Ramesh Chand: దేశ సగటు కంటే ఏపీ వృద్ధి భేష్‌ | NITI Aayog Member Ramesh Chand Praises AP Govt | Sakshi
Sakshi News home page

Ramesh Chand: దేశ సగటు కంటే ఏపీ వృద్ధి భేష్‌

Published Sat, Jul 23 2022 4:00 AM | Last Updated on Sat, Jul 23 2022 10:55 AM

NITI Aayog Member Ramesh Chand Praises AP Govt - Sakshi

రమేష్‌ చంద్‌కు జ్ఞాపిక అందిస్తున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: తలసరి ఆదాయం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పశు సంపద తదితర విషయాల్లో దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధి చాలా బాగుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను ఆయన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  వివరించారు. దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉందని, ప్రతి రంగంలో లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బృందం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైంది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపట్టిన.. ప్రధానంగా జీరో బేస్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్, ఆర్గానిక్‌ వ్యవసాయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. పండ్లు, మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్‌ వన్‌గా నిలిచిందని రమేష్‌ చంద్‌ తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగు ద్వారా వంట నూనెల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయంసమృద్ధి సాధించిందని చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సమగ్ర వ్యవస్థ అందుబాటులో ఉందని, క్షేత్ర స్థాయిలో ఆర్బీకేలు అత్యుత్తమ వ్యవస్థ అని కితాబు ఇచ్చారు. ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ దేశం సగటు కన్నా ఆంధ్రప్రదేశ్‌ సగటు అధికంగా ఉందని పేర్కొన్నారు. 

వ్యవసాయ, విద్య, వైద్య, గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ బృందానికి వివరించారు. వ్యవసాయం, వైద్య, విద్య, గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని తెలిపారు. ఈ రంగాల్లో చాలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గర్భవతులు, బాలింతలు, చిన్నారులు, బడి పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా సంపూర్ణ పోషణ, గోరుముద్ద లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత కోసం బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను పెట్టామని, గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి.. వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా డెలివరీ మెకానిజాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నామని తెలిపారు. డీబీటీ విధానంలో ఏపీది అగ్రస్థానమని స్పష్టం చేశారు.

పిల్లలను బడికి పంపించేలా తల్లులను చైతన్య పరచడానికి అమ్మ ఒడిని అమలు చేస్తున్నామని, దీనివల్ల  జీఈఆర్‌ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) పెరుగుతోందని చెప్పారు. విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని, ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకునేలా పిల్లలను తయారు చేస్తున్నామని వివరించారు.  ఇంగ్లిష్‌ మీడియం, నాణ్యమైన విద్య దిశగా అడుగులు వేస్తున్నామని, నాడు –నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చామని, తరగతి గదులను డిజిటల్‌ ఉపకరణాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సబ్జెక్టుల వారీగా బోధనకు టీచర్లను నియమిస్తున్నామని, ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పూర్తి స్థాయి రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, వసతి దీవెన కింద కూడా ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నామని, దీనివల్ల జీఈఆర్‌ గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు.

జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులు
ప్రభుత్వాస్పత్రుల్లో, బోధనాస్పత్రుల్లో నాడు –నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపడుతున్నామని సీఎం తెలిపారు. ప్రతి గ్రామంలో, వార్డుల్లో విలేజ్, వార్డు క్లినిక్స్‌ పెడుతున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీకి రిఫరల్‌ పాయింట్‌గా, వ్యాధుల నివారణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని, పీహెచ్‌సీలతో.. అక్కడున్న డాక్టర్లతో అనుసంధానమవుతాయని వివరించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను కూడా అమల్లోకి తీసుకువస్తున్నామని తెలిపారు. 3 వేలకు పైగా చికిత్సలకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నామని, ప్రతిపార్లమెంటు నియోజకవర్గంలో తప్పనిసరిగా మెడికల్‌ కాలేజీ ఉండేలా కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్బీకేల వ్యవస్థ, సీఎం యాప్‌ పనితీరు.. తదితర అంశాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కోసం కొత్తగా చేపడుతున్న 26 యూనిట్ల గురించి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇతర కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వారికి వివరించారు. 

ఆర్బీకే చానల్, ఆర్బీకే, అగ్రి ల్యాబ్‌ సందర్శన
సాక్షి, అమరావతి/ఉయ్యూరు/కంకిపాడు: నీతి ఆయోగ్‌ సభ్యుడు (వ్యవసాయం) ప్రొఫెసర్‌ రమేష్‌చంద్‌.. నీతి ఆయోగ్‌ సలహాదారు సి.పార్థసారథిరెడ్డితో కలిసి శుక్రవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, ఆర్బీకే చానల్‌ను సందర్శించారు. కాల్‌ సెంటర్‌ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకే చానల్‌ ద్వారా ప్రసారమవుతున్న వ్యవసాయ ప్రాయోజిత కార్యక్రమాల వీడియోలను తిలకించారు. అనంతరం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట–2 ఆర్బీకేను సందర్శించి, అక్కడ కియోస్క్‌లో ఎరువులు బుక్‌ చేసుకుంటున్న విధానాన్ని, డిజిటల్‌ లైబ్రరీలోని మ్యాగజైన్స్, పంటల వారీగా ఉన్న బుక్‌లెట్స్‌ను, మినీ టెస్టింగ్‌ కిట్‌లు, సాయిల్, మాయిశ్చూర్‌ మిషన్ల ద్వారా చేస్తోన్న పరీక్షలను పరిశీలించారు.

పొలంబడి ప్లాట్‌ను పరిశీలించిన సందర్భంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న రైతులకు జీఏపీ సర్టిఫికేషన్‌ ఇవ్వబోతున్నామని, భవిష్యత్‌లో సేంద్రియ ధ్రువీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య వివరించారు. ఆర్బీకే ఆవరణలో ఉన్న వైఎస్సార్‌ పశు సంచార వైద్య సేవా రథం, రైతు చైతన్య రథాలను పరిశీలించి వాటి ద్వారా అందిస్తోన్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గండిగుంటలో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ‘తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఇన్నాళ్లుకు రైతు ముంగిటకు సేవలు వచ్చాయి. మా ఊళ్లో ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సర్టిఫైడ్‌ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తున్నారు. పంటలనూ కొనుగోలు చేస్తున్నారు.

నిజంగా జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత మాటల్లో చెప్పలేం’ అంటూ నందం జోగేశ్వరరావు, గెత్తం విజయ్‌కుమార్‌ అనే రైతులు వివరించారు. ఆ తర్వాత కంకిపాడు అగ్రి ల్యాబ్‌ను సందర్శించి, అక్కడ ఇన్‌పుట్స్‌ను పరీక్షిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ‘రైతుల ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, గ్రామ స్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాలు చాలా వినూత్నంగా ఉన్నాయి’ అని విజిటర్స్‌ బుక్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement