సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటన త్వరలో రానుంది. రిటైర్డు ఐఏఎస్ సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) దీనికి సంబంధించి మరో రెండ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. 10 నుంచి 12 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీ కమిషన్‌ను ఆదేశించారు. నిర్దేశించిన గడువుకు చివరి రోజు 22న వేతన సవరణ సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుందని రాష్ట్ర సచివాలయ ఉన్నత స్థాయి అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. పీఆర్సీ నివేదిక అందిన తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సం ఘాల నేతలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. ఉద్యోగులు ఆశిస్తున్న ఫిట్‌మెంట్ శాతంతో పాటు వారికి సంబం ధించిన ఇతర సమస్యలపై చర్చించనున్నారు.
ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల తొలి వారంలో సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యోగ సంఘాలతో చర్చలు ఫలించిన తర్వాత గతంలో మాదిరిగానే సీఎం కేసీఆర్ ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేస్తారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. 10వ పీఆర్సీ అమలు కాలపరిమితి 2018 జూన్ 30తో ముగిసిపోగా, జూలై 1 నుంచి ఉద్యోగులకు వేతన సవరణ వర్తింపజేయాల్సి ఉంది. నూతన సంవత్సరం కానుకగా 2020 జనవరి 1 నుంచి వేతన సవరణ చెల్లింపుల ప్రయోజనాల (మానిటరీ బెనిఫిట్స్)ను ప్రభుత్వం ఉద్యోగులకు వర్తింపజేసే అవకాశాలున్నాయి. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని సైతం జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫిట్‌మెంట్‌పై అందరి దృష్టి...
సీఆర్ బిస్వాల్ చైర్మన్‌గా, ఉమామహేశ్వర్ రావు, మహమ్మద్ అలీ రఫత్ సభ్యులుగా 2018 మే 18న పీఆర్సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వేతన సవరణతో పాటు సర్వీసు రూల్స్ సరళీకరణ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని పీఆర్సీ కమిషన్‌ను అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల సూచి ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపును ఖరారు చేయడమే ఫిట్‌మెంట్. వేతన సవరణ నివేదికలో ప్రధాన అంశమైన ఫిట్‌మెంట్ శాతంపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 63 శాతం ఫిట్‌మెంట్ వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నాయి. ప్రదీప్‌కుమార్ అగర్వాల్ నేతృత్వంలోని గత పీఆర్సీ కమిషన్ 29 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించగా, సీఎం కేసీఆర్ అనూహ్యంగా 43 శాతానికి పెంచారు.
సంప్రదాయం కొనసాగిస్తారా..?
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులను బేరీజు వేసుకుని బిస్వాల్ కమిషన్ ఫిట్‌మెంట్ శాతాన్ని సిఫార్సు చేయనుందని చర్చ జరుగుతుండటంతో ఉద్యోగవర్గాల్లో కొంత ఆందోళన నెలకొంది. పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసిన ఫిట్‌మెంట్ శాతాన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించిన అనంతరం కొంత వరకు పెంచి అమలు చేసే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. పీఆర్సీ కమిషన్ ఎంత శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసినా, సీఎంతో చర్చల సందర్భంగా మెరుగైన ఫిట్‌మెంట్ కోసం ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఏపీలో ఇప్పటికే ఉద్యోగలకు 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో అంత కంటే ఎక్కువే ఫిట్‌మెంట్‌ను ప్రకటించవచ్చని ఉద్యోగులు ఆశతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment