పెరిగిన వేతనం ఎప్పుడొస్తుందో!
- రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల మంది వీఆర్‌ఏల ఎదురుచూపులు
- వేతనం రూ.10,500కు పెంచుతున్నట్లు సీఎం ప్రకటన
- రెండు నెలలు దాటినా అతీగతీలేని ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ‘గ్రామీణులకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్న వీఆర్‌ఏలకు గుర్తింపుగా వారి వేతనాన్ని రూ.6,500 నుంచి రూ. 10,500కు పెంచుతున్నాం. ప్రతినెలా ఒకటో తేదీన మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీఆర్‌ఏలకు ’కూడా వేతనం అందాలి. పెరిగిన వేతనం, పిలిచే పిలుపుతో వీఆర్‌ఏలకు ఆత్మగౌరవం పెరగాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గత ఫిబ్రవరి 24న ప్రకటించారు.
వీఆర్‌ఏ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వారసత్వ, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులైన గ్రామ రెవెన్యూ సహాయకు (వీఆర్‌ఏ)లకు కూడా సీఎం పలు వరాలిచ్చారు. అయితే.. నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి ఇచ్చిన వరాలకు సంబంధించి రెవెన్యూశాఖ వైపు నుంచి అడుగు ముందుకు పడలేదు. కనీసం ఏప్రిల్ 1 నుంచి పెరిగిన వేతనమైనా చేతికొస్తుందని ఆశపడిన వీఆర్‌ఏలకు నిరాశే ఎదురైంది. రెవెన్యూ శాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో పాత వేతనాలకు మాత్రమే బిల్లులు చేస్తామని ట్రెజరీ అధికారులు స్పష్టం చేశారు. వీఆర్‌ఏలు మాత్రం కొత్త వేతనం రూ.10,500 ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూస్తున్నారు.
ఒక్క హామీ కూడా నెరవేరలేదాయె..
రాష్ట్రవ్యాప్తంగా 22,245 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు పనిచేస్తున్నారు. వీరిలో 19,345 మంది వారసత్వ వీఆర్‌ఏలు కాగా, ఏపీపీఎస్సీ నిర్వహించిన డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులైన వీఆర్‌ఏలు 2,900 మంది ఉన్నారు. వేతన పెంపుతోపాటు రూ.200 తెలంగాణ ఇంక్రిమెంట్, వారసత్వ వీఆర్‌ఏలకు డబుల్‌బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అర్హులైన వీఆర్‌ఏల కోసం వివిధ ప్రభుత్వ విభాగాల్లోని డ్రైవర్, అటెండర్, వీఆర్‌వో పోస్టులను 30 శాతం రిజర్వ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. వెట్టి, కవాల్ కార్, మస్కూరి, కాన్‌దార్.. తదితర పేర్లతో పనిచేసే వీరందరినీ ఇకపై గౌరవంగా వీఆర్‌ఏలుగా సంబోధించాలని సీఎం కేసీఆర్ సూచించారు.
అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించేందుకు విధి విధానాలను రూపొందించాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే, నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటికూడా ఇంతవరకు అమలుకు నోచుకోలేదని వీఆర్‌ఏల సంఘాలు వాపోతున్నాయి. వీఆర్‌ఏలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాకపోవడానికి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణమని వీఆర్‌ఏ సంఘాల ప్రతినిధులు వింజమూరి ఈశ్వర్, రమేశ్ బహద్దూర్ అన్నారు. సీసీఎల్‌ఏ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టుల్లో ఇన్‌చార్జ్ అధికారులు ఉండటం వల్లే, సకాలంలో ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.