అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామాలయం ప్రారంభోత్సవ తేదీ దగ్గర పడుతుండడంతో భక్తులలో ఉత్సాహం నెలకొంటోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే తన ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తన వెంట రామ మందిర ప్రతిరూపాన్ని తీసుకెళ్లారు. తాజాగా సూరత్‌లో ఒక వ్యాపారి రామ మందిరం నేపథ్యంతో వజ్రాల హారాన్ని తయారు చేయించారు.
ఈ వజ్రాల హారంలో ఐదు వేల అమెరికన్ వజ్రాలు ఉపయోగించామని సదరు వ్యాపారి తెలిపారు. హారం తయారీలో రెండు కిలోల వెండిని వినియోగించామన్నారు. అలాగే 40 మంది కళాకారులు ఈ డిజైన్‌ను 35 రోజుల్లో పూర్తి చేశారన్నారు. దీనిని ఎలాంటి వాణిజ్య ప్రయోజనం కోసం తయారు చేయలేదని, అయోధ్యలోని రామాలయానికి కానుకగా అందజేస్తామని తెలిపారు.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నూతనంగా నిర్మితమైన ఆలయంలో జనవరి 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ప్రపంచంలోని కోట్లాది మంది రామభక్తులు ఈ వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. వివిధ సంప్రదాయాలకు చెందిన సాధువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ వేడుకల భద్రతా ఏర్పాట్ల గురించి అయోధ్య రేంజ్ ఐజి ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు ఎప్పుడూ కట్టుదిట్టంగా ఉంటాయన్నారు. సీఆర్‌పీఎఫ్, యూపీఎస్‌ఎస్‌ఎఫ్, పీఎస్‌ఇ, సివిల్ పోలీసులు నిత్యం పహారా కాస్తారన్నారు. కొత్త భద్రతా ప్రణాళికల ప్రకారం ఇక్కడికి వచ్చే ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేస్తామని అన్నారు. అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నదీతీరం గుండా కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేడుకల సందర్భంగా 37 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: ఏఐతో మరో కొత్త ఆందోళన!
Comments
Please login to add a commentAdd a comment