►పూడ్చివేతకు నోచుకోని చెరువుల గండ్లు
►గత ఏడాది భారీ వర్షాలకు పంటలను, ఊళ్లను ముంచేసిన వరద
►23 చెరువులకు గండ్లు.. 7 వేల ఎకరాల్లో పంట నాశనం
►తక్షణమే స్పందించిన అధికారులు.. రూ.85 లక్షలు మంజూరు
►అయినా ఇప్పటికీ ప్రారంభం కాని పనులు
►మొదట ఎన్నికల కోడ్‌తో ఆటంకం
►ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లతో అవాంతరం
►ఈ ఏడాదీ కడగండ్లు తప్పవేమోనని రైతుల ఆందోళన
పొందూరు : పొందూరు మండల చరిత్రలో ఎన్నడూ ఎరుగని ఉత్పాతం.. భారీ వర్షాలకు చెరువులు కట్టలు తెంచుకున్నాయి. వరద నీరు పంట పొలాలు, ఊళ్లు, రోడ్లను ముంచెత్తింది. 23 చెరువులకు గండ్లు పడగా.. 7వేల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. మండల కేంద్రమైన పొందూరు పట్టణం పూర్తిగా జలదగ్బంధంలో చిక్కుకుంది. ఇదంతా గత ఏడాది అక్టోబర్‌లో జరిగింది. అప్పటి కలెక్టర్, జిల్లా ప్రత్యేకాధికారి మండలంలో పర్యటించి, పరిస్థితిని పరిశీలించాలరు. గండ్ల పూడ్చివేతకు ఉపాధి హామీ పథకం కింద రూ.85 లక్షలు మంజూరు చేశారు.
పొందూరు, బాణాం, తానెం, దళ్లిపేట, గారపేట, లోలుగు, రాపాక, తోలాపి, నర్సాపురం, వి.ఆర్. గూడెం గ్రామాలకు చెందిన చెరువులకు గండ్లు పడ్డాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటంతో ఒక చెరువు నుంచి మరో చెరువులోకి పొంగి ప్రవహించి.. సుమారు 7 వేల ఎకరాల్లో పంటలను ముంచేసింది. అధికారులు స్పందించి నిధులు మంజూరు చేయడంతో మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు మొదలెట్టారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది. కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో ఎన్నికలు పూర్తి అయ్యి, కోడ్ ఉపసంహరించేవరకు పనులు చేపట్టే అవకాశం లేకుండాపోయింది.
ఊహించని అవాంతరం
ఎట్టకేలకు జూన్‌లో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. నిధులు అందుబాటులో ఉన్నందున ఉపాధి పనుల్లో భాగంగా గండ్ల పూడ్చివేత పనులు ప్రారంభించేందుకు ఆయా గ్రామాల సర్పంచులు ప్రయత్నించగా నీటిపారుదల శాఖ అధికారులు సహాయ నిరాకరణ మొదలుపెట్టారు. కారణమేమిటని ఆరా తీస్తే.. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పను లు చేయించలేమని చెప్పారు. దాంతో రైతులు బిత్తరపోయారు. తాము చెప్పేవరకు పనులు చేపట్టవద్దని నియోజకవర్గ ప్రజాప్రతినిధి అధికారులను ఆదేశించినట్లు తెలిసి వారంతా అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాలు, చెరువులకు గండ్లు పడి గత ఏడాది పూర్తిగా నష్టపోయాం. గండ్లు పూడుస్తారనే ఆశతో చెరువుల కింద ఆయకట్టులో వరి నాట్లు వేశాం. కానీ ఆ పనులు జరిగే పరిస్థితి కనిపించ క పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. గండ్లు పూడ్చకపోవడంతో వరద నీరు చెరువుల్లో నిలిచే పరిస్థితి లేదు. పైగా భారీవర్షాలు కురిస్తే గండ్ల ద్వారా నీరు మళ్లీ పంటపొలాలను ముంచెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కలెక్టర్‌కు మొర
పంటలు సాగు చేసే పరిస్థితి లేకపోగా వరద ముప్పు పొంచి ఉండటంతో చెరువుల ఆయకట్టు రైతులు ఇటీవల కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను కలిశారు. గండ్ల పూడ్చివేతకు నిధులు మంజూరైనా రాజకీయ ఒత్తిళ్లతో నీటిపారుదల శాఖ అధికారులు పనులు చేపట్టేందుకు ముందుకు రావడంలేదని ఫిర్యాదు చేశారు. వెంటనే పనులు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఆయన స్పందించి నీటిపారుదల శాఖ డీఈతో మాట్లాడారు. వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాజకీయ గండం
Published Sat, Sep 6 2014 2:56 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement