
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు నెలల మధ్య ఐదునెలల్లో రాష్ట్రమంతటా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనుల కల్పన ద్వారా ప్రభుత్వం పేదలకు రూ.3,400.46 కోట్ల లబ్ధి కలిగించింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని రోజు సైతం పనుల కోసం ఎవరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఆ గ్రామంలోనే అడిగిన వారికల్లా పనులు కల్పించింది. రాష్ట్రంలో దాదాపు 98 లక్షల కుటుంబాలున్నాయి.
వీటిలో 40.36 లక్షల కుటుంబాలు ఈ ఐదునెలల్లో సొంత ఊళ్లోనే ఉపాధిహామీ పథకంలో పనులు చేసుకున్నాయి. ఒక్కో కుటుంబం సరాసరి రూ.8,425 చొప్పున ప్రయోజనం పొందింది. 40.36 లక్షల కుటుంబాలకు చెందిన 65.74 లక్షలమంది కూలీలు 16.02 కోట్ల పనిదినాలపాటు ఈ పథకంలో పనిచేసుకుని లబ్ధిపొందారు. అందులో అత్యధికంగా 23.71 శాతం మేర ఎస్సీ కుటుంబాల వారున్నారు. ఈ పనులతో 9.44 శాతం ఎస్టీ కుటుంబాలు లబ్ధిపొందాయి.
ఉపాధిహామీ పథకం ద్వారా పేదలకు పనుల కల్పనలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. మన రాష్ట్రంతో పోలిస్తే మూడురెట్ల కన్నా ఎక్కువ ఉండే ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య 17.73 కోట్ల పనిదినాలు కల్పించి రూ.3,818 కోట్ల మేర పేదలకు లబ్ధికలిగించింది. ఇదే కాలంలో మన రాష్ట్రం 16.56 కోట్ల పనిదినాలపాటు పేదలకు పనులు కల్పించి రూ.3,400.46 కోట్ల ప్రయోజనం చేకూర్చి రెండోస్థానంలో ఉంది.
ఏప్రిల్–ఆగస్టు మధ్య పేదలకు అత్యధికంగా ఉపాధి పనులు కల్పించిన పది రాష్ట్రాలు