Employment Works
-
‘ఉపాధి’లో అక్రమాలకు చెక్
పెద్దతిప్పసముద్రం(అన్నమయ్య జిల్లా): ఉపాధి పనులు చేయకున్నా చేసినట్లు ఇష్టానుసారంగా బిల్లులు చేసుకుంటామంటే ఇకపై కుదరదు. ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా తనిఖీ చేసినా, గ్రామసభల ద్వారా అవినీతి నిగ్గు తేల్చాలని శ్రమించినా పెద్దగా ప్రయోజనం లేదన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడేది. దీంతో అవినీతి అక్రమాలకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేస్తే కొత్త సాఫ్ట్వేర్ ద్వారా ఇట్టే దొరికిపోతారు. అందుబాటులోకి ఎన్ఐసీ సాఫ్ట్వేర్ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అదే విధంగా దాదాపుగా అడిగిన వారందరికీ పనులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న టీసీఎస్ సాఫ్ట్‌వేర్‌లో పనుల గుర్తింపు, బిల్లుల మంజూరు, వేతనదారుల కూలీల చెల్లింపులు తదితర పనులు నిర్వహించేవారు. తాజాగా దాని స్థానంలో ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్) సాఫ్ట్‌వేర్‌ను తీసుకు వచ్చారు. ఇందులో ఎన్నో రకాల కొత్త ఆప్షన్లున్నాయి. పథకానికి సంబంధించి డ్వామా అనుబంధ శాఖలైన పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖ సిబ్బందికి కొత్త సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ ఇచ్చారు. ఉపాధి ఉద్యోగుల రిజిస్ట్రేషన్ పూర్తి కాగా, ఎంపీడీవోలు, ఏపీవోలకు కొత్త లాగిన్ ఐడీలు అందజేసారు. ఇప్పటి వరకు ఇలా.. పాత సాఫ్ట్‌వేర్‌లో 160 రకాల పనులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పటి వరకు చెరువులు, ఊట కుంటలు, చెక్‌డ్యాంలు, కమ్యూనిటీ సోక్ పిట్స్, సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు), అవెన్యూ ప్లాంటేషన్స్, ఫాంపాండ్స్, ఇంకుడు గుంతలు, హార్టికల్చర్, పంట కాల్వలు, పూడిక తీత, స్మశానానికి రోడ్డు సదుపాయం తదితర పనులు చేసేవారు. ఇప్పుడు ఇలా.. కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి 264 రకాల పనులను చేసుకోవచ్చు. రైతుల పొలాల్లో మట్టి, రాళ్ళతో గట్లు వేసుకోవడం, కాలువల్లో పూడిక తీత, సామాజిక బీడు భూముల అభివృద్ధి, సిమెంటు, కాంక్రీట్లతో చెక్‌డ్యాంలు నిర్మించడం, చెత్త కేంద్రాల నుంచి వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ విధానం లాంటి పనులను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి పనులు చేపట్టవచ్చు. అక్రమాలకు చెక్ పాత సాఫ్ట్‌వేర్‌లో చేసిన పనులనే పదే పదే చూపిస్తూ ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌లో పనులు నమోదు చేస్తే ఆ పనుల స్థానంలో మళ్ళీ పనులు చేసేందుకు మూడేళ్ళ వరకూ అవకాశం ఉండదు. పని జరిగిన చోట దాదాపు 25 అడుగుల విస్తీర్ణం వరకు కొత్త పనులు చేసేందుకు అనుమతి ఇచ్చే సమస్యే లేదు. ఒక గ్రామంలో జరిగిన పనులను మరో గ్రామంలో జరిగినట్లు చూపించి అక్రమంగా బిల్లులు చేసుకునేందుకు కూడా అవకాశం ఉండదు. అక్రమాలకు తావు ఉండదు ‘ఉపాధి’లో ప్రభుత్వం అమలు చేసిన కొత్త సాఫ్ట్వేర్ విధానంపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. ఎస్టిమేషన్స్ లాంటి అంశాలపై వివరించాం. ఇప్పుడు పనుల గుర్తింపు, చెల్లింపులు కూడా కొత్త సాఫ్ట్వేర్ విధానం ద్వారానే చేస్తున్నాం. పథకం లక్ష్యాలను పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నాం. అక్రమాలకు తావు లేకుండా పనులను పారదర్శకంగా చేపడుతున్నాం. కూలీల సంఖ్య పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. – గిరిధర్‌రెడ్డి. ఎంపీడీవో. పెద్దతిప్పసముద్రం మండలం -
2022–23లో 30 కోట్ల పనిదినాల ఉపాధి
సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఉపాధిహామీ పథకం ద్వారా 30 కోట్ల పనిదినాల పాటు పనులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు గ్రామాల వారీగా పనులు కావాలని కోరుకుంటున్న వారిని గుర్తించిన గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రతిపాదిత లేబర్ బడ్జెట్ రూపొందించారు. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా ఒక్కో జిల్లాలో మూడుకోట్లకుపైగా పనిదినాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో పనిదినానికి 60:40 నిష్పత్తిన కూలీకి ప్రస్తుత రేట్ల ప్రకారం గరిష్టంగా రూ.245 వేతన రూపంలో చెల్లించడంతోపాటు మెటీరియల్ విభాగంలో మరో రూ.163 కేటాయిస్తారు. కూలీలు వారు కోరుకున్నప్పుడు వారి సొంత గ్రామంలోనే పనులను కల్పించేందుకు వీలుగా ఆయా గ్రామాల్లో కొత్త పనులు గుర్తించే ప్రక్రియ క్షేత్రస్థాయిలోని ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్ల ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతోంది. ఇలా గుర్తించిన పనులకు మొదట గ్రామసభ, తరువాత పంచాయతీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించే సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత లేబర్ బడ్జెట్‌కు ఆమోదం లభిస్తే.. ప్రసుత ఉపాధి పథకం కూలీరేట్ల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల కూలీలకు గరిష్టంగా రూ.7,350 కోట్లు వేతనాల రూపంలో లభించే అవకాశం ఉంది. కూలీలకు గిట్టుబాటయ్యే సరాసరి వేతనాల మొత్తం ఆధారంగా గరిష్టంగా మరో రూ.4,890 కోట్లు మెటీరియల్ కోటాలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకునేందుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. 56.98 లక్షల కుటుంబాలకు ప్రయోజనం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 97.73 కోట్ల కుటుంబాలకు చెందిన 1.95 కోట్ల మంది ఉపాధిహామీ పథకం కూలీలుగా నమోదయ్యారు. వీరిలో 56.98 లక్షల కుటుంబాల వారు క్రియాశీలకంగా ఏటా పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 45.45 లక్షల కుటుంబాలకు 21.73 కోట్ల పనిదినాల పాటు ప్రభుత్వం పనులు కల్పించింది. రూ.4,817 కోట్లను కూలీలకు వేతనాల రూపంలో చెల్లించింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోవడం వల్ల ఇప్పటి నుంచి మళ్లీ ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి 26 కోట్ల పనిదినాల పాటు పనుల కల్పన పూర్తిచేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. -
రూ.700 కోట్లతో ఉపాధి పనులు
ఒంగోలు టౌన్: ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల విలువైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఆదేశించారు. ఉపాధి పనులకు ఏప్రిల్ నుంచి జులై వరకు ఎంతో కీలకమైనందున వ్యవసాయ కూలీలకు ఆసరాగా ఉండి విరివిగా పనులు కల్పించి వలసలు నివారించాలని సూచించారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై డ్వామా, లైన్ డిపార్ట్మెంట్, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016–2017 ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి హామీ పనుల కింద రూ.601 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. 2018–2019 ఆర్ధిక సంవత్సరంలో రూ.700 కోట్లతో చేపట్టనున్న పనుల్లో, రూ.400 కోట్లు వేజ్ కాంపోనెంట్ కింద, రూ.300 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు పెట్టాలన్నారు. ఎక్కువ శాతం కూలీలు హాజరయ్యేలా చూడాలి: జిల్లాలో నెలకొన్న కరువును దృష్టిలో ఉంచుకొని ఎక్కువ శాతం వేతన కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరయ్యేలా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఏపీఓలు పర్యవేక్షిస్తూ ఉండాలని వినయ్‌చంద్ సూచించారు. నీరు–ప్రగతి ఉద్య మం, ఎవెన్యూ ప్లాంటేషన్, చెరువు కట్టల బలో పేతం, ఫీడర్ కెనాల్స్ పనులు, చెరువుల్లో పూడికతీత పనులు, స్ట్రెంచస్, పంట కుంటల పనులు ఉపాధి హామీలో చేపట్టాలని సూచిం చారు. 2017–2018 ఆర్థిక సంవత్సరంలో 83 వేల కుటుంబాలకు 100 రోజులు పని కల్పిం చారని, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో లక్షా 75 వేల కుటుంబాలకు 100 రోజులు పని కల్పించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సగటున రోజుకు రూ.190 నుంచి రూ.202 వరకు వేతనం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనులు జూన్ నాటికి పూర్తి చేయాలి: జిల్లాలో 2016–2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న ఉపాధి పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని వినయ్‌చంద్ ఆదేశించారు. 2017–2018 సంవత్సరంలో అసంపూర్తి పనులను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. ఉపాధి పనులను జియోట్యాగింగ్ చేయాలన్నారు. వర్క్‌షాపులో డ్వామా పీడీ పోలప్ప, జెడ్పీ సీఈఓ కైలాస్ గిరీశ్వర్, డీపీఓ ప్రసాద్, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో ఎస్ఈ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘కూలి’పోతోంది
సాక్షి, రాజమహేంద్రవరం: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)లో పని చేస్తున్న కూలీల కష్టానికి సకాలంలో ఫలం దక్కడం లేదు. ఉపాధి లేని సమయంలో పేదలకు పనులు చూపించాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఎన్ఆర్ఈజీఎస్ జిల్లాలో ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. పని చేసిన వారం కూలి డబ్బు మరో వారం తిరిగేకల్లా రావాల్సి ఉండగా జిల్లాలో రెండున్నర నెలలుగా అందడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.52 కోట్ల మేర బకాయిలు పెడుతూ ‘ఇదిగో అదిగో’ అంటూ క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్న మాటలతో బడుగుజీవులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. వీరి వెతలకు అండగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీన రాజానగరం నియోజకవర్గంలో ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి రాజానగరంలో కూలీలతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో అనూహ్య స్పందన రావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టడానికి శ్రీకారం చుడుతున్నారు. బకాయిలతో తగ్గిపోతున్న కూలీల సంఖ్య... ఆ వారంలో చేసిన మస్తర్లను అధికారులు వారాంతంలో నమోదు చేస్తున్నారు. వారం రోజుల కూలి డబ్బు మరో వారం తిరిగే కల్లా కూలీల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. జిల్లాలో 6.5 లక్షల కుటుంబాలకు ఉపాధి జాబ్ కార్డులు జారీ చేశారు. ఇందులో గడచిన ఆరు నెలల్లో 3.61 లక్షల కుటుంబాలు ఉపాధి పనుల్లో పాల్గొన్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 1,86,75,000 పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ నెల 11వ తేదీ వరకు 1,38,73,000 పని దినాలు కల్పించారు. ఇందుకుగాను రూ.225 కోట్లు కూలీలకు చెల్లించాల్సి ఉండగా రూ.173 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. జూలై ఆఖరి వారం నుంచి రెండున్నర నెలలుగా రూ.52 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. బ్యాంకుల ముందు పడిగాపులు... గతంలో పోస్టాఫీసుల ద్వారా జరిగే ఉపాధి కూలీ నగదు చెల్లింపులు 2014 నుంచి కూలీల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం ప్రారంభించారు. బ్యాంకు ఖాతా తీసుకున్న తర్వాతే కొత్తగా జాబ్ కార్డులు జారీ చేస్తున్నారు. కూలీల బ్యాంకు ఖాతాలకు వారి ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న నిబంధనతో కూలీలకు కొత్త సమస్యలు వచ్చాయి. రెండు మూడు ఖాతాలున్న వారు అధికారులకు ఒక ఖాతా నంబరు ఇచ్చి బ్యాంకులో మరో ఖాతాకు తమ ఆధార్ నంబర్‌ను ఇవ్వడంతో సమస్య జటిలమవుతోంది. ఆధార్ నంబర్ అనుసంధానం కాలేదని అధికారులు చెబుతుండగా, తాము బ్యాంకులో ఇచ్చామని కూలీలు వాపోతున్నారు. ఆధార్ అనుసంధానం కాని కూలీలకు ఐదారు నెలలుగా చెల్లింపులు ఆగిపోయాయి. అందుకు సంబంధించిన నగదు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైనా అధార్ అనుసంధాన సమస్యతో కూలీలకు చేరడంలేదు. ఫలితంగా నగదు కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేంద్ర బృందం పర్యటించినా ఫలితం శూన్యం... జిల్లాలో ఉపాధి హామీ పనుల తీరు పరిశీలించేందుకు గత నెల్లో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. ఏజెన్సీ, ఆ తర్వాత మెట్ట ప్రాంతంలో ఉపాధి పనులు ఎక్కువగా జరుగుతున్నాయని గమనించింది. ఆ సమయంలో కూలీలు తమకు గతంలోలాగే పోస్టాఫీసుల ద్వారా నగదు చెల్లించాలని విన్నవించుకున్నారు. పనులు మానుకుని వారానికి ఓ రోజు పట్టణాల్లోని బ్యాంకుల వద్దకు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. గ్రామంలో ఉండే పోస్టాఫీసయితే రోజులో ఏదో ఒక సమయంలో వెళ్లి కూలీ డబ్బులు తెచ్చుకుంటామని కేంద్ర బృందానికి విన్నవించారు. ప్రతి వారం డబ్బులు చెల్లించాలని విన్నవించినా పరిస్థితి మారలేదు. వారంలో బకాయిల చెల్లింపులు జిల్లాలో రెండున్నర నెలలుగా ఉపాధి కూలీల నగదు బకాయిలు ఉన్నాయి. ఏ వారానికి ఆ వారం మేము బిల్లులు పంపిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. వారంలో వస్తాయని మాకు సమాచారం ఉంది. బ్యాంకు ఖాతాతో ఆధార్ లింకేజీ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది. సమస్యను పరిష్కరించేందుకు గత నెల నుంచి మండల అభివృద్ధి అధికారికి అధికారాలిచ్చాం. కంప్యూటర్ ఆపరేటర్లకు గత నెల 27, 28 తేదీల్లో ఈ విషయంపై శిక్షణ ఇచ్చాం. కూలీల ఆధార్ లింకేజీ సమస్య ఆయా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లోనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాం. – జి.రాజకుమారి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా మొక్కలు నాటి ఏడావుతోంది... మొక్కలు నాటి ఏడాదవుతోంది..ఇంతవరకు కూలీ ఇవ్వలేదు, ఎప్పుడు అడిగినా అదిగో వస్తుంది, ఇదిగో వస్తుందంటున్నారేగాని కూలీ మాత్రం ఇవ్వడం లేదు. కూలీ ఇవ్వని పనికెందుకని ఉపాధికి పనికి పోవడం మానేశాను. – మేడిద శ్రీరాములు, రాధేయపాలెం, రాజానగరం మండలం. రెండు నెలల కూలీ రాలేదు బోదెలు పని చేశాం. రెండు నెలలవుతోంది. అధికారులను అడిగితే పై నుంచి డబ్బులు రాలేదని చెబుతున్నారు. కూలీ లేకపోతే మేము ఏం తినాలి. ఏం తాగాలి. అప్పులు చేసి తిని పనికి వెళుతున్నాం. డబ్బులు ఎప్పటికప్పుడు వస్తే మాకు ఇబ్బందులుండవు. – బి.ప్రేమ్ శేఖర్, ఉపాధి కూలీ, రంపచోడవరం -
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
డీఆర్డీఓ శ్రీనివాసకుమార్ రఘునాథపల్లి: ఉపాధి పనుల్లో అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఓ ఆకవరం శ్రీనివాసకుమార్ హెచ్చరించారు. ఉపాధి పనులపై మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం జరిగిన 10వ విడత ఓపెన్ ఫోరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసిస్టెంట్ పీడీ వసంత, ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ బానోతు శారద హాజరైన ఈ కార్యక్రమంలో సోషల్ అడిట్ బృందాల తనిఖీ నివేదికలను డీఆర్పీలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఉపాధి పనుల్లో చేసిన పనులకంటే ఎక్కువ బిల్లులు చెల్లించినట్లు తేలడం, పనుల ప్రదేశాలను మార్చి చేయించడం, మస్టర్లలో దిద్దుబాట్లు, ఒకరి పేరు బదలు మరొకరి పేరు, మేట్లే సంతకాలు చేయడం లాంటి లోపాలను గుర్తించారు. దీంతో పలువురు ఎఫ్ఏ, టీఏల నుంచి రికవరీకి అసిస్టెంట్ పీడీ వసంత ఆదేశించారు. చాలా రాత్రి వరకు కొన్ని గ్రామాల నివేదికలు పూర్తి కాలేదు. శ్రీనిధిలో చేతి వాటం మహిళల నిరాక్ష్యరాస్యతను ఆసరా చేసుకొని గ్రామైఖ్య సంఘాల్లో పని చేస్తున్న పలువురు సీఏలు చేతి వాటం ప్రదర్శించారని సోషల్ అడిట్ బృందాలు అయా గ్రామసభలలో వెలుగులోకి తెచ్చారు. ముఖ్యంగా మాదారంలో సీఎ కర్ల పద్మ శ్రీనిధి రుణాలు పొందిన ప్రతీ మహిళ నుంచి రూ.1000 చొప్పున తీసుకున్నట్లు గ్రామసభలో సోషల్ అడిట్ బృందాలు బహిర్గతం చేశారు. కాగా, ప్రజావేదికకు ప్రజలు పెద్దగా హాజరు కాలేదు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్కపురం లక్ష్మయ్య, ఎంపీడీఓ బానోత్ సరిత, జిల్లా విజిలెన్స్ అధికారి ప్రభాకర్, ఎస్టీఎం వేణు, ఎస్సార్పీలు రవి, మహేశ్వర్, అజయ్, ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్, క్వాలిటీ కంట్రోల్ అధికారి సుధాకర్, ఏపీఓ ప్రేమయ్య, ఏపీఎం భవా ని, సర్పంచ్‌లు జోగు గట్టయ్య, ఎండీ యాకుబ్ అలీ, మినుకూరి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
అదనపు ‘ఉపాధి’కి సాఫ్ట్వేర్
అనంతపురం టౌన్ : ఉపాధి పనులను వంద రోజుల నుంచి 150 రోజులకు పెంచిన ప్రభుత్వం దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు కల్పించనున్నారు. జిల్లాలోని 63 మండలాలూ కరువు మండలాల జాబితాలో చేరినందున వలసల నివారణకు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు పనిదినాలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ అందుబాటులో లేకపోవడంతో అధికారులు పనులు కల్పించలేకపోయారు. ప్రస్తుతం జిల్లాలో 7,87,727 జాబ్‌కార్డులు జారీ చేయగా 7,79,510 మంది కూలీలు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 22 వేలకు పైగా కుటుంబాలు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నాయి. ఆదివారం సాఫ్ట్వేర్ సిద్ధం కావడంతో వీరితోపాటు పనులు కావాలనే వారందరికీ 150 రోజులు పని కల్పించనున్నట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. -
ఉపాధి పనులకు జీపీఎస్ టెక్నాలజీ
ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాలపై సమీక్షలో మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: ఉపాధిహామీ కార్యక్రమాల అమలులో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) టెక్నాలజీని వినియోగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని టీసీపార్డ్లో ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాలపై గ్రామీణాభివృద్ధి విభాగం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. వివిధ జిల్లాల్లో ఉపాధి నిధులతో చేపడుతున్న నిర్మాణ పనుల ఫొటోలను నగరం నుంచే పర్యవేక్షించడం ద్వారా, పనుల పరిశీల నతో పాటు పారదర్శకతకూ దోహదపడుతుందన్నారు. పలు అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తులను కన్సల్టెంట్లుగా పెట్టుకోవాలని సూచిం చారు. పనుల్లో వేగం పెంచేందుకు సరైన గౌరవవేతనమిచ్చి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. అంచనాలు, డిజైన్ల రూపకల్పనకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. జూన్ 2కల్లా గ్రామాలన్నీ పరిశుభ్రంగా.. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాల్లోనూ ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని, జూన్ 2కల్లా గ్రామాలన్నీ పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ డెరైక్టర్‌ను మంత్రి జూపల్లి ఆదేశించారు. తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం అమలులో భాగంగా రైతులకు లాభసాటి వ్యవసాయ, పాడి పరిశ్రమ పద్ధతులను తెలపాలన్నారు. అమూల్ పాల విక్రయ సంస్థ రూపొందించిన బిజినెస్ మోడల్‌ను పరిశీలించాలని సూచించారు. జూన్ 24 నుంచి అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను, పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన పనుల్ని స్వయంగా పరిశీలించేందుకు వెళుతున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. సమీక్షలో పీఆర్ శాఖ డెరైక్టర్ అనితా రామ్‌చంద్రన్, పలువురు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి లేక.. గల్ఫ్ బాట!
కరువు దెబ్బకు గల్ఫ్ పయనం ఒట్టి చేతులతో ఇంటిముఖం ఏజెంట్ల మోసం అప్పులు కుప్పలు వీర్నపల్లివాసుల వెతలు ఉన్న ఊళ్లోనే ఉపాధికోసం నిరీక్షణ జిల్లా అంతటా ఇదే పరిస్థితి కరువు ఉరిమింది. ఉన్న ఉళ్లో ఉపాధి కరువైంది. బతుకుదెరువుకు చేసిన అప్పు వడ్డీలతో కలిపి కుప్పయింది. అప్పు తీర్చే మార్గం లేక గల్ఫ్ దేశాలకు వెళితే రాత్రింబవళ్లు పని చేయించుకున్న యాజమాన్యం జీతమడిగే సరికి కొంతమేర విదిల్చింది. ఆ జీతం తిండికే సరిపోని పరిస్థితి. ఎప్పుడైనా అనారోగ్యం బారిన పడితే... అంతే సంగతులు. ఇట్లయితే అప్పు తీరేదెలా? ఇల్లు గడిచేదెలా? అని బెంగపట్టుకుంది. ఇక లాభం లేదనుకుని యాజమాన్యాన్ని ఎదిరించి స్వదేశానికి తిరిగొస్తుంటే పాస్‌పోర్టు లాక్కుని జైళ్లో వేయించింది. నాలుగు నెలలు జైళ్లో గడిపి ఎలాగోలా ఇంటికి చేరుకుంటే... ఊళ్లో పరిస్థితి మళ్లీ భయపెడుతోంది. ఎటు చూసినా కరువే... ఏ పనీ లేదు. ఇంటిని ఎట్లా నెట్టుకురావాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రధానమంత్రి సంసద్ గ్రామీణ యోజన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న వీర్నపల్లిలో యువకుల దుస్థితి ఇది. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : వీర్నపల్లిలో జనాభా 3684 మంది. 99 శాతం ప్రజలు దళిత, గిరిజన, వెనుకబడిన సామాజికవర్గాలవారే. 8 తండాలున్న ఈ పంచాయతీలో 42 శాతం ఎస్టీ, 22 శాతం ఎస్సీ, 35 శాతం బీసీ జనాభా ఉన్నారు. మిగిలిన ఒకే ఒక్క శాతం జనాభాలో ఒక వెలమ, 10 వైశ్య సామాజిక కుటుంబాలు నివసిస్తున్నాయి. పురుష, మహిళా నిష్పత్తిలో మహిళలే అధికంగా ఉన్న పల్లె ఇది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామమిదే. గతంలో పూర్తి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసుల బూట్ల చప్పుళ్లు, నక్సలైట్ల తూటాల పహారాలో నలిగిన గ్రామమిది. గత పదేళ్లలో పోలీసులు, నక్సల్స్ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పల్లె కావడంతో... వీర్నపల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎంపీ వినోద్‌కుమార్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఏడాదిన్నరలో ఈ గ్రామంలో చాలా మార్పులే వచ్చాయి. వయోజన విద్య కార్యక్రమంగా పకడ్బందీగా అమలు చేయడంతో నూరు శాతం అక్షరాస్యత సాధించారు. గ్రామీణ బ్యాంకు ఏర్పాటైంది. ఒకప్పుడు ఇంటింటికీ గుడుంబా తయారు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి చాలా మేరకు మారింది. కానీ, చేయడానికి పనుల్లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బతుకుదెరువుకు వెళ్లి... మోసపోయి ఇల్లు చేరి.. బతుకుదెరువు కోసం ఈ ఊరి నుంచి 1200 మందికిపైగా గల్ఫ్ దేశాలకు వెళ్లారు. లక్షలకు లక్షలు సంపాదించవచ్చన్న ఏజెంట్లు మాటలు నమ్మి చేతిలో డబ్బుల్లేకపోయినా ఇల్లు, పొలం కుదవపెట్టి అప్పు చేసి మరీ వెళ్లినవాళ్లే ఎక్కువ. తీరా అక్కడికి వెళ్లాక పెద్ద జీతం సంగతి దేవుడెరుగు... బతుకే నరకంగా మారడంతో... ఉండలేక ఒట్టి చేతులతో తిరిగొస్తున్నారు. ఇలా 225 మందికిపైగా యువకులు తిరిగి వీర్నపల్లి రావడం గమనార్హం. ‘సార్... రోజూ 8 గంటలు పని. నెలకు లక్ష రూపాయల దాకా సంపాదించవచ్చని ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి అక్కడికి వెళ్తే తెలిసింది... దూరపు కొండలు నునుపు అని’ అంటూ వాపోయాడు వీర్నపల్లికి చెందిన మల్లారపు రవి. ఇదే గ్రామానికి చెందిన రాజంది సైతం ఇదే పరిస్థితి. ‘అప్పు చేసి దుబయ్ పోతే వాళ్లిచ్చే జీతం తిండికే సరిపోలేదు. జ్వరమొస్తే ఆసుపత్రిలో కూడా చూపించలేదు. ఫోర్‌మెన్ ఉద్యోగమని తీసుకెళ్లి అడ్డాకూలీ పని చేయించిండ్రు. రోజుకు 12 గంటలు పనిచేయించుకున్నరు. కోపమొచ్చి వద్దామంటే పాస్‌పోర్టు గుంజుకుని జైల్లో పెట్టించిండ్రు’ అని అని జి.రాములు వాపోయాడు. దుబయ్ వెళ్లిన వాళ్లలో నూటికి 80 శాతం మంది దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారని వారు చెబుతున్నారు. ఆ బాధలు పడలేక తిరిగొచ్చిన వాళ్లు కొందరైతే... ఉన్న ఊరుకొచ్చినా ఉపయోగం లేదనే భావనతో అక్కడే బతుకీడస్తున్న వారు మరికొందరున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీర్నపల్లి నుంచి వెళ్లిన 50 మంది యువకుల్లో ఏడాది తిరగకముందే అందులో 10 మంది తమవల్ల కాదు ఆ బతుకు అంటూ తిరిగొచ్చారు. ఉన్న ఊళ్లోనే శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తే భార్యాపిల్లలతో హాయిగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక్కడే బతుకుతామంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కోరుట్ల, జగిత్యాల, వేములవాడలోనూ ఇదే పరిస్థితి! కరువు దెబ్బకు జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ఊరు విడిచి దుబయ్ వలస వెళ్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సగటున ఊరికి పది మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన వారే. కొందరు యువకులు ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయి రాగా... మరికొందరు ఎంత కష్టమైనా, నష్టమైనా కూలీనాలీ చేసుకుంటూ విదేశాల్లోనే బతుకీడుస్తున్నారు. ఆయా యువకుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి శిక్షణ ఇస్తే జిల్లాలోనే ఉపాధి పొందుతూ కుటుంబంతో హాయిగా ఉంటామని చెబుతున్నారు. నరకం చూసిన.. సార్.. ఇంట్ల ఎల్లక 2 లక్షలు అప్పు చేసిన. దుబాయ్ పోతే అప్పు తీర్చి డబ్బులు సంపాదించుకోవచ్చని ఓ ఏజెంట్ చెబితే మరో లక్ష అప్పు చేసి గత జూన్‌లో దుబాయ్ పోయిన. అక్కడి కరెన్సీ ప్రకారం నెలకు రూ.1200 దిర్హమ్స్(రూ.21,600) జీతం ఇస్తామని ఆశపెడితే పోయిన. తీరా ఆడికిపోతే నెలకు 600 దిర్హమ్స్ ఇచ్చిండ్రు. 8 గంటలకు బదులు రోజు 12 గంటల పనిచేయించుకున్నరు. పని ఒత్తిడికి ఆరోగ్యం కరాాబైంది. వచ్చిన డబ్బులు తిండికి, నా మందులకే సరిపోయినయ్. ఆడ ఉన్నన్ని రోజులు నరకం చూసిన. ఎలాగోలా ఇక్కడికి వచ్చి ఉపాధి కూలీకి పోతున్న. అప్పులెట్లా తీర్చుడో అర్థమైతలేదు. మాలోంటోళ్లకు ప్రభుత్వం ఏదైనా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తే సర్కారు రుణం తీర్చుకుంటం. - నర్మెట శంకర్, వీర్నపల్లి మోసపోయిన.. మా ఊరినుంచి దుబాయ్ పోయినోళ్లంతా నానా కష్టాలు పడుతుండ్రు. ఈడ ఏజెంట్లు చెప్పేదొకటి, ఆడ జరిగేదొకటి. ఫోర్‌మెన్ ఉద్యోముంది... నెలకు 2 వేల దిర్హమ్స్ జీతం (రూ.36 వేలు) ఇస్తారని ఏజెంట్లు ఆశపెడితే నిజమేనని నమ్మి లక్ష రూపాయలు అప్పు చేసి దుబాయ్ పోయిన తీరా ఆడికిపోతే లేబర్ కూలీకి పెట్టిండ్రు. అందులో సగం జీతం కూడా సరిగా ఇయ్యలేదు. ఆ జీతం అక్కడ తిండికి కూడా సరిపోలేదు. మోసపోయిన. ఇక లాభం లేదని ఇంటికి పోదామనుకుంటే నా పాస్‌పోర్టు తీసుకుని నన్ను జైల్లో పెట్టించిండ్రు. మూడు నెలలు జైల్లోనే ఉండి ఎట్లాగోలా మా ఊరికొచ్చిన. ఉప్పరి పనిజేసి బతుకీడుస్తున్న. మాలాంటోళ్లకు ఏదన్నా దారి చూపాలె. - జి.రాములు, వీర్నపల్లి -
సాక్షి చానల్ విలేకరిపై దౌర్జన్యం
దాడికి పాల్పడిన టీడీపీ నేత ‘ఉపాధి’లో అక్రమాలు వెలుగులోకి వస్తాయన్న అక్కసుతోనే... విశాఖపట్నం : తెలుగు తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడటమే కాకుండా, వీటిని వెలుగులోకి తెస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారు. ఉపాధి పనుల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు వెళ్లిన సాక్షి చానల్ విలేకరి జక్కు అప్పలస్వామినాయుడుపై గొలుగొండ మండల టీడీపీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు దాడికి పాల్పడ్డారు. కెమెరా, సెల్‌ఫోన్ లాక్కొని దౌర్జన్యం చేశారు. దీనిపై అప్పలస్వామినాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలావున్నాయి. గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం సమీపంలోని పాలెపు చెరువులో జాతీయ ఉపాధిహామీ నిధులు రూ.50 లక్షలతో పూడిక తొలగింపు పనులు జరుగుతున్నాయి. వీటిని బినామీ పేరిట మండల టీడీపీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు చేపడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ చెరువులో పూడిక మట్టిని నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంత ప్రాంగణాల్లో లోతట్టు ప్రాంతాలను మెరకచేసేందుకు వినియోగించాలి. లేదంటే నీటిపారుదలశాఖ అధికారులకు క్యూబిక్ మీటర్ రూ.30 చొప్పున చెల్లించి ఇతర వ్యక్తులకు విక్రయించాలి. ఇలాకాకుండా ఆయన రెండు రోజులనుంచి బయట వ్యక్తులకు లారీ మట్టి రూ.600 నుంచి రూ.700కు విక్రయిస్తున్నారు. ఈ అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు వెళ్లిన సాక్షి చానల్ విలేకరి జక్కు అప్పలస్వామినాయుడును అప్పలనాయుడు అడ్డుకున్నారు. నీవు ఎవడివని, కవరేజి చేస్తే చంపుతానని బెదిరిస్తూ కెమెరా, సెల్‌ఫోన్ లాక్కొని దౌర్జన్యం చేశారు. దీనిపై బాధిత విలేకరి గొలుగొండ ఎస్ఐ జోగారావుకు ఫిర్యాదు చేశారు. ఉపాధి పనులకు ఆటంకం కలిగించాడని టీడీపీ నాయకుడు అప్పలనాయుడు కూడా ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల నుంచి అందిన ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
ఉపాధి పనుల్లో వజ్రం దొరికింది(ట)!
ధారూరు(రంగారెడ్డి): ఉపాధి పనుల్లో వజ్రం లభ్యమైందనే ప్రచారం గ్రామస్తులతోపాటు పోలీసులను ఉరుకులు పరుకులు పెట్టించింది. చివరికి అదంతా తమాషా కోసం చేసిన ప్రచారమని తెలిసి.. ఎస్సై గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం అల్లీపూర్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ... గ్రామానికి చెందిన పాతూరు చిన్న అంతయ్య భూమిలో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులను గ్రామానికి చెందిన 16 మంది చేస్తున్నారు. వారిలో నర్సయ్య అనే కూలీ గ్రామంలో ఉన్న శ్రీనివాస్‌కు ఫోన్ చేసి పనిచేస్తున్న చోట వజ్రం దొరికిందని చెప్పాడు. అంతే.. ఈ వార్త ఒకరి నుంచి ఒకరికి తెలియటంతో గ్రామస్తులంతా పని జరిగే వద్దకు తరలివచ్చారు. ఈ సమాచారం అందుకున్న ఎస్సై మల్లేశం కూడా సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అక్కడి వారిని వజ్రం ఉదంతంపై ఆరా తీయగా.. తాము సరదా కోసమే వజ్రం దొరికిందని చెప్పామని, వాస్తవంగా అలాంటిది ఏమీ దొరకలేదని కూలీలు ఎస్సైకి వివరించారు. సరదా కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయటం నేరమని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కలిసిరాని ‘జాతకం’
నారాయణఖేడ్: తమ పాండిత్యంతో నలుగురికీ జాతకాలు చెబుతూ.. వారు మాత్రం అంధకారంలో మగ్గిపోతున్నారు. ఏళ్లుగా నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక.. మరో పని చేయలేక అవస్థలు పడుతున్నారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా ఎర్నలి ప్రాంతం నుంచి 1991లో పలు కుటుంబాలు చిలక జోస్యం, పంచాంగం చెప్పేందుకు వలసవచ్చాయి. ఇలా వచ్చిన దాదాపు 50 కుటుంబాలు నారాయణఖేడ్‌లో స్థిరపడ్డాయి. ప్రస్తుతం 200 పైగా జనాభాతో పట్టణంలోని అనుశమ్మ కాలనీలో అద్దె ఇళ్లు, గుడారాల్లో జీవిస్తున్నారు. ఆశల ఉదయం తెల్లవారగానే వీరి ప్రయాణం మొదలవుతుంది. పొద్దున్నే తలస్నానం ఆచరించి నుదుటున తిలకం దిద్దుకొని ఒక్కొక్కరు ఒక్కో గ్రామానికి పయనమవుతారు. ఇలా నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని గ్రామాలతో పాటు నిజామాబాద్ జిల్లా పిట్లం, నిజాంసాగర్, బాన్సువాడ, జుక్కల్ తదితర మండలాల్లోని గ్రామాలకు వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల్లో వీధిలు తిరుగుతూ జాతకాలు చెబుతుంటారు. అయితే, గతంలో తాము గ్రామాలకు వెళ్తే ఎంతో మర్యాదగా ఇంటికి పిలిచి మరీ జాతకాలు చెప్పించుకునే వారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వారు ఆవేదన చెందుతున్నారు. టెక్నాలజీ విప్లవం.. దినదిన గండం 10 ఏళ్ల క్రితం వరకు కులవృత్తి మంచిగానే సాగిందని వీరు చెబుతున్నారు. టీవీలు, పత్రికలు ఎక్కువవడం.. అందులోనూ జాతకాలు చెబుతుండటంతో తమకు ఆదరణ తగ్గిందని ఆవేదన చెందుతున్నారు. టెక్నాలజీ అభివృద్ధితో తాము తిరోగమన దిశలో ఉన్నామని పేర్కొన్నారు. నిత్యం జాతకం చెప్పించుకునే వారికోసం గాలించినా చిక్కడ కష్టమైందంటున్నారు. మార్పు కోసం ఎదురుచూపులు బీదర్ జిల్లా ఎర్నలి నుంచి నారాయణఖేడ్ ప్రాంతానికి 20 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడే స్థిరపడిపోయామని గోందాల ప్రకాశ్, పాండురంగ తెలిపారు. తమలో చాలామందికి ఓటరు కార్డు, రేషన్‌కార్డులు ఉన్నాయని చెప్పారు. తమ పిల్లలకు ఇలాంటి దుస్థితి రాకూడదనే ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామన్నారు. తమ వరకు ఏ ఒక్క సంక్షేమ పథకం అందడం లేదని, సర్కార్ మాకు ఉపాధి కల్పిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కొందరు జాతకాలు చెప్పడం మాని కూలీ చేస్తున్నారని ఆవేదన చెందారు. గలగల.. వెలవెల! వీరికి ఓ రోజు పండగ వాతావరణం కన్పిస్తే.. మరో రోజు అధ్వాన పరిస్థితి ఎదురవుతుంది. జాతకాలు చెప్పించుకొనేవారు ఎదురైతేనే నాలుగు కాసులు చేతిలో పడతాయి. ఒకరోజు రూ.50 లభిస్తే మరోరోజు రూ.200 వరకు వస్తాయని జాతకం చెప్పేవారు తెలిపారు. దేవుడి దయతో తమ బతుకులు ఆధారపడి ఉంటాయన్నారు. పిల్లలపైనే ఆశ 12 ఏళ్ల వయస్సు నుంచి చిలక పంచాంగం చెబుతున్నా. ఇప్పుడు నాకు 30 ఏళ్లు. ఇద్దరు పిల్లలున్నారు. వృత్తి గిట్టుబాటు కాలేదు. పిల్లల్ని అయినా మంచిగా చదివించుకోవాలని ఉంది. వారు మంచి వృత్తిలో స్థిరపడితే అంతకన్నా ఏం కావాలి. - గోందాల్ ప్రకాశ్, చిలకజోస్యం ప్రభుత్వంఆదుకోవాలి ఉపాధి పనులు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. నాకు చదువు కూడా రాదు. నలుగురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ప్రభుత్వం పాఠశాలలో చదివిస్తున్నాం. మాజీవితం ఎటూ కాకుండా పోయింది. వాళ్లయినా బాగుపడితే చాలు. - పాండురంగం, పంచాంగ పఠకుడు -
పబ్లిసిటీని బట్టి పరిహారమిస్తారా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ప్రాణం ఎవ్వరిదైనా ఒక్కటే.. పరిహారం విషయంలో ప్రభుత్వ విధానం ఒక్కటే అయ్యుండాలి.. అంతేకానీ, పబ్లిసిటీ వస్తుందంటే ఒకలా లేదంటే మరోలా పరిహారం ప్రకటిస్తే ప్రతిఘటన తప్పదు...’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గండేపల్లి వద్ద లారీ బోల్తా పడ్డ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. పరిహారం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని దుయ్యబట్టిన జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఉపాధి లేకే వలసలు... ‘‘ఉపాధి పనుల్లేక గ్రామాల్లో బతకలేక వలస వెళ్లిన కూలీలు ఇంటికి తిరిగొస్తూ ప్రమాదం బారిన పడ్డారు. ఉపాధి పనుల్లో రూ.30 నుంచి రూ.80 ఇచ్చినా గిట్టుబాటు కావట్లేదు. బతకడానికి వేరే గత్యంతరం లేక గ్రామాల నుంచి బయటకెళ్లి పనులు చేసుకుంటున్నారు. అలా వెళ్లిన మెట్ట ప్రాంత కూలీలు తిరుగు ప్రయాణంలో గుంటూరు జిల్లా దాచేపల్లి నుంచి సిమెంట్ తయారీకి ఉపయోగించే ముడిసరుకుతో వస్తున్న లారీ ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్నారు. పబ్లిసిటీ వస్తుందంటేనే భారీ పరిహారం: ఏమయ్యా.. చంద్రబాబుగారూ! మీకు పబ్లిసిటీ వస్తుం దంటే నష్టపరిహారం భారీగా ప్రకటిస్తావు. గోదావరి పుష్కరాల్లో నీవు మేకప్ వేసుకుని సినిమా షూటింగ్ కోసం మనుషులను చంపేస్తే రూ.10 లక్షలు ఇస్తావు. పాపం ఆ పాపను చూడు (దేవి అనే బాలికను చూపిస్తూ).. హ్యాండికాప్డ్.. వాళ్ల నాన్న చనిపోయాడు. బతకడానికి వేరొక ఆధారం లేదు. పనిచేస్తే కానీ పూట గడవని కూలీ కుటుంబం. అలాంటి పేదవారంతా నువ్వు ఉపాధి పనులు చూపకపోవడంతో, బతకడానికి వేరే మార్గం లేక బయట ప్రాంతాలకు వెళ్లారు. తిరిగొస్తూ లారీ ఎక్కి ప్రమాదానికి గురైతే ఎందుకు తక్కువ నష్టపరిహారం ప్రకటించారు? అదీ నేను వస్తున్నానని తెలిసి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శకు వచ్చినా బాధితులకు ఎలాంటి సహాయమూ ప్రకటించలేదు. మృతదేహాలను చూసెళ్లిపోయారంతే. ఏ ప్రమాదంలో చని పోయినా నష్టపరిహారం విషయంలో ప్రభుత్వ పాలసీ మారకూడదు. ఈ ప్రమాదం విషయంలోనూ ప్రభుత్వ పాత్ర ఉంది కాబట్టి తగిన పరిహారం ఇవ్వాలి. లేకపోతే దీనిపై కోర్టులో పిటిషన్ వేస్తాం. ఎందుకంత భయం: మృతులకు సంబంధించిన వాళ్లంతా ఇక్కడే ఉన్నారు. కానీ మృతదేహాలను ఊళ్లకు తరలించారు. నేను వస్తున్నానని తెలిసి, పరిహారం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని మృతదేహాలను కనీసం కుటుంబసభ్యులకు అప్పగించకుండా, వారికి తెలియకుండా వారి ఊర్లకు తరలించేశారు. ఒక్కో వాహనంలో మూడేసి మృతదేహాలను కుక్కేశారు. ఎందుకీ హడావుడి తరలింపు? ఎందుకంత భయం? చంద్రబాబు చేస్తున్న పనుల్లో ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఇప్పటికైనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి. ఈ ప్రమాదంలో గాయపడినవారు తర్వాత పనుల కెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అందుకే వారికి కేవలం ప్రథమ చికిత్స చేసి పంపేయకుండా రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని చంద్రబాబును డిమాండు చేస్తున్నా. అంతా అవినీతిమయం ఇసుక నుంచి మట్టి దాకా, పట్టిసీమ నుంచి పోలవరం దాకా చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారు. ఇంత దారుణం దేశంలో ఎక్కడా చూడలేదు. ఇలా సంపాదించిన డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేని కొనబోయి ఆడియో, వీడియోలతో పట్టుబడ్డారు. ఆ ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి బయటపడటానికి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను సైతం పణంగా పెట్టేశారు. అలా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్న చంద్రబాబు ఒక్కరోజు కూడా సీఎం సీటులో కూర్చోవడానికి అర్హుడు కారు’’ అని అన్నారు. -
బాలయ్యను నిలదీసిన మహిళలు
హిందూపురం: ఉపాధి పనులు లేక పిల్లలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నామని తమకు ఉపాధి చూపించాలని అనంతపురం మహిళలు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్టను నిలదీశారు. శుక్రవారం పట్టణంలో రహదారి నిర్మాణ భూమిపూజలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మహిళలు తాము కరువు కాటకాలతో తల్లడిల్లిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే ఉపాధి పనులు కల్పించాలని చుట్టుముట్టారు. ఒక్కసారిగా మహిళలందరూ చుట్టుముట్టడంతో ఏమి చెప్పాలో కాసేపు ఆయనకు అర్థం కాలేదు. తేరుకున్న అనంతరం తనదైన శైలిలో రెండు నెలల తర్వాత మీ అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పి వెళ్లిపోయారు. రెండు నెలల తర్వాత అంటే అప్పటికి ఉపాధి పనులు ఆగిపోతాయి కదా మరి ఉపాధి ఎలా కల్పిస్తారని మహిళలు వాపోయారు. -
పల్లెపల్లెనా ‘ఉపాధి’ లేమి!
పడకేసిన ఉపాధి హామీ పథకం * వలసబాట పడుతున్న పేద కూలీలు * ఇప్పటికే 13 లక్షల మంది కూలీల వలస! సాక్షి, హైదరాబాద్: ఉపాధి పడకేసింది.. హామీ అటకెక్కింది! పల్లెల్లో ఉపాధి పనులు దొరక్క కూలీలు పొట్ట చేతబట్టుకొని పట్టణాలకు వలస వెళ్తున్నారు. అటు తీవ్ర వర్షాభావంతో వ్యవసాయ పనులు లేకపోవడం.. ఇటు ఉపాధి హామీ సిబ్బంది సమ్మె.. వెరసి కూలీలకు ఉపాధి గగనమైంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. రాష్ట్రంలో ఏకంగా 13 లక్షల మంది వలస బాట పట్టినట్టు తెలుస్తోంది! తెలంగాణలో తొమ్మిది జిల్లాల్లోని(హైదరాబాద్ మినహా) 443 మండలాల్లో సుమారు 55.38 లక్షల మందికి ఉపాధి హామీ(జాబ్) కార్డులున్నాయి. దాదాపు 24 లక్షల మంది కూలీలు ఏటా ఉపాధి పనులతో పొట్టుబోసుకుంటున్నారు. వీరిలో ఈ నెలలో 1.5 లక్షల మందికి పనులు కల్పించగా.. గతవారం కేవలం 698 మందికే ఉపాధి చూపారు. ఈ వారం మరీ ఘోరంగా కేవలం 11 మందికే పని కల్పించినట్లు అధికారిక లెక్కలే చెబుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉపాధి పొందుతున్న అరకొర మంది కూలీలకు కూడా వేతనం గిట్టడం లేదు. పెంచిన వేతనం ప్రకారం రోజుకు రూ.180 ఇవ్వాల్సి ఉన్నా.. సగటున రూ.90 మాత్రమే దక్కుతోంది. చిన్న పనులకు సైతం ఎక్కువ మంది వస్తుండడం.. ఆ మొత్తాన్నే అందరూ పంచుకోవాల్సి రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చేసిన పనులకూ డబ్బుల్లేవ్! పథకం పరిధిలోని సుమారు 16 వేల మంది ఉద్యోగులు 35 రోజులపాటు సమ్మె చేయడంతో దాని ప్రభావం కూలీల ఉపాధిపై కూడా బాగా పడింది. వీరిలో 8,600 మంది క్షేత్రస్థాయి సహాయకులు కాగా, మిగిలిన వారు ఏపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు. క్షేత్రస్థాయిలో కూలీలతో నేరుగా సంబంధాలుండే ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో ఉపాధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కూలీలు అంతకు ముందు చేసిన పనులకు సంబంధించిన చెల్లింపులు కూడా ఆగిపోయాయి. సుమారు రూ.150 కోట్ల దాకా కూలీలకు చెల్లించాల్సి ఉంది. బ్యాంకు ఖాతాల ద్వారానే కూలీ చెల్లించాలంటూ కొత్త నిబంధన పెట్టడం, ప్రతి ఒక్కరి ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న సర్కారు నిర్ణయంతో గత నాలుగు నెలలుగా వేలాది మందికి చెల్లింపులు నిలిచిపోయాయి. చేసిన పనులకు డబ్బు రాక, కొత్తగా పనులు లభించక కూలీలు నరకయాతన అనుభవిస్తున్నారు. పస్తులే దిక్కు.. కాలం లేక రైతులు కూడా దిగాలుగా ఉన్నారు. వానల్లేక చేనులో పంట ఎండిపోయే దశకు చేరుతోంది. దీంతో వ్యవసాయ పనులూ సాగడం లేదు. అటు సాగు పనులు, ఇటు ఉపాధి పనులు లేకపోవడంతో పేద కుటుంబాలు పస్తులుంటున్నాయి. కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ అప్పు కూడా దొరకని వాళ్లు పట్టణాలకు వెళ్లి దినసరి అద్దెపై ఆటోలు, రిక్షాలు తీసుకొని నడుపుతూ పొట్టబోసుకుంటున్నారు. మరికొందరు ప్రైవేటు సంస్థల్లో సెక్యూరిటీ గార్డులుగా చేరిపోతున్నారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లా నుంచి 2.75 లక్షల మంది, మహబూబ్‌నగర్ నుంచి 2.5 లక్షల మంది వలస వెళ్లినట్లు సమాచారం. ఉద్యోగులకూ భరోసా లేదు సమ్మె చేసినా ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కంటి తుడుపు చర్యగా ఒక కమిటీని వేసింది. ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ నోటీసులు రావడం, ఉపాధి హామీని పంచాయతీలకు అప్పగించాలని సర్కారు యోచిస్తుండడంతో.. తమ కొలువులు ఎక్కడ పోతాయోనని భయపడిన ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మెను విరమించారు. ఆరు వారాల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మళ్లీ సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఆటో నడుపుతున్నా.. గత నెల నుంచి ఉపాధి పనులు బంద్ అయ్యాయి. వ్యవసాయ కూలీ పనులు కూడా లేవు. కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నాను. పనుల్లేక వారం నుంచి దినసరి అద్దెపై ఆటో నడుపుతున్నా. - ఆంజనేయులు, ఉపాధి కూలీ, మేళ్లచెర్వు, గద్వాల మండలం. మహబూబ్‌నగర్ బతుకు ఆగమైంది.. మాకు రెక్కల కట్టం తప్ప ఆస్తిపాస్తులు లేవ్. నేను, నా భార్య ఇన్ని దినాలు ఉపాధి పనికి వెళ్లినం. సమ్మెతో ఊళ్ల పనులు బందైనయ్. బ తుకు ఆగమైంది. పొలం పనులు కూడా సాగుతలేవ్. పూట గడుసుడు కట్టమైతంది. - కొండపల్లి రాజం, నెన్నెల, ఆదిలాబాద్ పస్తులు ఉంటున్నం.. కొన్నాళ్ల నుంచి మా ఊళ్లో ఉపాధి హామీ పథకం పనులు లేవు. బయట పనులు దొరక్క, ఇప్పుడు ఉపాధి పనులు కూడా లేకపోవడంతో పస్తులుండాల్సి వస్తోంది. పంట చేలల్లో కూలీ పనులు కూడా కరువయ్యాయి. గ్రామాల్లో ఎలాంటి పనులు దొరకడం లేదు. - సాయిలు, దామర్గిద్ద, కంగ్టి మండలం, మెదక్ -
కూలీల నోట్లో మట్టి
5 గంటల పని.. కూలి రూ.50 మండుటెండలో నీరసిస్తున్న కూలీలు మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల చేతివాటం జిల్లాలో సగటు వేతనం రూ.110 గరిష్ట వేతనం మార్చి వరకు 169.. ఏప్రిల్ నుంచి రూ.180 కర్నూలు(అగ్రికల్చర్) : చెమట చిందించినా.. కండలు కరిగించినా.. అందుతున్న కూలి అత్తెసరే. మండుటెండలో మధ్యాహ్నం వరకు నడుము వంచినా చేతికందేది చిల్లర పైసలే. ఉపాధి పనుల విషయంలో గొప్పలే తప్పిస్తే.. కూలీలకు చేకూరుతున్న లబ్ధి అంతంతే. స్థానికంగా పనుల్లేక.. కాంక్రీటు వనాల్లో బడుగు జీవుల పొట్టతిప్పలు వర్ణనాతీతం. కూలీలకు గరిష్ట వేతనం గత మార్చి వరకు రూ.169 కాగా.. ఏప్రిల్ నుండి రూ.180లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అధిక శాతం కూలీలకు అందుతున్న వేతనం రూ.50 మాత్రమే కావడం గమనార్హం. జిల్లాలో ఉపాధి పనులకు 1.15 లక్షల మంది హాజరవుతుండగా.. 10 నుంచి 20 శాతం కూలీలకు వేతనం రూ.50 మించని పరిస్థితి. ఉపాధి కూలీలతో శ్రమశక్తి సంఘాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో సంఘంలో 10 నుండి 15 మంది కూలీలు ఉంటారు. స్థానిక టీడీపీ నేతల ఒత్తిళ్లతో చాలా చోట్ల మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు బోగస్ మస్టర్ వేస్తున్నట్లు తెలుస్తోంది. 10 మంది హాజరైతే 15 మంది.. ఆరుగురు హాజరైతే 10 మంది వచ్చినట్లు చూపుతుండటంతో కూలీల నోట్లో మట్టి పడుతోంది. పార్ట్ మిషన్ల ద్వారా పోస్టల్ సిబ్బంది ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లిస్తారు. కూలీల వేలి ముద్రల ఆధారంగా పేమెంట్ జరుగుతోంది. ఆ వెంటనే రెండు రశీదులు వస్తే.. ఒకటి కూలీకి అందజేయాలి. అయితే ఎక్కడా ఇలా చేస్తున్న దాఖలాల్లేవు. పోస్టల్ సిబ్బంది కొందరు రశీదులు ఇవ్వకుండా వేతనంలో పది శాతం స్వాహా చేస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు అంతోఇంతో ముట్టజెబితే రోజుకు రూ.120 నుంచి రూ.150 వరకు వేతనం వస్తోందని.. లేదంటే కొలతల్లో కోత కోస్తుండటంతో కూలి గిట్టుబాటు కావడం లేదని కూలీలు వాపోతున్నారు. కల్పించే పనులు కూడా కారణమే.. ఉపాధి కూలీలకు గిట్టుబాటు వేతనం లభించకపోవడానికి కల్పిస్తున్న పనులు కూడా ఒక కారణమే. మామూలుగా అయితే ఫీల్డ్ అసిస్టెంట్ మార్కింగ్ ఇవ్వాలి. వారంలో ఎంత పని చేస్తే ఎంత కూలీ వస్తుందో స్పష్టంగా చెప్పాలి. అయితే 60 శాతం వరకు మార్కింగ్ ఇవ్వడం లేదు. ఇక్కడ పని చేయండని చెబుతున్నారు తప్ప.. ఎంత పని చేస్తే ఎంత కూలీ వస్తుందో మార్కింగ్ ఇవ్వకపోవడంతో కూలి గిట్టుబాటు కావడం లేదు. దీనికి తోడు పనులు కూడా బరువుగా ఉంటున్నాయి. దాదాపు ఆరు నెలలుగా వర్షాలు లేకపోవడంతో భూములు గట్టిపడి బండను తలపిస్తున్నాయి. బరువైన పనులను కనీసం ఐదారు గంటలు చేస్తున్నారు. కానీ వేతనం రూ.50లే వస్తోంది. సగటు వేతనం రూ.110 మాత్రమే.. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు గరిష్ట వేతనం రూ.169లు కాగా.. ఏప్రిల్ 1 నుండి రూ.180లకు పెంచారు. ఈ మొత్తానికి వేసవి అలవెన్స్ అదనం. కానీ ఉపాధి కూలీలకు సగటున పడుతున్న వేతనం రూ.110 మాత్రమే. దీనిని రూ.135లకు పెంచాలని లక్ష్యంగా తీసుకున్నా సాధ్య పడని పరిస్థితి. సగటు వేతనాన్ని పెంచేందుకు అధికారులు గ్రామస్థాయిలో మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణనిచ్చారు. వేతనం పెంచుకోవాలంటే ఏమేమి చేయాలనే విషయమై వివరించారు. అయినప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు ఖాతరు చేయకపోవడంతో కూలీలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. రోజుకు రూ.30 పడుతోంది ఎండలో పని చేయలేక సచ్చిపోతున్నాం. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా కూలి అంతంతే వస్తోంది. చెరువు పూడికతీత పనులకు వెళ్తున్నాం. రోజుకు రూ.30 పడుతోంది. సారోళ్లు రూ.168 ఇస్తున్నామంటారే కానీ.. యానాడు అంత డబ్బు కళ్ల చూడలేదు. - కాశన్నగారి రుక్మిణమ్మ,కొలుములపల్లె గ్రామం కూలి డబ్బులూ ఆలస్యమే చేసిన పనికి ఇచ్చే నాలుగు దుడ్లు కూడా ఆలస్యమే. పనులకు పోవాలంటే ఎవరూ ముందుకు రావడం లేదు. పోస్టాఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఫీల్డ్ పరంగా అధికారులు వచ్చి న్యాయం చేయాల. ఇట్లయితే ఇల్లు ఎట్టా నడుస్తాది. -ఆవుల మాబున్ని,ఆర్ఎస్ రంగాపురం -
ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు : కలెక్టర్
మహబూబ్‌నగర్ (టౌన్): జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాది కూలీలందరికి మార్చి నెలాఖరు నాటికి పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పనిచేస్తామని ముందుకు వచ్చే ప్రతి కూలీకి పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పని కల్పించని వారిని సహించేది లేదని వారిపై కఠిన చర్యలు తప్పవంటూ కలెక్టర్ హెచ్చరించారు. ఇక కూలీలకు పని కల్పించే విషయంలో ముందస్తు ప్రణాళికల్ని రూపొందించుకొని సాధ్యమైననీ ఎక్కువ రోజులు పని కల్పించాల్సిందిగా వారికి సూచించారు. ఇంత వరకు పనులు చేపట్టేందుకు గుర్తించిన వాటిలో తక్షణమే పనులు ప్రారంభించాలని, ఈవిషయంలో కూలీలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. -
రాజకీయ గండం
►పూడ్చివేతకు నోచుకోని చెరువుల గండ్లు ►గత ఏడాది భారీ వర్షాలకు పంటలను, ఊళ్లను ముంచేసిన వరద ►23 చెరువులకు గండ్లు.. 7 వేల ఎకరాల్లో పంట నాశనం ►తక్షణమే స్పందించిన అధికారులు.. రూ.85 లక్షలు మంజూరు ►అయినా ఇప్పటికీ ప్రారంభం కాని పనులు ►మొదట ఎన్నికల కోడ్‌తో ఆటంకం ►ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లతో అవాంతరం ►ఈ ఏడాదీ కడగండ్లు తప్పవేమోనని రైతుల ఆందోళన పొందూరు : పొందూరు మండల చరిత్రలో ఎన్నడూ ఎరుగని ఉత్పాతం.. భారీ వర్షాలకు చెరువులు కట్టలు తెంచుకున్నాయి. వరద నీరు పంట పొలాలు, ఊళ్లు, రోడ్లను ముంచెత్తింది. 23 చెరువులకు గండ్లు పడగా.. 7వేల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. మండల కేంద్రమైన పొందూరు పట్టణం పూర్తిగా జలదగ్బంధంలో చిక్కుకుంది. ఇదంతా గత ఏడాది అక్టోబర్‌లో జరిగింది. అప్పటి కలెక్టర్, జిల్లా ప్రత్యేకాధికారి మండలంలో పర్యటించి, పరిస్థితిని పరిశీలించాలరు. గండ్ల పూడ్చివేతకు ఉపాధి హామీ పథకం కింద రూ.85 లక్షలు మంజూరు చేశారు. పొందూరు, బాణాం, తానెం, దళ్లిపేట, గారపేట, లోలుగు, రాపాక, తోలాపి, నర్సాపురం, వి.ఆర్. గూడెం గ్రామాలకు చెందిన చెరువులకు గండ్లు పడ్డాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటంతో ఒక చెరువు నుంచి మరో చెరువులోకి పొంగి ప్రవహించి.. సుమారు 7 వేల ఎకరాల్లో పంటలను ముంచేసింది. అధికారులు స్పందించి నిధులు మంజూరు చేయడంతో మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు మొదలెట్టారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది. కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో ఎన్నికలు పూర్తి అయ్యి, కోడ్ ఉపసంహరించేవరకు పనులు చేపట్టే అవకాశం లేకుండాపోయింది. ఊహించని అవాంతరం ఎట్టకేలకు జూన్‌లో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. నిధులు అందుబాటులో ఉన్నందున ఉపాధి పనుల్లో భాగంగా గండ్ల పూడ్చివేత పనులు ప్రారంభించేందుకు ఆయా గ్రామాల సర్పంచులు ప్రయత్నించగా నీటిపారుదల శాఖ అధికారులు సహాయ నిరాకరణ మొదలుపెట్టారు. కారణమేమిటని ఆరా తీస్తే.. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పను లు చేయించలేమని చెప్పారు. దాంతో రైతులు బిత్తరపోయారు. తాము చెప్పేవరకు పనులు చేపట్టవద్దని నియోజకవర్గ ప్రజాప్రతినిధి అధికారులను ఆదేశించినట్లు తెలిసి వారంతా అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు, చెరువులకు గండ్లు పడి గత ఏడాది పూర్తిగా నష్టపోయాం. గండ్లు పూడుస్తారనే ఆశతో చెరువుల కింద ఆయకట్టులో వరి నాట్లు వేశాం. కానీ ఆ పనులు జరిగే పరిస్థితి కనిపించ క పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. గండ్లు పూడ్చకపోవడంతో వరద నీరు చెరువుల్లో నిలిచే పరిస్థితి లేదు. పైగా భారీవర్షాలు కురిస్తే గండ్ల ద్వారా నీరు మళ్లీ పంటపొలాలను ముంచెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్‌కు మొర పంటలు సాగు చేసే పరిస్థితి లేకపోగా వరద ముప్పు పొంచి ఉండటంతో చెరువుల ఆయకట్టు రైతులు ఇటీవల కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను కలిశారు. గండ్ల పూడ్చివేతకు నిధులు మంజూరైనా రాజకీయ ఒత్తిళ్లతో నీటిపారుదల శాఖ అధికారులు పనులు చేపట్టేందుకు ముందుకు రావడంలేదని ఫిర్యాదు చేశారు. వెంటనే పనులు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఆయన స్పందించి నీటిపారుదల శాఖ డీఈతో మాట్లాడారు. వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఉపాధి కూలీ... జేబు ఖాళీ
నిజాంసాగర్, న్యూస్‌లైన్: పొట్టకూటి కోసం ఉపాధి పనులు చేస్తున్న కూలీలు డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. వారం రోజుల్లో చేతికందాల్సిన కూలీ డబ్బులు రెండు నెలలైనా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో రెక్కలు వంచి ఉపాధి పనులు చేస్తున్నా.. కూలీ డబ్బులు సకాలంలో రాకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. జిల్లాలో 718 గ్రామపంచాయతీల కు గాను 620 పైగా గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లో రోజుకు 1.5 లక్షల మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొం టున్నారు. గత మార్చి 2వ వారం నుంచి ఉపాధి పనులు చేస్తున్న కూలీల కు ఇంతవరకు డబ్బులు రాలేదు. వారం వారం కూలీలు ఉపాధి పనులు చేస్తున్నా, అధికారులు డబ్బులు మం జూరు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు.కుంటుంబ పోషణ కోసం కూలీ పనులు చేస్తున్న వారికి సకాలంలో డబ్బులు అందకపోవడంతో అప్పులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూలీల సంఖ్యను పెంచాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీచేస్తున్న అధికారులు, కూలీ డబ్బుల చెల్లింపుపై శ్రద్ధ చూపడం లేదు. కూలి డబ్బుల కోసం గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసుల్లో, సీఎస్పీ కేంద్రాల ద్వారా డబ్బులు తీసుకోవాల్సిన కూలీలు వారిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండు నెలల నుంచి ఉపాధి డబ్బులు పెండింగ్‌లో ఉండటంతో కూలీలు ఈజీఎస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కూలీలకు దాదాపు 20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్ఆర్ఈ జీఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రాంటు కొరత వల్ల డబ్బులు రావడం ఆలస్యమవుతోందని ఈజీఎస్ జిల్లా అధికారుల ద్వారా తెలిసింది. -
‘ఉపాధి’కి ఊపు
ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల గుర్తింపు ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్లతో పనులు చేపట్టాలని డ్వామా అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఏటా డిసెంబర్ నెలలోనే పనులు గుర్తింపునకు చర్యలు చేపట్టాలని గతేడాది ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోగా ఇప్పటి వరకు చేపడుతున్న పనులకు అదనంగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో 16 రకాల కొత్త పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో గుర్తింపు ఆలస్యమయ్యింది. వాస్తవంగా జనవరి 22లోగా పనుల గుర్తింపు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలరీత్యా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడంలో కొంత జాప్యం జరిగింది. జిల్లాలో 46 మండలాల్లోని 888 గ్రామాల్లో 36,439 పనులు చేపట్టాలని అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. కూలీలకు వేతనాల కింద రూ.129.42 కోట్లు చెల్లించనున్నారు. కొత్తగా చేపట్టనున్న పనులు ఇవే గ్రామాల్లోని ఉమ్మడి భూముల్లో పొదలు, ముళ్లకంపలు కొట్టడం, భూమి చదును చేయడం, చేపలు, రొయ్యల చెరువుల పూడికలు, కంపోస్టు ఫిట్ల తవ్వకం, సాగునీటి డ్రెయిన్లు, కాలువలు, ప్రాజెక్టుల్లో గుర్రపుడెక్క తీత, మంచినీటి, రజక, దూడల చెరువుల పూడికలు, రోడ్లకు అడ్డంగా ఉన్న జంగిల్ క్లియరెన్స్, నేలనూతులు బాగు చేసుకోవటం, కొబ్బరిచెట్ల పెంపకం, అభివృద్ధి, వర్షాలు, వరదల వల్ల గండ్లు పడిన చెరువులను అభివృద్ధి చేసుకోవటం వంటి పనులకు ఉపాధి హామీలో కొత్తగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూ.105గా ఉన్న సరాసరి కూలీ రేటు వచ్చే సీజన్లో మరో రూ.20 పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఉపాధి కూలీలకు ప్రయోజనం కలగనుంది. అత్యధిక బడ్జెట్ బుట్టాయగూడెంలో.. జిల్లాలోని 46 మండలాల్లో బుట్టాయగూడెంలో 441 పనులకు రూ.10.47 కోట్లతో అత్యధిక బడ్జెట్‌ను రూపొందించారు. డెల్టా మండలాల్లో రూ.79 లక్షల నుంచి అత్యధికంగా ఆరు కోట్ల వరకు నిధులు ఖర్చు చేయడానికి ప్రతిపాదించారు. అత్యల్పంగా పెరవలిలో రూ.79 లక్షలు మేర ఉపాధి పనులు చేయనున్నారు. పనులు చేసిన వెంటనే పోస్టాఫీసుల ద్వారా వేతనాలు చెల్లించే దిశగా డ్వామా అధికారులు అడుగులు వేస్తున్నారు.