సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ పని దినాలు కల్పించడంలోనే కాకుండా వేతనాల చెల్లింపులోనూ నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక ఏడాది (2022–23) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఆంధ్రప్రదేశ్ ఏకంగా 15.11 కోట్లకు పైగా పని దినాలను కల్పించింది. వీరికి వేతనాల రూపంలో రూ.3,084.94 కోట్లు చెల్లించింది. మరే రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం, వేతనాలు చెల్లించడం చేయలేదని నివేదిక స్పష్టం చేసింది.
కేవలం ఉపాధి హామీ పథకం అమలులోనే కాకుండా ఎస్సీ ఉపప్రణాళిక ద్వారా ఎస్సీ కుటుంబాలకు సాయం అందించడం, ఎస్సీ విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు మంజూరులోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం చాలా మంచి పనితీరు కనబరిచిందని నివేదిక పేర్కొంది.
లక్ష్యాల్లో 90 శాతానికిపైగా అమలు చేసిన రాష్ట్రాలను చాలా మంచి పనితీరు చూపినవాటిగా తెలిపింది. 80 శాతం నుంచి 90 శాతం మేర అమలు చేసిన రాష్ట్రాలు మంచి పనితీరు కనబరిచినట్టు పేర్కొంది. ఇక లక్ష్యాల అమలులో 80 శాతం లోపు నిలిచినవాటిని పనితీరు బాగోలేని రాష్ట్రాలుగా వర్గీకరించింది.
పెద్ద రాష్ట్రాలను మించి..
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో సామాజిక ఆస్తుల కల్పనలో భాగంగా పెద్ద ఎత్తున గ్రామ, వార్డు సచివాలయ భవనాలు నిర్మిస్తోంది. అలాగే రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్, వార్డు హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను కూడా చేపడుతోంది. మరోవైపు నాడు–నేడు కింద విద్య, వైద్య రంగాల్లో ఆస్తుల కల్పన పనులను చేపట్టింది. దీంతో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పెద్ద ఎత్తున పని కల్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 11.66 కోట్ల పని దినాలు, రాజస్థాన్‌లో 10.26 కోట్ల పని దినాలను కల్పించినట్టు నివేదిక తెలిపింది. ఈ రెండు ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద రాష్ట్రాలైనప్పటికీ ఏపీలోనే అత్యధికంగా పనిదినాలు కల్పించడం గమనార్హం.
ఎస్సీ ఉప ప్రణాళిక అమల్లోనూ ఏపీ భేష్..
దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా ఎస్సీ ఉప ప్రణాళికను కూడా ఏపీ బాగా అమలు చేసిందని నివేదికలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ప్రశంసించింది. 23 రాష్ట్రాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద మొత్తం 20,61,846 ఎస్సీ కుటుంబాలకు సాయం అందగా.. అందులో ఒక్క ఏపీలోనే 20,29,192 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించినట్లు వెల్లడించింది.
అలాగే 23 రాష్ట్రాల్లో తొలి త్రైమాసికంలో మొత్తం 7.62 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద సాయం అందగా.. ఇందులో ఒక్క ఏపీలోనే 3.98 లక్షల మందికి అందించడం విశేషం. అలాగే రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ ఏపీ చాలా మంచి పనితీరు చూపినట్టు నివేదిక స్పష్టం చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి త్రైమాసికంలో 6,123 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యం కాగా లక్ష్యానికి మించి ఏకంగా 285 శాతం మేర 17,708 కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment