సాక్షి, రంగారెడ్డి జిల్లా: సులువుగా డబ్బులొచ్చే అవకాశం ఎందుకు వదులుకోవాలనుకున్న ఆ అధికారులు వసూళ్ల బాగోతానికి తెరతీశారు. ప్రభుత్వం నిర్దేశించిన పనిని పూర్తిచేయడానికి వెలకట్టి తమలాగానే ప్రభుత్వ ఉద్యోగులైన వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారు. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) కింద చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాల నమోదు ప్రక్రియ మొత్తమ్మీద వేతన పంపిణీ అధికారుల (డీడీఓ)కు కాసుల పంట కురిపిస్తోంది. ఆరోగ్య కార్డుల అమలు ప్రక్రియ కోసం తలపెట్టిన వివరాల నమోదును డీడీఓలు ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేయాలి. కేవలం ఉద్యోగి నుంచి నిర్దేశిత ఫార్మాట్‌లో లిఖితపూర్వక వివరాలు సేకరించి, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం డీడీఓల కర్తవ్యం. అయితే ఈ వివరాలు నమోదు చేయడం తలనొప్పిగా భావిస్తున్న డీడీఓలు వసూళ్ల పర్వానికి తెగబడ్డారు. ఒక్కో ఉద్యోగి వివరాలు నమోదు చేయడానికి కొంత మొత్తాన్ని పుచ్చుకుంటున్నారు. లేదంటే వేతనం నిలిపివేస్తామని హెచ్చరిస్తుండంతో.. విధిలేని పరిస్థితిలో అడిగిన మొత్తాన్ని ఉద్యోగులు సమర్పించుకుంటున్నారు.
బాధ్యత పేరిట దగా..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 25వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో రెగ్యులర్ ఉద్యోగులు 20వేలకు పైమాటే. అయితే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ఆర్థిక శాఖ వెబ్‌సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల హెల్త్‌కార్డుల నిర్వహణ.. వేతన పంపిణీ తదితర అంశాలపై కచ్చితమైన అంచనాలకోసం ఈ వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 18లోగా పూర్తి చేయాలి. ఈ వివరాల నమోదు బాధ్యతను సంబంధిత వేతన పంపిణీ అధికారులకు అప్పజెప్పారు. ఇందుకోసం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ పోర్టల్ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను రూపొందించే వెసులుబాటు క ల్పించింది. అయితే డీడీఓలు మాత్రం ఈ వివరాల నమోదు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల ఉద్యోగులు ఒత్తిడి తేవడంతో వివరాల నమోదుకు ఉపక్రమించిన డీడీఓలు వసూళ్లకు తెగబడుతున్నారు.
ధరలు నిర్దేశించి.. దండుకుని..
ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో ఒక ఉద్యోగి వివరాలు నమోదు చేయడం.. ఆధార్, ఫోటోలు ఇతర ప్రతులను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయడానికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది. దీంతో ఈ వ్యవహారాన్ని భారంగా భావించిన డీడీఓలు నమోదు ప్రక్రియలో వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఉద్యోగుల్లో అధికంగా టీచర్లు ఉండడంతో.. ఎంఈఓలు, గెజిటెడ్ హెడ్మాస్టర్ల పంట పండుతోంది. ఒక్కో టీచరు వివరాల నమోదుకు కొంత మొత్తాన్ని నిర్దేశించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఈ తంతుకు మండలాల్లో ఉపాధ్యాయ సంఘాలు కూడా తోడు కావడంతో వసూళ్ల వ్యవహారం సాఫీగా సాగుతోంది.
కొన్ని మండలాల్లో ఇదీ పరిస్థితి...
యాచారం, మంచాల మండలాల్లో ఒక్కో టీచరు నుంచి రూ.100 వసూలు చేసి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకుగాను ఉపాధ్యాయ సంఘాలు సైతం తీర్మానం చేసినట్లు సమాచారం.
ఇబ్రహీంపట్నం మండలంలో ఏకంగా రూ.150 వసూలు చేస్తున్నారు. కందుకూరు మండలంలో వివరాలు సమర్పించని నూతన టీచర్లకు ఏకంగా ఇంక్రిమెంట్లు నిలిపివేశారు.
పరిగి, దోమ తదితర మండలాల్లోనూ ఇదే తరహాలో వసూళ్లు చేస్తున్నారు. మరికొందరు టీచర్లు డీడీఓల నుంచి యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు తెలుసుకుని వివరాలు నమోదు చేస్తున్నారు.
చేజారి.. చిక్కుల్లో పడి..
ఉద్యోగుల వివరాల నమోదు అంతా డీడీఓ కనుసన్నలోనే జరగాలి. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో డీడీఓ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ గోప్యంగా ఉంచాలి. అయితే కొన్ని మండలాల్లో నమోదు ప్రక్రియను డీడీఓలు ప్రైవేటు వ్యక్తుల ద్వారా చేయిస్తున్నారు. ఈ సందర్భంలో కొందరు పాస్‌వర్డ్‌లను మార్చేస్తున్నారు. దీంతో ఆ ఐడీ బ్లాక్ కావడంతో.. వ్యవహారం మొదటికి వస్తోంది. మళ్లీ ఫైనాన్స్ శాఖను సంప్రదించాల్సి వస్తోంది. ఇటీవల ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలంలో కొందరి డీడీఓల యూజర్ ఐడీలు బ్లాక్ కావడంతో ఉద్యోగులు నానాతంటాలు పడ్డారు.
వివరాలకు వెల!
Published Mon, Jan 6 2014 12:05 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement