కాకినాడ లీగల్:జిల్లాల ఎక్కడి బిల్లులక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాలతో కాకినాడలోని జిల్లా ఖజానా కార్యాలయంతో పాటు 18 ఉప ఖజానా కార్యాలయాల్లో చెల్లింపులు నిలిచిపోవడంతో బిల్లుల కోసం తిరుగుతున్న వారు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. జిల్లాలో ఖజానా శాఖ ద్వారా ప్రతి నెలా సుమారు రూ.460 కోట్లు పైబడే చెల్లింపులు జరుగుతుంటాయి. వీటిలో రూ.200 కోట్టు వేతనాలు, పింఛన్‌లు ఉంటాయని ట్రెజరీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో తాత్కాలికంగా ట్రెజరీల్లో బిల్లులను సర్కార్ నిలుపుదల చేసిందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.
జిల్లాలోని అన్ని సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో చెల్లింపులు నిలిపివేయమని ఖజానాశాఖ డిప్యూటీ డెరైక్టర్ జి.లలిత ఆదేశాలు జారీచేశారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా అన్ని ట్రెజరీ కార్యాలయాల్లో ఎక్కడి బిల్లులు అక్కడే ఆపేశారు. కారణమేమైనా సర్కార్ నిర్ణయంతో జిల్లాలో ప్రతి రోజూ రూ.8 కోట్ల పైబడి లావాదేవీలు నిలిచిపోతున్నాయి. గత ఐదురోజులుగా రూ.40 కోట్ల బిల్లులకు బ్రేక్‌లు పడ్డాయి. ఈ నెల ఒకటి నుంచే బిల్లుల చెల్లింపును నిలిపివేయడంతో బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, వివిధ సంస్థల ప్రతినిధులు ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బిల్లులు మంజూరు చేయకున్నా తమకు వచ్చిన బిల్లులను తీసుకుంటూ టోకెన్‌లు మాత్రం వేస్తున్నారు. అంతకు మించి ఒక అడుగు ముందుకు పడటం లేదు.
ప్రభుత్వాదేశాలతో జిల్లాలో సుమారు 40 వేల మంది పెన్షనర్లు, సుమారు 48 వేల మంది ఉద్యోగుల బిల్లులు, వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం వంటి వాటికి మాత్రమే చెల్లింపులు చేస్తున్నారు. మిగిలిన జీపీఎఫ్, సప్లిమెంటరీ, కంటింజెంట్, అడ్వాన్సులు, మెయింటెనెన్స్(ప్రభుత్వ శాఖలు చెల్లించే అద్దెలు, నీటి పన్ను, విద్యుత్ బిల్లులు) తదితర బిల్లులన్నీ నిలిచిపోయాయి. ఈ నెల 10 నాటికి సర్కార్ ఆర్థిక వెసులు బాటు కల్పిస్తే ఫర్వాలేదని, లేకుంటే 15 వరకు చెల్లింపులు నిలిచిపోతాయని ఖజానాశాఖ వర్గాలంటున్నాయి. ప్రతి నెలా 20 నుంచి 25 వరకు వేతనాల బిల్లులు వెళ్తుంటాయి. ఆ బిల్లులను ఒకటో తేదీ నుంచి విడుదల చేస్తుంటారు. ఈ నెల కూడా అదే క్రమంలో వేతనాలు, పింఛన్‌ల బిల్లులు మంజూరు కావడంతో ఇతర బిల్లులు కూడా విడుదలవుతాయనుకున్నా ప్రభుత్వ ఉత్తర్వులతో ఆటంకం ఎదురైంది.
ప్రభుత్వాదేశాలతోనే నిలిపివేశాం..
ప్రభుత్వాదేశాల ప్రకారమే బిల్లుల చెల్లింపు నిలిపివేశాం. ఈ నెల 10 తరువాత చెల్లింపులు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ బిల్లులు సర్దుబాటు కారణంగా ఇతర బిల్లులను కొన్ని రోజులు నిలుపుదల చేయవలసి వస్తోంది.
- జి.లలిత, డిప్యూటీ డెరైక్టర్, జిల్లా ఖజానా శాఖ, కాకినాడ
ఖజానాలకు తాళం
Published Sat, Jun 6 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM
Advertisement
Advertisement