కలిసిరాని ‘జాతకం’
నారాయణఖేడ్: తమ పాండిత్యంతో నలుగురికీ జాతకాలు చెబుతూ.. వారు మాత్రం అంధకారంలో మగ్గిపోతున్నారు. ఏళ్లుగా నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక.. మరో పని చేయలేక అవస్థలు పడుతున్నారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా ఎర్నలి ప్రాంతం నుంచి 1991లో పలు కుటుంబాలు చిలక జోస్యం, పంచాంగం చెప్పేందుకు వలసవచ్చాయి. ఇలా వచ్చిన దాదాపు 50 కుటుంబాలు నారాయణఖేడ్‌లో స్థిరపడ్డాయి. ప్రస్తుతం 200 పైగా జనాభాతో పట్టణంలోని అనుశమ్మ కాలనీలో అద్దె ఇళ్లు, గుడారాల్లో జీవిస్తున్నారు.
ఆశల ఉదయం
తెల్లవారగానే వీరి ప్రయాణం మొదలవుతుంది. పొద్దున్నే తలస్నానం ఆచరించి నుదుటున తిలకం దిద్దుకొని ఒక్కొక్కరు ఒక్కో గ్రామానికి పయనమవుతారు. ఇలా నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని గ్రామాలతో పాటు నిజామాబాద్ జిల్లా పిట్లం, నిజాంసాగర్, బాన్సువాడ, జుక్కల్ తదితర మండలాల్లోని గ్రామాలకు వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల్లో వీధిలు తిరుగుతూ జాతకాలు చెబుతుంటారు. అయితే, గతంలో తాము గ్రామాలకు వెళ్తే ఎంతో మర్యాదగా ఇంటికి పిలిచి మరీ జాతకాలు చెప్పించుకునే వారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వారు ఆవేదన చెందుతున్నారు.
టెక్నాలజీ విప్లవం.. దినదిన గండం
10 ఏళ్ల క్రితం వరకు కులవృత్తి మంచిగానే సాగిందని వీరు చెబుతున్నారు. టీవీలు, పత్రికలు ఎక్కువవడం.. అందులోనూ జాతకాలు చెబుతుండటంతో తమకు ఆదరణ తగ్గిందని ఆవేదన చెందుతున్నారు. టెక్నాలజీ అభివృద్ధితో తాము తిరోగమన దిశలో ఉన్నామని పేర్కొన్నారు. నిత్యం జాతకం చెప్పించుకునే వారికోసం గాలించినా చిక్కడ కష్టమైందంటున్నారు.
మార్పు కోసం ఎదురుచూపులు
బీదర్ జిల్లా ఎర్నలి నుంచి నారాయణఖేడ్ ప్రాంతానికి 20 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడే స్థిరపడిపోయామని గోందాల ప్రకాశ్, పాండురంగ తెలిపారు. తమలో చాలామందికి ఓటరు కార్డు, రేషన్‌కార్డులు ఉన్నాయని చెప్పారు. తమ పిల్లలకు ఇలాంటి దుస్థితి రాకూడదనే ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామన్నారు. తమ వరకు ఏ ఒక్క సంక్షేమ పథకం అందడం లేదని, సర్కార్ మాకు ఉపాధి కల్పిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కొందరు జాతకాలు చెప్పడం మాని కూలీ చేస్తున్నారని ఆవేదన చెందారు.
గలగల.. వెలవెల!
వీరికి ఓ రోజు పండగ వాతావరణం కన్పిస్తే.. మరో రోజు అధ్వాన పరిస్థితి ఎదురవుతుంది. జాతకాలు చెప్పించుకొనేవారు ఎదురైతేనే నాలుగు కాసులు చేతిలో పడతాయి. ఒకరోజు రూ.50 లభిస్తే మరోరోజు రూ.200 వరకు వస్తాయని జాతకం చెప్పేవారు తెలిపారు. దేవుడి దయతో తమ బతుకులు ఆధారపడి ఉంటాయన్నారు.
పిల్లలపైనే ఆశ
12 ఏళ్ల వయస్సు నుంచి చిలక పంచాంగం చెబుతున్నా. ఇప్పుడు నాకు 30 ఏళ్లు. ఇద్దరు పిల్లలున్నారు. వృత్తి గిట్టుబాటు కాలేదు. పిల్లల్ని అయినా మంచిగా చదివించుకోవాలని ఉంది. వారు మంచి వృత్తిలో స్థిరపడితే అంతకన్నా ఏం కావాలి.
- గోందాల్ ప్రకాశ్, చిలకజోస్యం
ప్రభుత్వంఆదుకోవాలి
ఉపాధి పనులు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. నాకు చదువు కూడా రాదు. నలుగురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ప్రభుత్వం పాఠశాలలో చదివిస్తున్నాం. మాజీవితం ఎటూ కాకుండా పోయింది. వాళ్లయినా బాగుపడితే చాలు.
- పాండురంగం, పంచాంగ పఠకుడు