ఉపాధి పనులకు జీపీఎస్ టెక్నాలజీ
ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యక్రమాలపై సమీక్షలో మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ఉపాధిహామీ కార్యక్రమాల అమలులో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) టెక్నాలజీని వినియోగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని టీసీపార్డ్‌లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యక్రమాలపై గ్రామీణాభివృద్ధి విభాగం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. వివిధ జిల్లాల్లో ఉపాధి నిధులతో చేపడుతున్న నిర్మాణ పనుల ఫొటోలను నగరం నుంచే పర్యవేక్షించడం ద్వారా, పనుల పరిశీల నతో పాటు పారదర్శకతకూ దోహదపడుతుందన్నారు. పలు అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తులను కన్సల్టెంట్‌లుగా పెట్టుకోవాలని సూచిం చారు. పనుల్లో వేగం పెంచేందుకు సరైన గౌరవవేతనమిచ్చి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. అంచనాలు, డిజైన్ల రూపకల్పనకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
జూన్ 2కల్లా గ్రామాలన్నీ పరిశుభ్రంగా..
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాల్లోనూ ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని, జూన్ 2కల్లా గ్రామాలన్నీ పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ డెరైక్టర్‌ను మంత్రి జూపల్లి ఆదేశించారు. తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం అమలులో భాగంగా రైతులకు లాభసాటి వ్యవసాయ, పాడి పరిశ్రమ పద్ధతులను తెలపాలన్నారు. అమూల్ పాల విక్రయ సంస్థ రూపొందించిన బిజినెస్ మోడల్‌ను పరిశీలించాలని సూచించారు. జూన్ 24 నుంచి అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను, పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన పనుల్ని స్వయంగా పరిశీలించేందుకు వెళుతున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. సమీక్షలో పీఆర్ శాఖ డెరైక్టర్ అనితా రామ్‌చంద్రన్, పలువురు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు పాల్గొన్నారు.