సర్దుబాటు
► ప్రభుత్వ ఉద్యోగుల విభజన పూర్తి!
► ఒక్కో జిల్లాకు 3వేలకుపైగా పోస్టులు అవసరమని అంచనా
► జిల్లా పరిషత్ కిందికి డీఆర్‌డీఏ, డ్వామా శాఖలు?
► ప్రస్తుతం 2వేలకు పైగా పోస్టులు ఖాళీ
► రెవెన్యూశాఖలోనే ఖాళీలు బోలెడు
► ఆర్టీసీలో రీజినల్ మేనేజర్ పోస్టుల రద్దు?
► కొత్త జిల్లాలపై సమగ్ర నివేదికకు అధికారుల తుదిరూపు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల విభజన దాదాపు పూర్తికావొచ్చింది.. ప్రభుత్వం ఇదివరకే కేటాయించిన పోస్టులను కొత్తగా ఏర్పడే మూడు జిల్లాలకు సర్దుబాటుచేసే ప్రక్రియలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కొత్త జిల్లాల సమగ్ర సమాచారాన్ని ఈనెల 20న సమర్పించాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ ఆదేశించడంతో వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పూర్తి సమాచారాన్ని అధికారులు సిద్ధంచేశారు. మొత్తం 63 ప్రభుత్వ శాఖల్లో 8605మంది ఉద్యోగులు, అధికారులు పనిచేస్తున్నారు. వీరిని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాకు కేటాయించిన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉండడంతో వివిధస్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఒక రెవెన్యూశాఖలోనే దాదాపు 60 నుంచి 80మంది ఉద్యోగుల అవసరం ఉంది. ఇలా అన్నిశాఖలను కలుపుకుని 1100మంది ఉద్యోగులను అదనంగా నియమించాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. ఏర్పడే వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాలు పనిచేయాలంటే కలెక్టరేట్‌లో నాలుగు సెక్షన్లు ఏర్పాటుచేయాలి.
ప్రతి సెక్షన్‌కు నలుగురు తహసీల్దార్ స్థాయి పర్యవేక్షకులు అవసరమవుతారు. అయితే ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఏడు సెక్షన్లు కొనసాగుతున్నాయి. జిల్లాలు ఏర్పడిన తరువాత మండలాలు తగ్గడంతో కొంత పనిభారం తగ్గే అవకాశం ఉందని, కొత్త జిల్లా కేంద్రాల్లో తొలుత కనీస సిబ్బందితో పనులు నడిపించడానికి అవసరమయ్యే అవకాశాలపై నివేదికలు రూపొందిస్తున్నారు.
ఆ.. మూడుశాఖల విలీనం?
ప్రస్తుత జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పంచాయతీరాజ్ శాఖలో భాగంగా ఉండడంతో వీటిని జిల్లా పరిషత్ పరిధిలోకి తెచ్చి ఒకే గొడుగు కింద నిర్వహించేందుకు గల అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆర్టీసీ వంటి సంస్థలకు నూతన జిల్లాల్లో కొత్తగా రీజనల్ మేనేజర్ స్థాయి పోస్టులు కేటాయించాల్సిన అవసరం పెద్దగా లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. మహబూబ్‌నగర్ పరిధిలోనే ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ డిపోలు పనిచేసే విధంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో ఆ జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని యథావిధిగా కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమగ్ర సమాచారాన్ని నివేదిక రూపంలో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిని కలెక్టర్ శ్రీదేవి..ఈనెల 20న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.