హైకోర్టు తీర్పు నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడికొండలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు
సాక్షి, అమరావతి: నిలువ నీడలేని దాదాపు 50,000 నిరుపేద కుటుంబాలకు మంచి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతి పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందంటూ అసంబద్ధమైన వాదనలతో రైతుల ముసుగులో కోర్టుకెక్కిన టీడీపీ నేతలకు చెంపపెట్టు లాంటి తీర్పును వెలువరించింది.
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించేందుకు హైకోర్టు నిరాకరించింది. పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలివ్వకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని రైతుల పేరుతో కొందరు దాఖలు చేసిన అభ్యర్థనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈమేరకు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టి వేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 45, ఇళ్ల పట్టాల కేటాయింపు ప్రధాన వ్యాజ్యాలు తాము వెలు వరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.
అన్ని వర్గాల అభివృద్ధితోనే..
రాజధానిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు మేరకే ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు మంజూరు చేస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. రాజధాని నగర నిర్మాణం చేపట్టేందుకు, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిస్తూ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది.
అన్ని వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్), దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వర్గాల అభివృద్ధి కూడా రాజధాని అభివృద్ధిలో భాగమే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది.
రాజధాని అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో రైతులు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులిస్తే అది న్యాయ ఔచిత్యాన్ని ఉల్లంఘించినట్లవుతుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా అడ్డుకోండి..
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్‌డీఏను అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతుల పేరుతో హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలను కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు.
వీటిపై గత నెల 21న వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ధర్మాసనం తన నిర్ణయాన్ని వెలువరించడానికి ముందే రాజధాని రైతుల తరఫు న్యాయవాది సంజయ్ సూరనేని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇచ్చేస్తోందని, అందువల్ల ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆ లేఖలో కోరారు. దీంతో ధర్మాసనం రైతుల వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టింది.
రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దేవ్‌దత్ కామత్, సీనియర్ న్యాయవాది వీఎస్సార్ ఆంజనేయులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీఆర్‌డీఏ తరఫున కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. రైతులు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం తన నిర్ణయాన్ని వెలువరించింది.
పిటిషనర్లు ప్రభావితం కావడం లేదు..
‘గత మాస్టర్ ప్లాన్‌లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) ఇళ్ల స్థలాల కోసం ఎలాంటి నిర్దిష్ట ప్రాంతాన్ని కేటాయించలేదు. ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పేదలకు ఇస్తోందని, ఆ భూమి ల్యాండ్ పూలింగ్ స్కీంలోని లేఔట్లలో భాగం కాదని మా దృష్టికి తెచ్చారు. పేదలకు ఇప్పుడు కేటాయిస్తున్న స్థలంతో పిటిషనర్లకు (రాజధాని రైతులు) ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు.
పేదలకు ఇవ్వదలచిన స్థలం ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించింది. రాజధాని అభివృద్ధిలో భాగమైన నవ నగరాలు చెక్కు చెదరకుండా ఉండటమన్న అంశం సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూములపై పిటిషనర్లకు ఎలాంటి హక్కు లేనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు చేస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల ప్రత్యక్షంగా వారు ఏ విధంగానూ ప్రభావితం కారు.
రాజధాని అభివృద్ధి కోసం పూలింగ్‌లో భాగంగా తమ భూములిచ్చామని పిటిషనర్లు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ కూడా అందులో భాగమని, ఎలక్ట్రానిక్ సిటీని దెబ్బ తియ్యడమంటే తమ హక్కులను హరించడమేనని వారు వాదిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తం సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. అందువల్ల పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మేం సుముఖంగా లేం’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment