
50 మందితో ‘శ్రమ శక్తి సంఘం’గా ఏర్పాటు చేసుకోవాలన్న కూటమి ప్రభుత్వం
గ్రూపులుగా ఏర్పడిన కూలీలకే పనులు
సంఘం లీడర్‌గా ‘మేట్’లు.. వీరి పర్యవేక్షణలోనే సంఘాల వారీగా కూలీలకు పని కేటాయింపు.. దీంతో నచ్చిన వారికే పనులు కేటాయించే అవకాశం
‘ఉపాధి’లో ఆధిపత్యం కోసం దాడులు.. ఏలూరు జిల్లాలో 8 మందికి గాయాలు
జాబ్ కార్డులు, కోట్ల పని దినాలలో నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రికార్డు
నేడు పథకంలో రాజకీయ జోక్యం.. కూలీల ఉపాధికి గండి పడే ప్రమాదం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: నాడు.. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో రికార్డు స్థాయిలో కోట్ల పని దినాలు కల్పించడం ద్వారా పేదరికాన్ని తొలగించే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. నేడు.. టీడీపీ కూటమి సర్కారు ‘గ్రూపు’ రాజకీయాలను ప్రోత్సహిస్తూ పల్లెల్లో చిచ్చు రాజేస్తోంది! దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రూపుల వ్యవస్థను ఏపీలో ప్రవేశపెట్టి శ్రమశక్తి సంఘాల (ఎస్‌ఎస్‌ఎస్) పేరుతో గ్రామాల్లో ప్రతి 50 మందికి ఓ గ్రూపు చొప్పున ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
ఈ క్రమంలో ఉపాధి పనుల్లో ఆధిపత్యం కోసం ఏలూరు జిల్లాలో సోమవారం రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. మే్రస్తిగా ఉన్నవారు తమ వర్గం వారికి అనుకూలంగా మస్తర్లు వేస్తున్నట్లు ఘర్షణకు దిగడంతో ఎనిమిది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కోవిడ్ వేళ సైతం ఉపాధి హామీ ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించి ఆదుకుంటే.. కూటమి సర్కారు మాత్రం నచి్చన వారికే ఉపాధి కల్పిస్తోంది.
కూలీలు ఓ గ్రూపుగా ఏర్పడి పని కావాలని దరఖాస్తు చేసుకుంటేనే ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కేటాయిస్తోంది. ఒక గ్రూపులో చేరిన కూలీలు అందులో నుంచి బయటకొచ్చి కొత్త దాంట్లో చేరేందుకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. అసలు గ్రూపులతో సంబంధం లేకుండా ఏదైనా కుటుంబం వ్యక్తిగతంగా పని కావాలని కోరినా కేటాయించే అవకాశమే ఉండదు.
గ్రూపులతో గ్రామాల్లో చిచ్చు..
ఒకసారి శ్రమశక్తి సంఘం ఏర్పాటయ్యాక సంవత్సరం వరకు ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రతి సంఘానికి లీడర్‌గా ‘మేట్’ ఉంటారు. కూలీలను సమీకరించడం మేట్ ప్రధాన బాధ్యత. కూలీల కుటుంబాలు ఒకసారి ఏదైనా గ్రూపులో చేరితే కనీసం ఏడాదిపాటు ఆ మేట్ సమక్షంలో పనిచేయక తప్పుదు. ఏ పరిస్థితుల్లోనైనా మేట్‌తో విభేదాలు తలెత్తితే ఆ కుటుంబానికి పని దక్కకుండా చేసే అవకాశం ఉంది.
2014–19 మధ్య టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ఉపాధి పనుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఏ పనులైనా తమకు అనుకూలంగా ఉండేవారికే కేటాయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పలువురు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి తమ వర్గీయులను నియమించుకున్నారు. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లతో తాజాగా కర్నూలు జిల్లాలో ఓ ఫీల్డు అసిస్టెంట్ దారుణ హత్యకు గురయ్యాడు.
అడ్డగోలుగా తొలగింపులు..
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తూ తమ అనుచరులకు చోటు కల్పిస్తున్నారు. వారి ఆగడాలు తట్టుకోలేక కొందరు స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 115 మందికి పైగా తొలగించారు. అదేమంటే స్వచ్ఛందంగా రాజీనామా చేశారని ఏపీఓలు అంటున్నారు. మిగిలిన వారినీ తొలగించేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లావ్యాప్తంగా 435 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు.
టీడీపీ ప్రభుత్వం పలువురు తప్పుకున్నారు. 40 మంది మేట్‌లను కూడా తొలగించారు. రాజీనామా చేయని ఫీల్డ్ అసిస్టెంట్లకు డ్వామా అధికారులు నోటీసులిస్తూ వేధిస్తున్నారు. బాపట్ల జిల్లాలో ఇప్పటివరకు 134 మందిని ఇంటికి పంపించగా నెల్లూరు జిల్లాలోని 430 పంచాయతీల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 721 మందికి గానూ 485 మందిని తప్పించి టీడీపీ సానుభూతిపరులను నియమించుకున్నారు.
ఏలూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం రాగానే ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ తప్పుకోవాలని హెచ్చరించడంతో 350 మంది వైదొలిగారు. కోనసీమ, కాకినాడ జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగానే వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 32 మందిని సస్పెండ్ చేయగా, 45 మందిని ఇంటికి పంపించారు. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో ఆరుగు ఫీల్డ్ అసిస్టెంట్లు, ముగ్గురు మేట్లను తొలగించారు. శ్రీసత్యసాయి జిల్లాలో 520 మంది ఫీల్డ్ అసిస్టెంట్లనూ మార్చేశారు. అనంతపురం జిల్లాలో 90 శాతం ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చారు. కర్నూలు జిల్లాలో ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించి పలువురిని తొలగించారు.
పని దినాల కల్పనలో నాడు రికార్డు
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా ఏ కుటుంబం వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నా పని కల్పించే విధానాన్ని అమలు చేసింది. ఎవరి వద్దకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా కోరిన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా పనులను కేటాయించింది. పనులు కోరిన వారందరికీ జాబ్ కార్డులు జారీ చేసింది. దేశమంతా కోవిడ్‌తో కకావికలమైన వేళ.. గ్రామాలకు పెద్ద ఎత్తున తరలివచి్చన వారందరికీ భరోసానిచ్చి పనులు కల్పించి ఆదుకుంది. పని దినాల కల్పనలోనూ రికార్డు సృష్టించింది. ఐదేళ్లలో ఏకంగా 114.82 కోట్ల పని దినాలను కల్పించి రికార్డు సృష్టించింది.
⇒ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ పేద కూలీలకు ‘ఉపాధి’లో భారీగా కోతపడింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పన బాగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో జూన్–జనవరి మధ్య కల్పించిన పని దినాలను ఈ ఆర్ధిక సంవత్సరం(2024–25)లోని జూన్–జనవరి మధ్య కల్పించిన పనిదినాలతో పోలిస్తే ఏకంగా 2.69 కోట్ల పనిదినాలు తగ్గాయి. దీనివల్ల గ్రామీణ పేదలు వేతనాల రూపంలో రూ.700 కోట్ల మేర నష్టపోయారు. దీనిలో ఎక్కువగా నష్టపోయింది ఎస్టీ, ఎస్టీలే. ఈ విషయాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
⇒ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 2023 జూన్ నుంచి 2024 జనవరి మధ్య గ్రామీణ పేదలకు 10.87 కోట్ల పని దినాలపాటు పనులు కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు కేవలం 7.18 కోట్ల పనిదినాలు మాత్రమే పనులు కల్పించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ పథకం అమలులో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్లే పేదలకు పనుల కల్పన తగ్గిపోయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment