమోదించ లేదు. ఇలాంటి వారందరినీ ఉపేక్షించేది లేదు. ► కోవిడ్ క్లిష్ట సమయంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పూర్తి, పార్ట్ టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు, రోజు వారీ వేతన కార్మికులు, హోంగార్డులు, ఆశా కార్యకర్తలు, అంగన్ వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన సర్వీస్ ప్రొవైడర్లకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి కల్పించిన అధికారులు, ఉద్యోగులపై సీసీఏ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి. ► శనివారం సాయంత్రం 6 గంటల వరకు వేచి చూసి, విధి నిర్వహణలో వైఫల్యం చెందిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి వేతనాలను ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించేందుకు అవసరమైతే ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్ ఆఫీసర్ ప్రతిపాదించాలి. -
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలు- పంచాయితీల డీడీఓ బాధ్యతల్ని వికేంద్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో ఇప్పటి వరకు ఉన్న డ్రాయింగ్ ఆఫీసర్ వ్యవస్థలో మార్పులు చేస్తూ ఆదేశాలిచ్చింది. పంచాయితీ ఉద్యోగులకు పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారి.. డీడీఓగా వ్యవహరించనున్నారు. గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులందరికీ డీడీఓగా వీఆర్వోకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ మొత్తం డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారి బాధ్యతల్ని కూడా పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారులే నిర్వర్తించారు. కాగా, ఇకపై పంచాయతీలకు, సచివాలయాలకు వేర్వేరుగా డీడీఓలు నియమించింది. పంచాయితీలకు, సచివాలయాలకు లింక్ అధికారిగా గ్రామ పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. చదవండి: విద్యారంగం: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం ఏపీ చరిత్రలోనే ఇదో రికార్డు: ఎంపీ విజయసాయిరెడ్డి -
వివరాలకు వెల!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సులువుగా డబ్బులొచ్చే అవకాశం ఎందుకు వదులుకోవాలనుకున్న ఆ అధికారులు వసూళ్ల బాగోతానికి తెరతీశారు. ప్రభుత్వం నిర్దేశించిన పనిని పూర్తిచేయడానికి వెలకట్టి తమలాగానే ప్రభుత్వ ఉద్యోగులైన వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారు. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) కింద చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాల నమోదు ప్రక్రియ మొత్తమ్మీద వేతన పంపిణీ అధికారుల (డీడీఓ)కు కాసుల పంట కురిపిస్తోంది. ఆరోగ్య కార్డుల అమలు ప్రక్రియ కోసం తలపెట్టిన వివరాల నమోదును డీడీఓలు ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేయాలి. కేవలం ఉద్యోగి నుంచి నిర్దేశిత ఫార్మాట్లో లిఖితపూర్వక వివరాలు సేకరించి, వాటిని ఆన్లైన్లో నమోదు చేయడం డీడీఓల కర్తవ్యం. అయితే ఈ వివరాలు నమోదు చేయడం తలనొప్పిగా భావిస్తున్న డీడీఓలు వసూళ్ల పర్వానికి తెగబడ్డారు. ఒక్కో ఉద్యోగి వివరాలు నమోదు చేయడానికి కొంత మొత్తాన్ని పుచ్చుకుంటున్నారు. లేదంటే వేతనం నిలిపివేస్తామని హెచ్చరిస్తుండంతో.. విధిలేని పరిస్థితిలో అడిగిన మొత్తాన్ని ఉద్యోగులు సమర్పించుకుంటున్నారు. బాధ్యత పేరిట దగా.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 25వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో రెగ్యులర్ ఉద్యోగులు 20వేలకు పైమాటే. అయితే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ఆర్థిక శాఖ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల హెల్త్‌కార్డుల నిర్వహణ.. వేతన పంపిణీ తదితర అంశాలపై కచ్చితమైన అంచనాలకోసం ఈ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 18లోగా పూర్తి చేయాలి. ఈ వివరాల నమోదు బాధ్యతను సంబంధిత వేతన పంపిణీ అధికారులకు అప్పజెప్పారు. ఇందుకోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోర్టల్ వెబ్సైట్లో ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను రూపొందించే వెసులుబాటు క ల్పించింది. అయితే డీడీఓలు మాత్రం ఈ వివరాల నమోదు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల ఉద్యోగులు ఒత్తిడి తేవడంతో వివరాల నమోదుకు ఉపక్రమించిన డీడీఓలు వసూళ్లకు తెగబడుతున్నారు. ధరలు నిర్దేశించి.. దండుకుని.. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోర్టల్‌లో ఒక ఉద్యోగి వివరాలు నమోదు చేయడం.. ఆధార్, ఫోటోలు ఇతర ప్రతులను స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది. దీంతో ఈ వ్యవహారాన్ని భారంగా భావించిన డీడీఓలు నమోదు ప్రక్రియలో వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఉద్యోగుల్లో అధికంగా టీచర్లు ఉండడంతో.. ఎంఈఓలు, గెజిటెడ్ హెడ్మాస్టర్ల పంట పండుతోంది. ఒక్కో టీచరు వివరాల నమోదుకు కొంత మొత్తాన్ని నిర్దేశించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఈ తంతుకు మండలాల్లో ఉపాధ్యాయ సంఘాలు కూడా తోడు కావడంతో వసూళ్ల వ్యవహారం సాఫీగా సాగుతోంది. కొన్ని మండలాల్లో ఇదీ పరిస్థితి... యాచారం, మంచాల మండలాల్లో ఒక్కో టీచరు నుంచి రూ.100 వసూలు చేసి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకుగాను ఉపాధ్యాయ సంఘాలు సైతం తీర్మానం చేసినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నం మండలంలో ఏకంగా రూ.150 వసూలు చేస్తున్నారు. కందుకూరు మండలంలో వివరాలు సమర్పించని నూతన టీచర్లకు ఏకంగా ఇంక్రిమెంట్లు నిలిపివేశారు. పరిగి, దోమ తదితర మండలాల్లోనూ ఇదే తరహాలో వసూళ్లు చేస్తున్నారు. మరికొందరు టీచర్లు డీడీఓల నుంచి యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు తెలుసుకుని వివరాలు నమోదు చేస్తున్నారు. చేజారి.. చిక్కుల్లో పడి.. ఉద్యోగుల వివరాల నమోదు అంతా డీడీఓ కనుసన్నలోనే జరగాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోర్టల్‌లో డీడీఓ యూజర్ ఐడీ, పాస్వర్డ్ గోప్యంగా ఉంచాలి. అయితే కొన్ని మండలాల్లో నమోదు ప్రక్రియను డీడీఓలు ప్రైవేటు వ్యక్తుల ద్వారా చేయిస్తున్నారు. ఈ సందర్భంలో కొందరు పాస్‌వర్డ్‌లను మార్చేస్తున్నారు. దీంతో ఆ ఐడీ బ్లాక్ కావడంతో.. వ్యవహారం మొదటికి వస్తోంది. మళ్లీ ఫైనాన్స్ శాఖను సంప్రదించాల్సి వస్తోంది. ఇటీవల ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలంలో కొందరి డీడీఓల యూజర్ ఐడీలు బ్లాక్ కావడంతో ఉద్యోగులు నానాతంటాలు పడ్డారు.