సాక్షి, అమరావతి: ‘పేదరికంపైనే నా యుద్ధం.. పేదల సంక్షేమమే నా లక్ష్యం’ అని విస్పష్టంగా పేర్కొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయ సాధనలో కీలక మైలురాయిని అధిగమించారు. మొత్తం జనాభాలో పేదలు 10 శాతం కంటే తక్కువగా ఉండాలన్న నీతి ఆయోగ్ ప్రాథమిక లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా 2021లో సాధించింది. విపక్షాలు రాజకీయ దురుద్దేశాలతో ఎంత బురద జల్లుతున్నా సంక్షేమ ఫలాలు పేదల అభ్యున్నతికి దోహదపడుతున్నట్లు మరోసారి రుజువైంది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘జాతీయ బహుముఖ పేదరిక సూచీ’ నివేదిక ఈ వాస్తవాన్ని గణాంకాలతో సహా వెల్లడించింది. 2016 కంటే 2021 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలు దాదాపుగా సగం వరకు తగ్గారని నివేదిక తెలిపింది. మరోవైపు ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని పేర్కొంది.
పౌష్టికాహారం, శిశు మరణాల రేటు, తల్లుల ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు శాతం, వంటనూనెల వినియోగం, పరిశుభ్రత, తాగునీరు, గృహ వసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు కలిగి ఉండటం లాంటి 12 అంశాలు ప్రామాణికంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే నివేదికను నీతి ఆయోగ్ తాజాగా వెల్లడించింది. అందులో ప్రధానాంశాలు ఇవీ..
గ్రామాల్లో గణనీయంగా తగ్గుదల..
ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం తగ్గుతోందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2016 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 11.77 శాతం మంది ప్రజలు నిరుపేదలుండగా 2021 డిసెంబర్ నాటికి 6.06 శాతానికి తగ్గారు. నిరుపేదలు 5.71 శాతం తగ్గారని నీతి ఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గడం గమనార్హం. 2016 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 14.72 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 4.63 శాతం మంది నిరుపేదలున్నారు. 2021 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు 7.71 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 2.20 శాతానికి తగ్గారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 7.01 శాతం, పట్టణ ప్రాంతాల్లో 2.43 శాతం పేదరికం తగ్గింది.
12 అంశాల్లోనూ మెరుగైన పనితీరు
బహుముఖ పేదరిక నిర్మూలనకు సంబంధించి నీతి ఆయోగ్ పరిగణలోకి తీసుకున్న 12 అంశాల్లోనూ ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరిచింది. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు (వంటనూనెల వినియోగం, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ వినియోగం, గృహనిర్మాణం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు) ఇలా అన్నింటిలో రాష్ట్రం ప్రగతి సాధించింది.
చంద్రబాబు సాధించలేనిది... జగన్ చేసి చూపారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాల ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు సత్ఫలితాలను అందిస్తున్నట్లు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. పేదరిక నిర్మూలనకు నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిగమించడమే అందుకు నిదర్శనం. బహుముఖ పేదరిక సూచీల ప్రమాణాల ప్రకారం జనాభాలో పేదలు 10 శాతం కంటే తక్కువ ఉండాలని నీతి ఆయోగ్ పేర్కొంది.
2016 డిసెంబర్‌లో నీతి ఆయోగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం మొత్తం జనాభాలో 10 శాతం కంటే తక్కువ పేదలున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, కేరళ, గోవా, మిజోరాం రాష్ట్రాలే ఆ జాబితాలో ఉన్నాయి. 2016 డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలు 11.77 శాతం మంది ఉన్నారు.
అంటే జనాభాలో 10 శాతం లోపే పేదలు ఉండాలన్న లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ సాధించలేకపోయింది. అయితే 2021నాటికి ఆంధ్రప్రదేశ్ పేదల సంక్షేమంలో గణనీయమైన ప్రగతి సాధించింది. నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించింది. పేదరికాన్ని సమర్థంగా కట్టడి చేసిన రాష్ట్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. రాష్ట్ర జనాభాలో నిరుపేదలను 6.06 శాతానికి తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment