అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
డీఆర్‌డీఓ శ్రీనివాసకుమార్
రఘునాథపల్లి: ఉపాధి పనుల్లో అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని డీఆర్‌డీఓ ఆకవరం శ్రీనివాసకుమార్ హెచ్చరించారు. ఉపాధి పనులపై మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం జరిగిన 10వ విడత ఓపెన్ ఫోరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసిస్టెంట్ పీడీ వసంత, ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ బానోతు శారద హాజరైన ఈ కార్యక్రమంలో సోషల్ అడిట్ బృందాల తనిఖీ నివేదికలను డీఆర్‌పీలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఉపాధి పనుల్లో చేసిన పనులకంటే ఎక్కువ బిల్లులు చెల్లించినట్లు తేలడం, పనుల ప్రదేశాలను మార్చి చేయించడం, మస్టర్లలో దిద్దుబాట్లు, ఒకరి పేరు బదలు మరొకరి పేరు, మేట్‌లే సంతకాలు చేయడం లాంటి లోపాలను గుర్తించారు. దీంతో పలువురు ఎఫ్‌ఏ, టీఏల నుంచి రికవరీకి అసిస్టెంట్ పీడీ వసంత ఆదేశించారు. చాలా రాత్రి వరకు కొన్ని గ్రామాల నివేదికలు పూర్తి కాలేదు.
శ్రీనిధిలో చేతి వాటం
మహిళల నిరాక్ష్యరాస్యతను ఆసరా చేసుకొని గ్రామైఖ్య సంఘాల్లో పని చేస్తున్న పలువురు సీఏలు చేతి వాటం ప్రదర్శించారని సోషల్ అడిట్ బృందాలు అయా గ్రామసభలలో వెలుగులోకి తెచ్చారు. ముఖ్యంగా మాదారంలో సీఎ కర్ల పద్మ శ్రీనిధి రుణాలు పొందిన ప్రతీ మహిళ నుంచి రూ.1000 చొప్పున తీసుకున్నట్లు గ్రామసభలో సోషల్ అడిట్ బృందాలు బహిర్గతం చేశారు. కాగా, ప్రజావేదికకు ప్రజలు పెద్దగా హాజరు కాలేదు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్కపురం లక్ష్మయ్య, ఎంపీడీఓ బానోత్ సరిత, జిల్లా విజిలెన్స్ అధికారి ప్రభాకర్, ఎస్‌టీఎం వేణు, ఎస్సార్పీలు రవి, మహేశ్వర్, అజయ్, ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్, క్వాలిటీ కంట్రోల్ అధికారి సుధాకర్, ఏపీఓ ప్రేమయ్య, ఏపీఎం భవా ని, సర్పంచ్‌లు జోగు గట్టయ్య, ఎండీ యాకుబ్ అలీ, మినుకూరి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.