ఉపాధి లేక.. గల్ఫ్ బాట! | Many people to migrate gulf countries for works by hitting of drought | Sakshi
Sakshi News home page

ఉపాధి లేక.. గల్ఫ్ బాట!

Published Mon, May 16 2016 8:30 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

ఉపాధి లేక.. గల్ఫ్ బాట!

ఉపాధి లేక.. గల్ఫ్ బాట!

 కరువు దెబ్బకు గల్ఫ్ పయనం
 ఒట్టి చేతులతో ఇంటిముఖం
 ఏజెంట్ల మోసం
 అప్పులు కుప్పలు
 వీర్నపల్లివాసుల వెతలు
 ఉన్న ఊళ్లోనే ఉపాధికోసం నిరీక్షణ
 జిల్లా అంతటా ఇదే పరిస్థితి
 
 కరువు ఉరిమింది. ఉన్న ఉళ్లో ఉపాధి కరువైంది. బతుకుదెరువుకు చేసిన అప్పు వడ్డీలతో కలిపి కుప్పయింది. అప్పు తీర్చే మార్గం లేక గల్ఫ్ దేశాలకు వెళితే రాత్రింబవళ్లు పని చేయించుకున్న యాజమాన్యం జీతమడిగే సరికి కొంతమేర విదిల్చింది. ఆ జీతం తిండికే సరిపోని పరిస్థితి. ఎప్పుడైనా అనారోగ్యం బారిన పడితే... అంతే సంగతులు. ఇట్లయితే అప్పు తీరేదెలా? ఇల్లు గడిచేదెలా? అని బెంగపట్టుకుంది. ఇక లాభం లేదనుకుని యాజమాన్యాన్ని ఎదిరించి స్వదేశానికి తిరిగొస్తుంటే పాస్‌పోర్టు లాక్కుని జైళ్లో వేయించింది.
 
 నాలుగు నెలలు జైళ్లో గడిపి ఎలాగోలా ఇంటికి చేరుకుంటే... ఊళ్లో పరిస్థితి మళ్లీ భయపెడుతోంది. ఎటు చూసినా కరువే... ఏ పనీ లేదు. ఇంటిని ఎట్లా నెట్టుకురావాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రధానమంత్రి సంసద్ గ్రామీణ యోజన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న వీర్నపల్లిలో యువకుల దుస్థితి ఇది.        
 - సాక్షి ప్రతినిధి, కరీంనగర్
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : వీర్నపల్లిలో జనాభా 3684 మంది. 99 శాతం ప్రజలు దళిత, గిరిజన, వెనుకబడిన సామాజికవర్గాలవారే. 8 తండాలున్న ఈ పంచాయతీలో 42 శాతం ఎస్టీ, 22 శాతం ఎస్సీ, 35 శాతం బీసీ జనాభా ఉన్నారు. మిగిలిన ఒకే ఒక్క శాతం జనాభాలో ఒక వెలమ, 10 వైశ్య సామాజిక కుటుంబాలు నివసిస్తున్నాయి. పురుష, మహిళా నిష్పత్తిలో మహిళలే అధికంగా ఉన్న పల్లె ఇది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామమిదే. గతంలో పూర్తి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసుల బూట్ల చప్పుళ్లు, నక్సలైట్ల తూటాల పహారాలో నలిగిన గ్రామమిది.
 
 గత పదేళ్లలో పోలీసులు, నక్సల్స్ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పల్లె కావడంతో... వీర్నపల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎంపీ వినోద్‌కుమార్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఏడాదిన్నరలో ఈ గ్రామంలో చాలా మార్పులే వచ్చాయి. వయోజన విద్య కార్యక్రమంగా పకడ్బందీగా అమలు చేయడంతో నూరు శాతం అక్షరాస్యత సాధించారు. గ్రామీణ బ్యాంకు ఏర్పాటైంది. ఒకప్పుడు ఇంటింటికీ గుడుంబా తయారు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి చాలా మేరకు మారింది. కానీ, చేయడానికి పనుల్లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
 
 బతుకుదెరువుకు వెళ్లి... మోసపోయి ఇల్లు చేరి..
 బతుకుదెరువు కోసం ఈ ఊరి నుంచి 1200 మందికిపైగా గల్ఫ్ దేశాలకు వెళ్లారు. లక్షలకు లక్షలు సంపాదించవచ్చన్న ఏజెంట్లు మాటలు నమ్మి చేతిలో డబ్బుల్లేకపోయినా ఇల్లు, పొలం కుదవపెట్టి అప్పు చేసి మరీ వెళ్లినవాళ్లే ఎక్కువ. తీరా అక్కడికి వెళ్లాక పెద్ద జీతం సంగతి దేవుడెరుగు... బతుకే నరకంగా మారడంతో... ఉండలేక ఒట్టి చేతులతో తిరిగొస్తున్నారు.  ఇలా 225 మందికిపైగా యువకులు తిరిగి వీర్నపల్లి రావడం గమనార్హం. ‘సార్... రోజూ 8 గంటలు పని. నెలకు లక్ష రూపాయల దాకా సంపాదించవచ్చని ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి అక్కడికి వెళ్తే తెలిసింది... దూరపు కొండలు నునుపు అని’ అంటూ వాపోయాడు వీర్నపల్లికి చెందిన మల్లారపు రవి.  ఇదే గ్రామానికి చెందిన రాజంది సైతం ఇదే పరిస్థితి. ‘అప్పు చేసి దుబయ్ పోతే వాళ్లిచ్చే జీతం తిండికే సరిపోలేదు.
 
 జ్వరమొస్తే ఆసుపత్రిలో కూడా చూపించలేదు. ఫోర్‌మెన్ ఉద్యోగమని తీసుకెళ్లి అడ్డాకూలీ పని చేయించిండ్రు. రోజుకు 12 గంటలు పనిచేయించుకున్నరు. కోపమొచ్చి వద్దామంటే పాస్‌పోర్టు గుంజుకుని జైల్లో పెట్టించిండ్రు’ అని అని జి.రాములు వాపోయాడు. దుబయ్ వెళ్లిన వాళ్లలో నూటికి 80 శాతం మంది దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారని వారు చెబుతున్నారు. ఆ బాధలు పడలేక తిరిగొచ్చిన వాళ్లు కొందరైతే... ఉన్న ఊరుకొచ్చినా ఉపయోగం లేదనే భావనతో అక్కడే బతుకీడస్తున్న వారు మరికొందరున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీర్నపల్లి నుంచి వెళ్లిన 50 మంది యువకుల్లో ఏడాది తిరగకముందే అందులో 10 మంది తమవల్ల కాదు ఆ బతుకు అంటూ తిరిగొచ్చారు. ఉన్న ఊళ్లోనే శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తే భార్యాపిల్లలతో హాయిగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక్కడే బతుకుతామంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
 
 కోరుట్ల, జగిత్యాల, వేములవాడలోనూ ఇదే పరిస్థితి!
 కరువు దెబ్బకు జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ఊరు విడిచి దుబయ్ వలస వెళ్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సగటున ఊరికి పది మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన వారే. కొందరు యువకులు ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయి రాగా... మరికొందరు ఎంత కష్టమైనా, నష్టమైనా కూలీనాలీ చేసుకుంటూ విదేశాల్లోనే బతుకీడుస్తున్నారు. ఆయా యువకుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి శిక్షణ  ఇస్తే జిల్లాలోనే ఉపాధి పొందుతూ కుటుంబంతో హాయిగా ఉంటామని చెబుతున్నారు.
 
 నరకం చూసిన..
 సార్.. ఇంట్ల ఎల్లక 2 లక్షలు అప్పు చేసిన. దుబాయ్ పోతే అప్పు తీర్చి డబ్బులు సంపాదించుకోవచ్చని ఓ ఏజెంట్ చెబితే మరో లక్ష అప్పు చేసి గత జూన్‌లో దుబాయ్ పోయిన. అక్కడి కరెన్సీ ప్రకారం నెలకు రూ.1200 దిర్హమ్స్(రూ.21,600) జీతం ఇస్తామని ఆశపెడితే పోయిన. తీరా ఆడికిపోతే నెలకు 600 దిర్హమ్స్ ఇచ్చిండ్రు. 8 గంటలకు బదులు రోజు 12 గంటల పనిచేయించుకున్నరు. పని ఒత్తిడికి ఆరోగ్యం కరాాబైంది. వచ్చిన డబ్బులు తిండికి, నా మందులకే సరిపోయినయ్. ఆడ ఉన్నన్ని రోజులు నరకం చూసిన. ఎలాగోలా ఇక్కడికి వచ్చి ఉపాధి కూలీకి పోతున్న. అప్పులెట్లా తీర్చుడో అర్థమైతలేదు. మాలోంటోళ్లకు ప్రభుత్వం ఏదైనా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తే సర్కారు రుణం తీర్చుకుంటం.
 - నర్మెట శంకర్, వీర్నపల్లి
 
 మోసపోయిన..
 మా ఊరినుంచి దుబాయ్ పోయినోళ్లంతా నానా కష్టాలు పడుతుండ్రు. ఈడ ఏజెంట్లు చెప్పేదొకటి, ఆడ జరిగేదొకటి. ఫోర్‌మెన్ ఉద్యోముంది... నెలకు 2 వేల దిర్హమ్స్ జీతం (రూ.36 వేలు) ఇస్తారని ఏజెంట్లు ఆశపెడితే నిజమేనని నమ్మి లక్ష రూపాయలు అప్పు చేసి దుబాయ్ పోయిన తీరా ఆడికిపోతే లేబర్ కూలీకి పెట్టిండ్రు. అందులో సగం జీతం కూడా సరిగా ఇయ్యలేదు. ఆ జీతం అక్కడ తిండికి కూడా సరిపోలేదు. మోసపోయిన. ఇక లాభం లేదని ఇంటికి పోదామనుకుంటే నా పాస్‌పోర్టు తీసుకుని నన్ను జైల్లో పెట్టించిండ్రు. మూడు నెలలు జైల్లోనే ఉండి ఎట్లాగోలా మా ఊరికొచ్చిన. ఉప్పరి పనిజేసి బతుకీడుస్తున్న. మాలాంటోళ్లకు ఏదన్నా దారి చూపాలె.                
 - జి.రాములు, వీర్నపల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement