Treasury officers
-
జీతాలు, పెన్షన్ల చెల్లింపులో నిర్లక్ష్యంపై సర్కారు కన్నెర్ర
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు బిల్లులు రూపొందించి, ప్రాసెస్ చేయడం, ఆమోదించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై రాష్ట్ర ఆర్థిక శాఖ కొరఢా ఝళిపించింది. ఎన్ని సార్లు ఆదేశాలు జారీ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లను, విభాగాధిపతులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శనివారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలు, పెన్షన్లు చెల్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. జీతాలు పెరగలేదని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం సరికాదని నిరూపించాలని ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తోంది. జనవరి 1న తీసుకున్న వేతనం, ఫిబ్రవరి 1న తీసుకునే వేతనంతో పోల్చి చూసుకోవడం ద్వారా ఉద్యోగులు వాస్తవాలు గ్రహిస్తారని భావిస్తోంది. అందరికీ జీతాలు పెరిగాయన్న ప్రభుత్వ వాదన నిజమేనని ఉద్యోగులు తెలుసుకోవడం ద్వారా అసంతృప్తి తగ్గుతుందని ఈ ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ఉద్యోగ సంఘాల వెనుక ఉన్న రాజకీయ ప్రమేయం, వాళ్లను రాజకీయంగా వాడుకోవాలని చూస్తుండటం తదితర విషయాలన్నీ ఉద్యోగులు గ్రహిస్తారని.. అందుకోసమే ఎలాగైనా ఫిబ్రవరి 1న జీతాలు చెల్లించేలా చూడాలని ప్రభుత్వం తాపత్రయ పడుతోంది. రెండు నెలల మధ్య జీతంలో తేడా ఎంత ఉందో తెలుసుకోవడం ద్వారా అత్యధిక శాతం ఉద్యోగులు వాస్తవాలు గ్రహిస్తారని భావిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం జారీ అయిన మెమోలోని వివరాలు ఇలా ఉన్నాయి. ► ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నుంచి పెరిగిన వేతనాలను ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించాలి. ► ఇందుకోసం కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేళ్లు నిర్ధారించి ప్రాసెస్ చేసి.. వేతనాలు, పెన్షన్ బిల్లులను ఆమోదించడానికి పలు సార్లు నిర్ధిష్ట టైమ్‌లైన్‌తో ఆదేశాలు జారీ చేశాం. అయినా అందుకు అనుగుణంగా విధులు నిర్వహించడంలో చాలా మంది డీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించి బిల్లులు రూపొందించలేదు. వేతన బిల్లులను ఎస్టీవోలు ఆమోదించ లేదు. ఇలాంటి వారందరినీ ఉపేక్షించేది లేదు. ► కోవిడ్ క్లిష్ట సమయంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పూర్తి, పార్ట్ టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు, రోజు వారీ వేతన కార్మికులు, హోంగార్డులు, ఆశా కార్యకర్తలు, అంగన్ వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన సర్వీస్ ప్రొవైడర్లకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి కల్పించిన అధికారులు, ఉద్యోగులపై సీసీఏ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి. ► శనివారం సాయంత్రం 6 గంటల వరకు వేచి చూసి, విధి నిర్వహణలో వైఫల్యం చెందిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి వేతనాలను ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించేందుకు అవసరమైతే ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్ ఆఫీసర్ ప్రతిపాదించాలి. -
ఈ–కుబేర్ కాదు.. ఈ–కుదేల్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఓ భరోసా. ఎలాంటి పరిస్థితులలో అయినా ప్రతినెలా మొదటి రోజు వేతనాలు వస్తాయనే నమ్మకం. అయితే, ఉద్యోగుల వేతనాల చెల్లింపుల ప్రక్రియను మరింత వేగవంతం, సరళతరం చేసేందుకు అమలులోకి తెచ్చిన ఈ–కుబేర్ వ్యవస్థలోని సాంకేతిక సమస్యలు కొందరు ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారాయి. ఆగస్టు నెల ముగింపునకు వచ్చినా ఇంకా వేతనాలు అందలేదు. దీంతో వేతనాలు అందని వారంతా ట్రెజరీ విభాగాల చుట్టూ తిరుగుతున్నారు. ట్రెజరీ అధికారులు ఒక్కో ఉద్యోగికి సంబంధించిన వివరాలను సరి చూస్తూ పరిష్కరిస్తున్నారు. సాంకేతిక సమస్యలను ముగించే ప్రక్రియ ఆలస్యమవు తుండటంతో నెల ముగిసే సమయానికి కూడా అందరికీ వేతనాలు అందే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈలోపు ఆగస్టు నెల వేతనాలను చెల్లించే ప్రక్రియ మొదలైంది. సాంకేతిక సమస్యలతో ఆగస్టులో వేతనాలు అందని వారికి, సెప్టెంబర్‌లోనూ ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఈ–కుబేర్ కొత్త విధానంలో సాఫ్ట్‌వేర్‌తో ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరించేందుకు సరిపడా సాంకేతిక సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ఆగస్టు నుంచే... ఉద్యోగుల వేతన చెల్లింపు ప్రక్రియలో ఆగస్టు 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ‘డిజిటల్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా ఆర్బీఐ కొత్తగా అమలులోకి తెచ్చిన ఈ–కుబేర్ విధానాన్ని దీనికి వర్తింపజేశారు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల వేతనాల బిల్లులను ట్రెజరీ అధికారులు ‘ఈ–కుబేర్’సాఫ్ట్‌వేర్‌తో ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ వివరాలు ఆర్బీఐకి చేరుతాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) పద్ధతిలో ఆర్బీఐ నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలను జమ చేస్తుంది. ఒకటో తేదీ ఆదివారం అయినా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ అవుతాయి. సాంకేతిక సమస్యలు మొదట 2.56 లక్షల మంది పెన్షనర్లకు అమలుచేసిన ఈ–కుబేర్ విధానాన్ని ఆగస్టు ఆరంభం నుంచి ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నారు. మొదట అందరు ఉద్యోగుల ఖాతాల్లో ఒక్కో రూపాయి చొప్పున డిపాజిట్ చేసి పరిశీలించారు. కొంతమంది ఉద్యోగుల బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ నంబర్లు తప్పుగా ఉండడంతో వారికి ఈ మొత్తం జమ కాలేదు. ఇలాంటి వాటిని సరిచేసి ఆగస్టు 1న వేతనాలు జమ చేశారు. అయితే ఒక రూపాయి జమ చేసిన సందర్భంలో వచ్చిన సమస్యలను పరిష్కరించినా, పూర్తి వేతనాలు ఇచ్చినప్పుడూ ఇదే జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పది శాతం మంది ఉద్యోగులకు వేతనాలు జమ కాలేదు. ఉద్యోగుల వేతన బిల్లులను డ్రాయింగ్, డిస్బర్సింగ్ ఆఫీసర్ (డీడీవో) దశలవారీగా ఆన్లైన్ ద్వారా ఈ–కుబేర్‌కు పంపారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా ఉద్యోగులకు ఈ నెలలో వేతనాలు జమ కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇలా రిజెక్టయిన వారు ఒక్కొక్కరుగా వెళ్లి ట్రెజరీ అధికారులకు విజ్ఞప్తులు చేయడంతో సాంకేతిక సమస్యలను పరిష్కరించి వేతనాలు ఖాతాకు జమచేస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులకు ఇదే సమస్య రావడంతో పరిష్కారంకోసం ఎక్కువ రోజులు పడుతోంది. - ఈ–కుబేర్ విధానంలో ఒకవ్యక్తికి సంబం ధించిన డబ్బులు ఒకే ఖాతాలో జమ అవుతా యి. ఒక ఉద్యోగికి ఒకటికంటే ఎక్కువ బ్యాం కు ఖాతాలు ఉంటే సమస్యలు వస్తాయి. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొంది న వ్యక్తికి వేతనం ఒక బ్యాంకు ఖాతాలో, పెన్షన్ మరో ఖాతాలో జమవుతుంది. - పోలీసు శాఖలో విధి నిర్వహణలో చనిపోయిన సిబ్బందికి వారి రిటైర్మెంట్ వయస్సు వరకు పూర్తి వేతనం అదే ఖాతాలో జమ అవుతుంది. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుడు ఉద్యోగం పొందితే ఆ వేతనం వేరే ఖాతాలో జమ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ–కుబేర్ సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందులు వస్తున్నాయి. -
పెరిగిన వేతనం ఎప్పుడొస్తుందో!
- రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల మంది వీఆర్ఏల ఎదురుచూపులు - వేతనం రూ.10,500కు పెంచుతున్నట్లు సీఎం ప్రకటన - రెండు నెలలు దాటినా అతీగతీలేని ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ‘గ్రామీణులకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్న వీఆర్ఏలకు గుర్తింపుగా వారి వేతనాన్ని రూ.6,500 నుంచి రూ. 10,500కు పెంచుతున్నాం. ప్రతినెలా ఒకటో తేదీన మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీఆర్ఏలకు ’కూడా వేతనం అందాలి. పెరిగిన వేతనం, పిలిచే పిలుపుతో వీఆర్ఏలకు ఆత్మగౌరవం పెరగాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గత ఫిబ్రవరి 24న ప్రకటించారు. వీఆర్ఏ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వారసత్వ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన గ్రామ రెవెన్యూ సహాయకు (వీఆర్ఏ)లకు కూడా సీఎం పలు వరాలిచ్చారు. అయితే.. నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి ఇచ్చిన వరాలకు సంబంధించి రెవెన్యూశాఖ వైపు నుంచి అడుగు ముందుకు పడలేదు. కనీసం ఏప్రిల్ 1 నుంచి పెరిగిన వేతనమైనా చేతికొస్తుందని ఆశపడిన వీఆర్ఏలకు నిరాశే ఎదురైంది. రెవెన్యూ శాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో పాత వేతనాలకు మాత్రమే బిల్లులు చేస్తామని ట్రెజరీ అధికారులు స్పష్టం చేశారు. వీఆర్ఏలు మాత్రం కొత్త వేతనం రూ.10,500 ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూస్తున్నారు. ఒక్క హామీ కూడా నెరవేరలేదాయె.. రాష్ట్రవ్యాప్తంగా 22,245 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు పనిచేస్తున్నారు. వీరిలో 19,345 మంది వారసత్వ వీఆర్ఏలు కాగా, ఏపీపీఎస్సీ నిర్వహించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన వీఆర్ఏలు 2,900 మంది ఉన్నారు. వేతన పెంపుతోపాటు రూ.200 తెలంగాణ ఇంక్రిమెంట్, వారసత్వ వీఆర్ఏలకు డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అర్హులైన వీఆర్ఏల కోసం వివిధ ప్రభుత్వ విభాగాల్లోని డ్రైవర్, అటెండర్, వీఆర్వో పోస్టులను 30 శాతం రిజర్వ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. వెట్టి, కవాల్ కార్, మస్కూరి, కాన్‌దార్.. తదితర పేర్లతో పనిచేసే వీరందరినీ ఇకపై గౌరవంగా వీఆర్ఏలుగా సంబోధించాలని సీఎం కేసీఆర్ సూచించారు. అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించేందుకు విధి విధానాలను రూపొందించాలని టీఎస్పీఎస్సీ చైర్మన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే, నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి వీఆర్ఏలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటికూడా ఇంతవరకు అమలుకు నోచుకోలేదని వీఆర్ఏల సంఘాలు వాపోతున్నాయి. వీఆర్ఏలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాకపోవడానికి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణమని వీఆర్ఏ సంఘాల ప్రతినిధులు వింజమూరి ఈశ్వర్, రమేశ్ బహద్దూర్ అన్నారు. సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టుల్లో ఇన్చార్జ్ అధికారులు ఉండటం వల్లే, సకాలంలో ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. -
ఖజానాలకు తాళం
కాకినాడ లీగల్:జిల్లాల ఎక్కడి బిల్లులక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాలతో కాకినాడలోని జిల్లా ఖజానా కార్యాలయంతో పాటు 18 ఉప ఖజానా కార్యాలయాల్లో చెల్లింపులు నిలిచిపోవడంతో బిల్లుల కోసం తిరుగుతున్న వారు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. జిల్లాలో ఖజానా శాఖ ద్వారా ప్రతి నెలా సుమారు రూ.460 కోట్లు పైబడే చెల్లింపులు జరుగుతుంటాయి. వీటిలో రూ.200 కోట్టు వేతనాలు, పింఛన్లు ఉంటాయని ట్రెజరీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో తాత్కాలికంగా ట్రెజరీల్లో బిల్లులను సర్కార్ నిలుపుదల చేసిందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలోని అన్ని సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో చెల్లింపులు నిలిపివేయమని ఖజానాశాఖ డిప్యూటీ డెరైక్టర్ జి.లలిత ఆదేశాలు జారీచేశారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా అన్ని ట్రెజరీ కార్యాలయాల్లో ఎక్కడి బిల్లులు అక్కడే ఆపేశారు. కారణమేమైనా సర్కార్ నిర్ణయంతో జిల్లాలో ప్రతి రోజూ రూ.8 కోట్ల పైబడి లావాదేవీలు నిలిచిపోతున్నాయి. గత ఐదురోజులుగా రూ.40 కోట్ల బిల్లులకు బ్రేక్‌లు పడ్డాయి. ఈ నెల ఒకటి నుంచే బిల్లుల చెల్లింపును నిలిపివేయడంతో బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, వివిధ సంస్థల ప్రతినిధులు ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బిల్లులు మంజూరు చేయకున్నా తమకు వచ్చిన బిల్లులను తీసుకుంటూ టోకెన్లు మాత్రం వేస్తున్నారు. అంతకు మించి ఒక అడుగు ముందుకు పడటం లేదు. ప్రభుత్వాదేశాలతో జిల్లాలో సుమారు 40 వేల మంది పెన్షనర్లు, సుమారు 48 వేల మంది ఉద్యోగుల బిల్లులు, వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం వంటి వాటికి మాత్రమే చెల్లింపులు చేస్తున్నారు. మిగిలిన జీపీఎఫ్, సప్లిమెంటరీ, కంటింజెంట్, అడ్వాన్సులు, మెయింటెనెన్స్(ప్రభుత్వ శాఖలు చెల్లించే అద్దెలు, నీటి పన్ను, విద్యుత్ బిల్లులు) తదితర బిల్లులన్నీ నిలిచిపోయాయి. ఈ నెల 10 నాటికి సర్కార్ ఆర్థిక వెసులు బాటు కల్పిస్తే ఫర్వాలేదని, లేకుంటే 15 వరకు చెల్లింపులు నిలిచిపోతాయని ఖజానాశాఖ వర్గాలంటున్నాయి. ప్రతి నెలా 20 నుంచి 25 వరకు వేతనాల బిల్లులు వెళ్తుంటాయి. ఆ బిల్లులను ఒకటో తేదీ నుంచి విడుదల చేస్తుంటారు. ఈ నెల కూడా అదే క్రమంలో వేతనాలు, పింఛన్ల బిల్లులు మంజూరు కావడంతో ఇతర బిల్లులు కూడా విడుదలవుతాయనుకున్నా ప్రభుత్వ ఉత్తర్వులతో ఆటంకం ఎదురైంది. ప్రభుత్వాదేశాలతోనే నిలిపివేశాం.. ప్రభుత్వాదేశాల ప్రకారమే బిల్లుల చెల్లింపు నిలిపివేశాం. ఈ నెల 10 తరువాత చెల్లింపులు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ బిల్లులు సర్దుబాటు కారణంగా ఇతర బిల్లులను కొన్ని రోజులు నిలుపుదల చేయవలసి వస్తోంది. - జి.లలిత, డిప్యూటీ డెరైక్టర్, జిల్లా ఖజానా శాఖ, కాకినాడ -
నిధులు ఫ్రీజింగ్!
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : కోశాధికారి కార్యాలయం నుంచి నిధుల చెల్లింపుపై ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించినట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం సాయంత్రం ట్రెజరీ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. జీతాలతోపాటు కొన్ని అత్యవసర బిల్లులు తప్పితే మిగతా అన్ని చెల్లింపులు నిలిచిపోనున్నాయి. ఈనెల 12 వరకు బిల్లుల చెల్లింపులు ఉన్నప్పటికీ ప్రభుత్వంపై రెవెన్యూ భారం పడకుండా తాత్కాలికంగా ఈ ఫ్రీజింగ్ విధించినట్లు సమాచారం. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉండనుంది. ఉద్యోగుల జీతాలు, ఆస్పత్రి, జైలు, హాస్టల్ డైట్ చార్జీలు, జీపీఎఫ్, లోన్స్ అండ్ అడ్వాన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్, పెన్షన్స్, వడ్డీ చెల్లింపులు మినహా మిగతా అన్నింటిపై ఫ్రీజింగ్ విధించారు. గురువారం నుంచి ఇది అమల్లోకి రానుంది. పలు బిల్లుల చెల్లింపులు జరగవు. ప్రయాణ భత్యం, ఆఫీసు సాధారణ నిర్వహణ ఖర్చులు, టెలిఫోన్, విద్యుత్ శాఖ బిల్లులు, కార్యాలయ భవనాల అద్దెలు, వాహన అద్దె, పెట్రోల్‌కు సంబంధించి బిల్లుల చెల్లింపులు నిలిచిపోనున్నాయి. అయితే ఇది తాత్కాలికమేనని తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉండగా మార్చి 31లోగా మిగులు బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయాలి.