ఏపీ గ్రోత్‌ స్టోరీ దేశానికే స్ఫూర్తి.. నేరుగా చూడటానికి రాష్ట్రానికి వచ్చా | NITI Aayog Member Ramesh Chand Praises AP Govt Policies on Agriculture | Sakshi
Sakshi News home page

ఏపీ గ్రోత్‌ స్టోరీ దేశానికే స్ఫూర్తి.. నేరుగా చూడటానికి రాష్ట్రానికి వచ్చా

Published Sat, Jul 23 2022 3:10 AM | Last Updated on Sat, Jul 23 2022 7:56 AM

NITI Aayog Member Ramesh Chand Praises AP Govt Policies on Agriculture - Sakshi

నీతి ఆయోగ్‌ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్త రమేష్‌ చంద్‌

(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి)
వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాలు అనుసరించాలని తాను సూచిస్తానని నీతి ఆయోగ్‌ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్త, ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్‌ చెప్పారు. రైతు గుమ్మం ముందు సేవలు అందిస్తున్న ఆర్బీకేలు, ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు వ్యవసాయ ముఖ చిత్రాన్ని మారుస్తాయని విశ్వసిస్తున్నానని అన్నారు. సాగులో అనుసరిస్తున్న ఈ విధానాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, ఈ విధానాలు ‘యూనిక్‌’గా ఉన్నాయని అభివర్ణించారు.

రెండున్నర దశాబ్దాలుగా వ్యవసాయ విధానాల రూపకల్పనలో విశేష అనుభవం ఉన్న ఆయన 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. నీతి ఆయోగ్‌లో చేరక ముందు ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పాలసీ రీసెర్చ్‌’ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆస్ట్రేలియా, జపాన్‌లో ప్రముఖ యూనివర్సిటీలకు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. నీతి ఆయోగ్‌లో సభ్యుడిగా వ్యవసాయ రంగాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన.. ఏపీలో అమలువుతున్న వ్యవసాయ విధానాలు, ఆర్బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవలను స్వయంగా చూడటానికి రాష్ట్రానికి వచ్చారు. కంకిపాడు మార్కెట్‌ యార్డ్‌లోని అగ్రి ల్యాబ్‌లో ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

డిజిటల్‌ టెక్నాలజీ వినియోగం
ఏపీలో ఆర్బీకేలు అందిస్తున్న సేవల గురించి విన్నాను. క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరును స్వయంగా  పరిశీలించడానికి వచ్చాను. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని(ఐటీ) వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల్లో  వినియోగిస్తున్న విధానాన్ని చూశాను. డిజిటల్‌ టెక్నాలజీ వినియోగానికి ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ మంచి ఉదాహరణ. రైతులు సలహాలు, సూచనలు అడుగుతున్న తీరు, అనుమానాలను నివృత్తి చేసుకుంటున్న విధానాన్ని కాల్‌ సెంటర్‌లో పరిశీలించాను. 
రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే)ను సందర్శించాను. సాగుకు సంబంధించిన ‘ఇంటిగ్రేటెడ్‌ సొల్యూషన్‌ ఎట్‌ వన్‌ ప్లేస్‌’గా ఇది రైతులకు తోడ్పాటు అందిస్తోంది. రైతులకు సలహాలు, సూచనలే కాదు.. వారికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను అందించే కేంద్రంగా ఉపయోగపడుతోంది. వ్యవసాయ కేంద్రాలంటే కేవలం పంటలకే పరిమితం కావడం నేను చాలా చోట్ల చూశాను. కానీ ఆర్బీకే అలా లేదు. పశువులు, జీవాలు, ఫిషరీస్‌కు సంబంధించిన కార్యకలాపాలు కలగలిసే ఉన్నాయి. 

నా అభిప్రాయం మార్చుకుంటున్నా..
వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం (అడ్వాన్స్‌ టెక్నాలజీ) వినియోగించుకోవడంలో పంజాబ్‌ రాష్ట్రమే దేశంలో ముందుందని అనుకున్నా. ఇక్కడ గ్రామ స్థాయిలో కల్పించిన సౌకర్యాలు, అమలు చేస్తోన్న కార్యక్రమాలు చూసిన తర్వాతæ నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నా. ఇక్కడి వ్యవసాయ వి«ధానాలు, కార్యక్రమాలు చాలా వినూత్నంగా ఉన్నాయి. 
ఆర్బీకేలు, ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, అగ్రి ల్యాబ్స్‌ అద్భుతం. మిగతా రాష్ట్రాలకు అనుసరణీయం. వ్యవసాయ రంగం దేశంలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలంటే దేశ వ్యాప్తంగా ఇలాంటి సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా. జాతీయ స్థాయిలో అమలు చేయాలని సిఫారసు చేస్తా. 

సాగు చేసి నష్టపోవడమనే సమస్యే తలెత్తదు.. 
దేశంలో చాలా కాల్‌ సెంటర్స్‌ను చూసాను. కానీ ఇంత పక్కాగా, ప్రణాళికాబద్దంగా నిర్వహిస్తున్న కాల్‌ సెంటర్‌ ఇదే. శాస్త్రవేత్తలు, అధికారులను రైతులతో అనుసంధానించడం గొప్ప ఆలోచన. శాస్త్రీయ అంశాలను నేరుగా రైతులకు చేర్చడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దేశమంతా ఈ విధానం అనుసరించాలి.
కియోస్క్‌లో రైతులు ఎరువులు బుక్‌ చేసుకుంటున్న విధానాన్ని స్వయంగా చూశా. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యద్భుతంగా వినియోగించుకుంటున్నారు. 
108, 104 అంబులెన్స్‌ తరహాలో మారుమూల పల్లెల్లో పశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న అంబులేటరీ సేవలు రైతులకు చాలా ఉపయోగం. 
వ్యవసాయ రంగంలో నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు పెద్ద సమస్య. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్బీకేలు ఉపయోపగపడుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీల నుంచి రైతులకు అందించడం వల్ల నాణ్యమైన ఇన్‌పుట్స్‌ చౌకగా రైతులకు లభిస్తున్నాయి. 
వాటి నాణ్యతను పరీక్షించడానికి ల్యాబ్‌లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం, నాణ్యత లేని వాటిని తిరస్కరించడం ద్వారా.. నాణ్యత లేని మెటీరియల్‌ ఏదీ రైతులకు చేరదు. ఫలితంగా సాగు చేసి నష్టపోవడమనే సమస్యే తలెత్తదు. 
ఇక్కడ అనుసరిస్తున్న విధానాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖతో కలిసి సంయుక్తంగా అధ్యయన పత్రం రూపొందించి, నీతి ఆయోగ్‌ ద్వారా ప్రచురిస్తాం. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ విధానాల సమాచారం ఇతర రాష్ట్రాలకు అందుబాటులో ఉంటుంది. 

చాలా సమస్యలకు పరిష్కారం
రైతు వ్యాపారస్తుడిగా(ట్రేడర్‌గా) మారి తన పంట తాను అమ్ముకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం మంచి పరిణామం. తద్వారా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. రైతులకు గిట్టుబాట ధర లభించడానికి, మార్కెటింగ్‌లో ఉన్న సమస్యలు అధిగమించడానికి ఈ విధానం దోహదం చేస్తుంది.
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురావడంలో నా పాత్ర ఉంది. రైతు ట్రేడర్‌గా మారాలనేది నా కల. కనీసం చట్టంలో అయినా రైతులు ట్రేడర్లుగా మారాలని నా కోరిక. దురదృష్టవశాత్తు ఆ చట్టాలు వెలుగు చూడలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవడం సంతోషం. 
ఏపీ వ్యవసాయ రంగం ‘గ్రోత్‌ స్టోరీ’ దేశానికి స్ఫూర్తినిస్తుంది. కేవలం పంటలే కాకుండా పశుపోషణ, ఆక్వా, ఇతర అనుబంధ రంగాల్లోనూ వృద్ధి రేటు బాగుంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 1 శాతం వృద్ధి నమోదైతే, దారిద్య్రం కనీసం 4 శాతం తగ్గుతుంది. వ్యవసాయ ఆధారిత సమాజం మనది. ఈ రంగంలో వృద్ధి అత్యవసరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement