కోర్ ఏరియాకు అడ్డంకిగా రోడ్లు, గ్రామాలు
అందువల్లనే మనుషులపై పులుల దాడులు
కవ్వాల్ టైగర్ రిజర్వులో పెరిగిన పులుల సంచారం
భయాందోళనలో ప్రజలు..
పెద్దపులుల సంచారానికి ప్రతిబంధకాలు
సాక్షి, హైదరాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను పెద్దపులుల దాడులు వణికిస్తున్నాయి. శుక్రవారం కాగజ్‌నగర్ మండలం నజ్రుల్ నగర్ గ్రామం వద్ద మోర్లె లక్ష్మి అనే యువతిపై పెద్దపులి దాడిచేసి చంపేయటంతో జిల్లాలో ప్రజలకు మరోసారి పులి భయం పట్టుకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న పులులు.. రిజర్వు అడవుల్లోని కోర్ ఏరియాలకు వెళ్లే దారిలో రోడ్లు, గ్రామాలు అడ్డుగా ఉండటంతోనే అవి మనుషులపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. గత నాలుగేళ్లలో ఈ ప్రాంతంలో పులుల దాడిలో నలుగురు మరణించారు.
ఈ ప్రాంతం మహారాష్ట్ర– తెలంగాణ మధ్యలోని టైగర్ కారిడార్‌లో భాగంగా ఉన్నది. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్‌ల నుంచి ఆవాసం, తోడు వెతుక్కుంటూ పులులు వస్తున్నాయి. దీంతో మనుషులు–పులుల మధ్య ఘర్షణ ఏర్పడుతున్నది. నవంబర్–డిసెంబర్ నెలలు పులుల సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి. ఈ సమయంలో వాటికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే కోపంతో దాడులకు దిగే అవకాశాలున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.
పెరిగిన సంచారం
ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని టైగర్ కారిడార్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో నాలుగైదు పులులు సంచరిస్తున్నట్టు గుర్తించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బండికాన, ధాబా గ్రామాల శివార్లలో ఆదివారం పశువులపై ఒక పులి దాడి చేసింది. అది మంగళవారం కూడా అక్కడే సంచరించింది. ఆ తర్వాత ఎకో వంతెన సమీపంలోని ఖిండి దేవస్థానం మీదుగా వెళ్లినట్లు కొందరు గ్రామస్తులు తీసిన వీడియోల్లో వెల్లడైంది. ఈ నెల 21న ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఓ పెద్దపులి పశువులపై దాడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
ఈ నెల 17న నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి వచి్చన పెద్దపులి.. ఉట్నూరు మండలం చాండూరు గ్రామ శివారులో రాజుల్‌గూడ గ్రా మానికి చెందిన ఓ రైతు ఎద్దుపై దాడి చేసింది. గతంలో పెద్దపులుల సంచారం అంతగా లేని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి పరిధిలోనూ పులి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పులుల సంచారం పెరగడాన్ని పర్యావరణ ప్రేమికులు, అటవీ అధికారులు స్వాగతిస్తుండగా, ఆయా పరిసర గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి వలస
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లోని కోర్ ఏరియాలోకి పులులు వెళ్లలేకపోవడం సమస్యగా మారిందని అటవీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్‌తోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌లలో పులుల సంతతి బాగా పెరిగింది. దీంతో శాశ్వత ఆవాసానికి తగిన అటవీ ప్రాంతం, ఆహారం లభించక కొన్ని పులులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆడ పులుల తోడును వెతుక్కుంటూ మగ పులులు ఆదిలాబాద్ జిల్లాలోని పులుల కారిడార్‌లోకి, సమీప గ్రామాల్లోకి అడుగు పెడుతున్నాయి. దాదాపు నెలరోజుల వ్యవధిలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాలు.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి.. కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో నాలుగైదు పులులు కనిపించాయి.
కవ్వాల్ టైగర్ రిజర్వు అనుకూలమైనా..
కవ్వాల్ టైగర్ రిజర్వులోని కోర్ ఏరియాలో పులుల శాశ్వత ఆవాసాలకు అనుకూల పరిస్థితులున్నా.. మధ్యలో రోడ్లు, పోడు భూములు, గ్రామాలు ఉండడం వల్ల అవి అక్కడికి చేరుకోలేకపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. టైగర్ రిజర్వుల్లోని కోర్ ఏరియా, పులుల అవాస ప్రాంతాల నుంచి కొన్ని గ్రామాల తరలింపు జరగకపోవడం వల్లే ఈ సమస్య పెరిగిందనే అంటున్నారు. కవ్వాల్, అమ్రాబాద్ రిజర్వు ఫారెస్టులోని కోర్ ఏరియాలో ఉన్న పలు గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్¯ అథారిటీ నిర్ణయించింది.
ఇప్పటికే కవ్వాల్ టైగర్ రిజర్వులోని రెండు గ్రామాలను బయటకు తరలించగా, మరో రెండు గ్రామాల తరలింపునకు ప్రతిపాదించారు. కేటీఆర్‌లోని మూడు గ్రామాలను మొదటి దశలో, మరో పెద్ద గ్రామాన్ని రెండోదశలో బయటకు పంపించేందుకు ప్రతిపాదనలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ గ్రామాల తరలింపు పూర్తయితే పులుల స్థిర నివాసానికి మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అటవీశాఖ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment