తెలుగు తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడటమే కాకుండా, వీటిని వెలుగులోకి తెస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారు.
దాడికి పాల్పడిన టీడీపీ నేత
‘ఉపాధి’లో అక్రమాలు వెలుగులోకి వస్తాయన్న అక్కసుతోనే...
విశాఖపట్నం : తెలుగు తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడటమే కాకుండా, వీటిని వెలుగులోకి తెస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారు. ఉపాధి పనుల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు వెళ్లిన సాక్షి చానల్ విలేకరి జక్కు అప్పలస్వామినాయుడుపై గొలుగొండ మండల టీడీపీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు దాడికి పాల్పడ్డారు. కెమెరా, సెల్‌ఫోన్ లాక్కొని దౌర్జన్యం చేశారు. దీనిపై అప్పలస్వామినాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలావున్నాయి. గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం సమీపంలోని పాలెపు చెరువులో జాతీయ ఉపాధిహామీ నిధులు రూ.50 లక్షలతో పూడిక తొలగింపు పనులు జరుగుతున్నాయి. వీటిని బినామీ పేరిట మండల టీడీపీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు చేపడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ చెరువులో పూడిక మట్టిని నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంత ప్రాంగణాల్లో లోతట్టు ప్రాంతాలను మెరకచేసేందుకు వినియోగించాలి.
లేదంటే నీటిపారుదలశాఖ అధికారులకు క్యూబిక్ మీటర్ రూ.30 చొప్పున చెల్లించి ఇతర వ్యక్తులకు విక్రయించాలి. ఇలాకాకుండా ఆయన రెండు రోజులనుంచి బయట వ్యక్తులకు లారీ మట్టి రూ.600 నుంచి రూ.700కు విక్రయిస్తున్నారు. ఈ అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు వెళ్లిన సాక్షి చానల్ విలేకరి జక్కు అప్పలస్వామినాయుడును అప్పలనాయుడు అడ్డుకున్నారు. నీవు ఎవడివని, కవరేజి చేస్తే చంపుతానని బెదిరిస్తూ కెమెరా, సెల్‌ఫోన్ లాక్కొని దౌర్జన్యం చేశారు. దీనిపై బాధిత విలేకరి గొలుగొండ ఎస్‌ఐ జోగారావుకు ఫిర్యాదు చేశారు. ఉపాధి పనులకు ఆటంకం కలిగించాడని టీడీపీ నాయకుడు అప్పలనాయుడు కూడా ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల నుంచి అందిన ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.