ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)
పెద్దతిప్పసముద్రం(అన్నమయ్య జిల్లా): ఉపాధి పనులు చేయకున్నా చేసినట్లు ఇష్టానుసారంగా బిల్లులు చేసుకుంటామంటే ఇకపై కుదరదు. ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా తనిఖీ చేసినా, గ్రామసభల ద్వారా అవినీతి నిగ్గు తేల్చాలని శ్రమించినా పెద్దగా ప్రయోజనం లేదన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడేది. దీంతో అవినీతి అక్రమాలకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేస్తే కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా ఇట్టే దొరికిపోతారు.
అందుబాటులోకి ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్
గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అదే విధంగా దాదాపుగా అడిగిన వారందరికీ పనులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న టీసీఎస్ సాఫ్ట్‌వేర్‌లో పనుల గుర్తింపు, బిల్లుల మంజూరు, వేతనదారుల కూలీల చెల్లింపులు తదితర పనులు నిర్వహించేవారు. తాజాగా దాని స్థానంలో ఎన్‌ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్) సాఫ్ట్‌వేర్‌ను తీసుకు వచ్చారు. ఇందులో ఎన్నో రకాల కొత్త ఆప్షన్లున్నాయి. పథకానికి సంబంధించి డ్వామా అనుబంధ శాఖలైన పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ శాఖ సిబ్బందికి కొత్త సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ ఇచ్చారు. ఉపాధి ఉద్యోగుల రిజిస్ట్రేషన్ పూర్తి కాగా, ఎంపీడీవోలు, ఏపీవోలకు కొత్త లాగిన్ ఐడీలు అందజేసారు.
ఇప్పటి వరకు ఇలా..
పాత సాఫ్ట్‌వేర్‌లో 160 రకాల పనులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పటి వరకు చెరువులు, ఊట కుంటలు, చెక్‌డ్యాంలు, కమ్యూనిటీ సోక్ పిట్స్, సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు), అవెన్యూ ప్లాంటేషన్స్, ఫాంపాండ్స్, ఇంకుడు గుంతలు, హార్టికల్చర్, పంట కాల్వలు, పూడిక తీత, స్మశానానికి రోడ్డు సదుపాయం తదితర పనులు చేసేవారు.
ఇప్పుడు ఇలా..
కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి 264 రకాల పనులను చేసుకోవచ్చు. రైతుల పొలాల్లో మట్టి, రాళ్ళతో గట్లు వేసుకోవడం, కాలువల్లో పూడిక తీత, సామాజిక బీడు భూముల అభివృద్ధి, సిమెంటు, కాంక్రీట్‌లతో చెక్‌డ్యాంలు నిర్మించడం, చెత్త కేంద్రాల నుంచి వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ విధానం లాంటి పనులను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి పనులు చేపట్టవచ్చు.
అక్రమాలకు చెక్
పాత సాఫ్ట్‌వేర్‌లో చేసిన పనులనే పదే పదే చూపిస్తూ ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌లో పనులు నమోదు చేస్తే ఆ పనుల స్థానంలో మళ్ళీ పనులు చేసేందుకు మూడేళ్ళ వరకూ అవకాశం ఉండదు. పని జరిగిన చోట దాదాపు 25 అడుగుల విస్తీర్ణం వరకు కొత్త పనులు చేసేందుకు అనుమతి ఇచ్చే సమస్యే లేదు. ఒక గ్రామంలో జరిగిన పనులను మరో గ్రామంలో జరిగినట్లు చూపించి అక్రమంగా బిల్లులు చేసుకునేందుకు కూడా అవకాశం ఉండదు.
అక్రమాలకు తావు ఉండదు
‘ఉపాధి’లో ప్రభుత్వం అమలు చేసిన కొత్త సాఫ్ట్‌వేర్ విధానంపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. ఎస్టిమేషన్స్ లాంటి అంశాలపై వివరించాం. ఇప్పుడు పనుల గుర్తింపు, చెల్లింపులు కూడా కొత్త సాఫ్ట్‌వేర్ విధానం ద్వారానే చేస్తున్నాం. పథకం లక్ష్యాలను పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నాం. అక్రమాలకు తావు లేకుండా పనులను పారదర్శకంగా చేపడుతున్నాం. కూలీల సంఖ్య పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం.
– గిరిధర్‌రెడ్డి. ఎంపీడీవో. పెద్దతిప్పసముద్రం మండలం
Comments
Please login to add a commentAdd a comment