సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సచివాలయ, రైతుభరోసా కేంద్రాల పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను సిద్ధంచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో జరిగే ఈ పనులకు సంబంధించి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు విడుదల రావాల్సి ఉన్నప్పటికీ.. పనులు చేసిన కాంట్రాక్టర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే ముందస్తుగా అడ్వాన్స్ రూపంలో రూ.1,000 కోట్లను గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించింది. వీటి విడుదలకు సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు సంబంధించిన నిధులు కూడా ఒకట్రెండు రోజుల్లో జమయ్యే అవకాశం ఉందని ఆ శాఖాధికారులు వెల్లడించారు.
రావాల్సింది రూ.3,350 కోట్లు
ఇక ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరిలో కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇవ్వాల్సిన బకాయిలతో కలిపి మొత్తం రూ.3,350 కోట్ల వరకు రాష్ట్రానికి విడుదల చేయాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో గత ఏడాది నవంబరు నెలాఖరు వరకు జరిగిన పనులకు సుమారు రూ.1,510 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అడ్వాన్స్ రూపంలో విడుదల చేసిన రూ.1,000 కోట్లకు తోడు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలుగా గత ఏడాదికి సంబంధించి విడుదలైన రూ.320 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలా మొత్తంమీద గత ఏడాది నవంబరు వరకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1,510 కోట్లకు గాను ప్రస్తుతం రూ.1,320 కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ వద్ద సమకూరడంతో చాలావరకు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది.
టీడీపీ ప్రభుత్వ బకాయిలు కూడా చెల్లింపు
2019లో నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిధులు లేకపోయినా ఆ పార్టీ నేతల కోసం పెద్దఎత్తున పనులు మంజూరు చేసింది. వీటికి సంబంధించి దాదాపు రూ.1,500 కోట్ల బకాయిలను గత కొన్ని నెలలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment