ధారూరు(రంగారెడ్డి): ఉపాధి పనుల్లో వజ్రం లభ్యమైందనే ప్రచారం గ్రామస్తులతోపాటు పోలీసులను ఉరుకులు పరుకులు పెట్టించింది. చివరికి అదంతా తమాషా కోసం చేసిన ప్రచారమని తెలిసి.. ఎస్సై గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం అల్లీపూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ... గ్రామానికి చెందిన పాతూరు చిన్న అంతయ్య భూమిలో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులను గ్రామానికి చెందిన 16 మంది చేస్తున్నారు.
వారిలో నర్సయ్య అనే కూలీ గ్రామంలో ఉన్న శ్రీనివాస్‌కు ఫోన్ చేసి పనిచేస్తున్న చోట వజ్రం దొరికిందని చెప్పాడు. అంతే.. ఈ వార్త ఒకరి నుంచి ఒకరికి తెలియటంతో గ్రామస్తులంతా పని జరిగే వద్దకు తరలివచ్చారు. ఈ సమాచారం అందుకున్న ఎస్సై మల్లేశం కూడా సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అక్కడి వారిని వజ్రం ఉదంతంపై ఆరా తీయగా.. తాము సరదా కోసమే వజ్రం దొరికిందని చెప్పామని, వాస్తవంగా అలాంటిది ఏమీ దొరకలేదని కూలీలు ఎస్సైకి వివరించారు. సరదా కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయటం నేరమని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధి పనుల్లో వజ్రం దొరికింది(ట)!
Published Tue, Feb 2 2016 6:48 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement