kawal forest
-
‘కవ్వాల్’లో పెరిగిన జంతువైవిధ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) అటవీ ప్రాంతంలో వివిధ రకాల జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీని పరిధిలోని చిరుతలు, అడవి దున్నలు, అడవి కుక్కలు, నక్కలు, జింకలు, దుప్పులు తదితర రకాల వన్యప్రాణులు సందడి చేస్తూ కనువిందు చేస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో వీటి కదలికలు తాజాగా రికార్డ్ కావడం, వీటి సంఖ్య పెరిగిన ఆనవాళ్లు కనిపించడం పట్ల అటవీశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీవవైవిధ్యం, అన్నివిధాలా అనుకూల పరిస్థితులు, మెరుగైన సౌకర్యాలతో కవ్వాల్ వన్యప్రాణుల వైవిధ్య కేంద్రంగా నిలుస్తోంది. కవ్వాల్‌లో వివిధ జంతువులు సందడి చేస్తున్న దృశ్యాలను గురువారం తెలంగాణ అటవీ శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పులుల కోసం ఎదురుచూపులే... పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి పులుల సంచారం పెరిగినా, అనుకూల పరిస్థితులు ఉన్నా అవి ఇంకా కవ్వాల్‌లో స్థిరనివాసం ఏర్పరచుకోకపోవడం అటవీ శాఖకు, అధికారులకు సవాల్‌గా మారింది. అయినా ఇక్కడ పెద్దపులుల సంఖ్యే అధికం. ‘కోర్ టైగర్ ఏరియా’లోని 40 గ్రామాలను బయటి ప్రాంతాలకు తరలించకపోవడం కూడా పులులు స్థిరనివాసం ఏర్పరచుకోకపోవడానికి ఒక కారణమని అధికారులు అంటున్నారు. ఈ అడవి పరిధిలోని కొన్ని గ్రామాల ప్రజలు, వారి పెంపుడు జంతువుల కదలికలు ఉండటంతో పులులు ఇబ్బంది పడుతున్నాయని అంటున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) నిబంధనలు, నియమావళిని బట్టి పులుల అభయారణ్యం నుంచి మొత్తం గ్రామాలను బయటి ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర తడోబా నుంచి నేరుగా పులులు వచ్చేందుకు జాతీయ రహదారితోపాటు రైల్వే కారిడార్, ఇతర ఆక్రమణలతో కొంత అంతరాయం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అండర్‌పాస్‌ల నిర్మాణం చేపడుతున్నందున త్వరలోనే అనుకూల మార్పులు చోటుచేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితాలు ఇస్తున్న నియంత్రణ చర్యలు మూడేళ్లుగా చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. విరివిగా గడ్డిభూముల పెంపకం, మా డివిజన్లో 200కుపైగా పర్క్యులేషన్ ట్యాంక్‌ల ఏర్పాటు, వాటర్‌షెడ్ పద్ధతుల ప్రకారం శాశ్వత నీటివనరుల కల్పన వంటివి ఎంతో దోహదపడ్డాయి. బయటి నుంచి మనుషులు, పశువులు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టకుండా గట్టి నియంత్రణ చేపట్టాం. అడవిలో గందరగోళం, కలకలం వంటివి ఉంటే జంతువుల పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పశువులు తిరిగితే గడ్డి ఉండదు. సహజసిద్ధమైన పరిస్థితులకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. –మాధవరావు, ఎఫ్‌డీవో, జన్నారం -
పులి మనుగడ కోసం గ్రామాల తరలింపు
సాక్షి, కడెం(ఖానాపూర్): పులి మనుగడ కోసం కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కోర్ ఏరియాలోని పలు గ్రామాలను తరలించాలని అటవీశాఖ నిర్ణయించింది. మొదటి విడతలో నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని మైసంపేట్, రాంపూర్ గ్రామాలను పునరావాసం కింద తరలించనున్నారు. అటవీ సంరక్షణకు గ్రామస్తులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కాని సంబంధిత శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ పునరావాసం ఏర్పాటు పనులు పారంభించలేదు. ప్రస్తుతం ఉన్న చోట కనీస సౌకర్యాల్లేవని.. తమను పునరావాసానికి ఎప్పుడూ తరలిస్తారని రాంపూర్, మైసంపేట్ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభం కాని పనులు.. రాంపూర్, మైసంపేట్ గ్రామాల ప్రజలకు ఇదే మండలంలోని కొత్త మద్దిపడగ సమీపంలో విద్య, వైద్యం, విద్యుత్, తదితర సౌకర్యాలతో డబుల్బెడ్రూం ఇళ్లను కట్టించనున్నారు. మరోవైపు మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని పెత్తర్పు సమీపంలో లబ్ధిదారులకు వ్యవసాయ భూమిని కేటాయించనున్నారు. గతేడాది జులై 12న ఆయా శాఖల అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పునరావాసానికి అనువైనదిగా తేల్చారు. ఉన్నచోట మౌలిక సౌకర్యాల్లేవు.. పునరావాసం కోసం ఎదురు చూస్తున్నామని.. మరోవైపు ప్రస్తుతం ఉన్న చోట కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.రాంపూర్ గ్రామంలో సొలార్ సిస్టం పని చేయక గ్రామస్తులు అంధకారంలో ఉంటున్నారు. ప్రస్తుతం వీరు ఉంటున్న గ్రామాల్లో ఉపాధి అవకాశాల్లేవు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. మరికొందరు గ్రామంలోనే కుటుంబపోషణకు తడకలు అల్లుతారు. వ్యవసాయ భూములున్నా.. సాగునీటికి ఇబ్బందులు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేనందున ఏళ్లుగా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో పునరావాసం కింద వెళ్లేందుకు గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇబ్బంది పడుతున్నం మా గ్రామాలను పునరావాసం కింద మరోచోటకు తరలిస్తామని అధికారులు తెలిపారు. అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ వెళ్తున్నారు తప్ప పునరావాసం కల్పించడం లేదు. ప్రస్తుతం ఉన్న చోటును పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నం. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే మా ఇబ్బందులు తొలగిపోతాయి. – పెంద్రం లచ్చుపటేల్, మైసంపేట్ ఇంకెప్పుడు తరలిస్తారు? మా గ్రామాలను పునరావాసం కింద ఇంకెప్పుడు తరలిస్తారో అధికారులు స్పష్టతనివ్వాలి. జాప్యం చేస్తే అడవులను నరికి పొడు వ్యవసాయం చేసుకుంటాం. మా కష్టాలు ఎవరికి కనిపించడం లేదు. త్వరగా పనులు పూర్తి చేసి.. పునరావాసం కల్పించాలి. – దేవ్‌రావు, మైసంపేట్ రాష్ట్రం నుంచి నిధులు రాకనే.. టైగర్‌జోన్ పరిధిలోని రాంపూర్, మైసంపేట్ గ్రామాలను తరలించేందుకు గతంలోనే ప్రతిపాదనలు సిద్దం చేశాం. కేంద్రం నిధులు విడుదలైనా.. రాష్ట్రానికి సంబంధించిన నిధులు విడుదలలో జాప్యం నెలకొంది. పునరవాసానికి రాష్ట్రం నిధులు విడుదలవగానే పనులు ప్రారంభిస్తాం. – సుతన్, డీఎఫ్‌వో నిర్మల్ -
ఊరు వదిలేస్తం.. ఉపాధి ఇస్తరా
సాక్షి, హైదరాబాద్ : కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) నుంచి నిర్వాసితుల తరలింపు ముందుకు సాగడం లేదు. పులులు సంచరించే అభయారణ్యంలోని ప్రధాన అటవీ ప్రాంతం (కోర్ ఏరియా)లోని గ్రామాల నుంచి స్థానికులను కదిలించే ప్రక్రియ విఘ్నాలను ఎదుర్కొంటోంది. అక్కడినుంచి ఇరవై గ్రామాలను తరలించాలని తొలుత నిర్ణయించారు.దీనిపై మెజారిటీ గ్రామాల వారు వ్యతిరేకించారు. ఆ తర్వాత పూర్తిగా అడవిలోనే ఉన్న నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని మైసంపేట, రాంపూర్ గ్రామాలను తరలించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి, ఆ ప్రక్రియను ప్రారంభించారు. అటవీశాఖ అధికారుల కృషి ఫలితంగా రెండు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ఊళ్లు ఖాళీ చేయడానికి అనుకూలంగా తీర్మానాలు చేశారు. కేంద్రం నిధుల విడుదల... కేంద్ర ప్రభుత్వ ‘ప్రాజెక్టు టైగర్’ పథకంలో భాగంగా ‘కేటీఆర్’లోని పై రెండు గ్రామాల్లోని 142 కుటుంబాల తరలింపునకు మొత్తం రూ. 14.20 కోట్లు వ్యయం కానుంది.ఇందులో కేం ద్రం 60 శాతం, రాష్ట్రం 40శాతం భరిస్తుంది. ఈనేపథ్యంలో 2018 అక్టోబర్ 22న కేంద్ర అటవీశాఖ తన వంతుగా రూ.8.52 కోట్లు విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో అటవీశాఖ ఉన్నతాధికారులు నిరాసక్తతను ప్రదర్శించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునే విషయంలోనూ చొరవ చూపకపోవడంతో ఎలాంటి పురోగతి లేకుండా నిలిచిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరి 21న జరిగిన అటవీ శాఖ సమావేశంలోనే నిర్మల్ జిల్లాలోని మైసంపేట, రాంపూర్ గ్రామస్తులను తరలించేందుకు 112 హెక్టార్ల అటవీభూమిని డీనోటిఫై చేసే ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపారు. అది పురోగతి లేకపోవడంతో మళ్లీ తాజాగా ఈనెల ఒకటిన జరిగిన రాష్ట్ర వన్యప్రాణిబోర్డు సమావేశంలోనూ డీనోటిఫై ప్రతిపాదనపై మరోసారి ఆమోదముద్ర వేయాల్సిన స్థితి ఏర్పడింది. పునరావాసం కల్పిస్తే వెళ్లిపోయేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినా తమను తరలించడం లేదని ఆ గ్రామాల్లోని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అదీగాకుండా ఇటీవల నిర్మ ల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఈనెల 3న కొత్త కలెక్టర్‌గా ముషారఫ్ అలీ ఫారూఖి వచ్చారు. జిల్లా అధికార యంత్రాంగంలో వచ్చిన మార్పు కూడా తరలింపుపై ప్రభావం పడనుంది. పునరావాసానికి రెండు ఆప్షన్లు ఈ గ్రామాల పునరావాసం కోసం...అధికారులు రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల వంతున ఒకేసారి నగదు అందజేయడం మొదటిదికాగా, విడిగా పునరావాస గ్రామాన్ని ఏర్పాటు చేసి, ఇళ్లు, భూములు ఇచ్చి, ఇతర సౌకర్యాలను కల్పించి ఇవ్వాలనేది రెండో ప్రతిపాదన, వీటిలో 48కుటుంబాలు మొదటి ఆప్షన్‌ను, 94కుటుంబాలు రెండో ఆప్షన్‌ను ఎంపికచేసుకున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండడంతో ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోగా, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పలువురు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. స్థానికంగా ఉండేవారు వెదురు తడకల అల్లికతో జీవనోపాధిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ భూములున్నా సాగునీటికి ఇబ్బందిగానే ఉంది. ఈ కారణాలతో వారు మైదాన ప్రాంతానికి వెళ్లేందుకు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చారు. ఊరును, ఇళ్లను ఇడిసిపెడతం.. మా మైసంపేట ఊరు మొత్తం అడివిలనే ఉంటది. సుట్టూ జంగలే. సాగు చేసుకుందమన్నా ఇబ్బందే. అధికారుల సూచన మేరకు మా గ్రామస్తులం పులుల కోసం ఊరిని, ఇళ్లను ఇడిసిపెట్టేందుకు సిద్ధమై నం. ఊరిని, ఇళ్లను ఇడిసిపెట్టి వస్తున్న మాకు మంచి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నం. – పెంద్రం లచ్చు, గ్రామపటేల్, మైసంపేట్ అందరం ఒప్పుకున్నం.. అటవీ అధికారులు చెప్పిన తర్వాత ఊళ్లే అందరం ఇక్కడి నుంచే పోతందుకు ఒప్పుకున్నం. సార్లు చెప్పినట్లు మేం ఉన్న ఊరిని ఇడిసిపెట్టేందుకు సిద్ధమై నం. మాకు మంచి సౌకర్యాలు కల్పించాలి. సా గు కోసం ఇబ్బంది లేకుండా చూడాలి. ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరుతున్నం. – అమృత్‌రావు, గ్రామస్తుడు, మైసంపేట్ తరలింపు కోసం ఏర్పాట్లు.. నిర్మల్‌జిల్లాలో గల కవ్వాల్ పులుల అభయారణ్యంలో నుంచి రెండు గ్రామాలను ప్రయోగాత్మకంగా తరలించి, పునరావాసం కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారు గ్రామసభ తీర్మానం ద్వారా పునరావాసానికి ఒప్పుకున్నారు. అదే మండలంలోని కొత్తమద్దిపడగ, నచ్చన్ ఎల్లాపూర్ గ్రామాల మధ్య గల అటవీశాఖకు చెందిన ప్రాంతానికి తరలించనున్నాం. పునరావాసానికి 112హెక్టార్ల భూమిని కేటాయించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్, అధికారులతో డీఎల్సీ(డిస్ట్రిక్ట్ లెవల్ కో–ఆర్డినేషన్) మీటింగ్ నిర్వహించి, తదుపరి ప్రక్రియ చేపడతాం. – ఎస్పీ.సుధన్, డీఎఫ్ఓ, నిర్మల్ -
పునరావాసం.. ప్రజల సమ్మతం
సాక్షి, నిర్మల్: కవ్వాల్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు గ్రామాలను మరోచోటుకు తరలించడానికిగాను జిల్లా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ గ్రామా లను అదే మండలంలోని ధర్మాజిపేట్ గ్రామ సమీపంలో గుర్తించిన అటవీ భూమిలో ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించడానికిగాను చర్యలను వేగవంతం చేశారు. ఈ మేరకు ఆ రెండు గ్రామాలను మరోచోటకు తరలించడానికి ఇప్పటికే గ్రామస్తులు సమ్మతించడంతో ధర్మాజిపేట్ సమీపంలో ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ గ్రామ ప్రాంతంలో వివిధ శాఖల అధికారులు శుక్రవారం ప్రత్యామ్నాయ గ్రామ పున:స్థాపన చేసే ప్రాంతంలో పర్యటించనున్నారు. గ్రామం ఏర్పాటుకు ప్రణాళికలు ప్రస్తుతం ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న రాంపూర్, మైసంపేట్ గ్రామాలను ధర్మాజిపేట్ గ్రామ శివారు ప్రాంతంలోని 112 హెక్టార్ల అటవీ ప్రాంతంలో పున:స్థాపన చేయనున్నారు. ఈ మేర కు గ్రామం ఏర్పాటుకు కావాల్సిన పూర్తిస్థాయి సౌకర్యాలను కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఇళ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌక ర్యం సామాజిక భవనాలు, పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రా ర్థన మందిరాలు, సీసీ రోడ్ల ఏర్పాటు, డ్రెయినేజీ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికిగాను ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించి ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. 142 కుటుంబాల తరలింపు రెండు గ్రామాల నుంచి మొత్తం 142 కుటుంబాలను ధర్మాజిపేట్ సమీపంలో ఏర్పాటు చేయను న్న పునరావాస గ్రామానికి తరలించనున్నారు. అయితే ఈ గ్రామంలో పూర్తిగా నివాసం, వ్యవసాయ భూమి, మౌలిక వసతుల కల్పన కోరుతూ 94 కుటుంబాలు అంగీకరించాయి. మరో 48 కుటుంబాలు మాత్రం తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరాయి. ఇందుకుగాను నష్ట పరిహారం కోరిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు. 94 కుటుంబాలకు మాత్రం 250 చదరపు గజాల డబుల్ బెడ్ రూం, వ్యవసాయ భూమితో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ అంగీకరించారు. వీరికి కడెం మండలంలోని ధర్మాజిపేట్ గ్రామ సమీపంలో 112 హెక్టార్ల భూమిని గుర్తించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ. 8 కోట్ల 52 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 5కోట్ల 64 లక్షలు మంజూరయ్యాయి. అధికారులు ప్రణాళికలు రూపొందించి పునరావాస గ్రామం ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. పునరావాస గ్రామ ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా చేయాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు అవసమైన చర్యలను తీసుకోనున్నారు. -
కవ్వాల్ పులుల సంరక్షణ చర్యలేంటి?
సాక్షి, హైదరాబాద్: కవ్వాల్ పులులతో పాటు ఇతర జంతువుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాలని అటవీ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అనుభవమున్న అధికారులు స్వయంగా కోర్టుకు వచ్చి వివరించాలంటూ విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో పులుల సంరక్షణ పథకాన్ని అమలు చేసేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన జాగిర్ దియా సూర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కవ్వాల్ అటవీ ప్రాంతంలో ఇటీవల పులుల మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. అటవీ ప్రాంతంలో నివసించే వారు తమ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ఫెన్సింగ్ వల్ల చనిపోయాయా? లేక మరో కారణం వల్ల చనిపోయాయా? అన్నది అంశం తేలాల్సి ఉందంది. అటవీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఎలా జరుగుతోందని హైకోర్టు ఆరా తీసింది. ఈ వ్యాజ్యంలో విద్యుత్ శాఖ అధికారులను కూడా ప్రతివాదులుగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ విషయంలో అటవీ ప్రాంతాల సంరక్షణ కమిటీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. సమన్వయంతో పనిచేయకుంటే ఇటువంటి పరిస్థితులే వస్తాయంటూ కోర్టు విచారణ వాయిదావేసింది. -
ఛీతా.. ఇట్టే పసిగట్టేస్తోంది
సాక్షి, మంచిర్యాలఅర్బన్: వేటగాళ్లు, కలప స్మగర్లపై అటవీశాఖ నిఘా పెంచింది. అక్రమార్కుల ఆగడాలు అరికట్టేందుకు అధికారులు ఇటీవల డాగ్స్క్వాడ్పై ప్రత్యేక దృష్టి సారించారు. పక్షం వ్యవధిలో రెండు చిరుత పులులను చంపిన నిందితులతో పాటు వన్యప్రాణి మాంసం, కలప స్మగర్లును పట్టుకోవడంలో ఈ డాగ్‌స్క్వాడ్ కీలకంగా వ్యవహరించిది. ఛీతా (జాగిలం) వచ్చిన కొద్ది రోజుల్లోనే పలు కీలక కేసుల్లో నిందితులను పక్కాగా పసిగట్టి చేధిస్తుండటంతో డాగ్స్క్వాడ్పైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కవ్వాల్ టైగర్‌జోన్‌లో తొలిప్రయత్నంలో భాగంగా ఇద్దరు బీట్ అధికారులతో డాగ్స్వాడ్ ఏర్పాటు చేశారు. కలపస్మగ్లింగ్, వ్యన్యప్రాణుల వేట అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌లో ఇచ్చిన శిక్షణకు జన్నారంనకు చెందిన అటవీ బీట్ అధికారులు సత్యనారాయణ, శ్రీనివాస్ వెళ్లివచ్చారు. గ్వాలియర్‌లోని బీఎస్ఎఫ్ కేంద్రంలో ఛీతాకు (జర్మన్ షెపర్డ్ శునకం)ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలోని డాగ్‌స్క్వాడ్ బృందం అడవికి కాపలా కాయడంతో పాటు నేరస్తుల అటకట్టించడంలో ముందు వరుసలో నిలుస్తోంది. ఈనెల 4న జన్నారం అటవీ డివిజన్లో చింతగూడ బీట్ కంపార్ట్మెంట్ నంబర్ 360లో వన్యప్రాణిని హతమార్చిన కేసులో మొదట డాగ్‌స్క్వాడ్ బృందం నిందితులను పట్టుకున్నారు. చింతగూడ బీట్‌లో వన్యప్రాణిని హతమార్చిన అనవాలు లభించడంతో డాగ్‌స్క్వాడ్ వాసన చూసి బొమ్మన గ్రామానికి చెందిన మల్లయ్య కొట్టంలోని పొయ్యి వద్దకు వెళ్లడం.. తర్వాత వండిన మాంసం స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. అలాగే చింతగూడ పొలాల్లో దాచిన దుంగలను పట్టించింది ఈ డాగ్‌స్క్వాడ్ కావడం విశేషం. బొమ్మన గ్రామంలో రెండు టెకు దుంగలను స్వాధీనం పర్చుకున్నారు. ఈనెల 9న జన్నారం అటవీ రెంజ్ పరిధిలో డాగ్‌స్క్వాడ్‌తో కలిసి దాడి నిర్వహిæంచగా 0.328 సీఎంటీ విలువ గల కలప గుర్తించారు. ఈనెల 14న నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి అనుమానాస్పద మృతి చెందిన కేసులో డాగ్‌స్క్వాడ్ ఎంతో కీలకంగా మారింది. పులి మృతి చెందిన స్థలం సమీపంలో ఉన్న బీడీల కట్ట, అంబర్ ప్యాకెట్ ఆధారంగా వాసనతో పసిగట్టి అనుమానితులను గుర్తించారు. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రంగపేట్ అటవీ ప్రాంతంలో క్లచ్‌వైర్‌తో అమర్చిన ఉచ్చులో పడి పులి మృతి చెందిన విషయం తెలిసిందే. చెప్పుల ఆధారంగా పసిగట్టి వేటగాళ్లకు ఉచ్చు బిగిసేలా చేయటం వెనక ఈ డాగ్‌స్క్వాడ్ కీలకం కావడం గమన్హారం. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు మంచిర్యాలఅర్బన్: లక్సెట్టిపేట్ అటవీ రెంజ్ పరిధిలోని ముల్కల్ల, వెంపల్లి, రంగంపేట్ నీటి పరివాహక ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు చేపట్టారు. ఫీల్డ్ డైరెక్టర్ కవ్వాల్ టైగర్ ప్రాజెక్టు, నిర్మల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్, ఎఫ్‌డీవో వెంకటేశ్వర్రావు నేతృత్వంలో నిర్వహించిన తనిఖీల్లో కలప స్మగ్లింగ్‌తో పాటు వన్యప్రాణులకు హాని తలపెట్టే ఉచ్చులు ఏమైనా ఉన్నాయనే దానిపై డాగ్‌స్క్వాడ్‌తో నాలుగు గంటలపాటు క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే విద్యుత్ లైన్ వెంట కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేసే అవకాశాలపై పరిశీలన జరిపారు. ఈ నెల 14న రంగంపేట్ అటవీ ప్రాంతంలో ఉచ్చుకు చిరుతపులి హతమైన విషయం విదితమే. ఈ మేరకు ఎఫ్‌డీవో వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ రోజువారీ కార్యక్రమంలో భాగంగానే తనిఖీలు చేపట్టామని, శుక్రవారం కూడా డాగ్‌స్క్వాడ్‌తో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతామన్నారు. కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేట చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. తనిఖీల్లో డాగ్‌స్క్వాడ్ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్, లక్సెట్టిపేట్, దేవాపూర్ అటవీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పెద్దపులి కనిపించిందోచ్!
సాక్షి, నిర్మల్: రాష్ట్రంలో ప్రముఖ టైగర్ కన్జర్వేషన్ జోన్ కవ్వాల్ అభయారణ్యంలో తాజాగా పెద్దపులి కనిపించింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ రేంజ్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు పెద్దపులి సంచారాన్ని దాదాపు ఏడాది తర్వాత గుర్తించారు. పెద్దపులి కదలికలు కెమెరా కంటికి చిక్కాయి. కవ్వాల్ అటవీ ప్రాంతంలో మనుషులు, పశువుల సంచారం నియంత్రించడం.. గడ్డిక్షేత్రాలు భారీగా పెంచడంతో సత్ఫలితాలు ఇచ్చిందని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
వన్యప్రాణుల గణన పూర్తి
జన్నారం(ఖానాపూర్) : మంచిర్యాల జిల్లాలో జనవరి 22 నుంచి ప్రారంభంనుంచి ప్రారంభమైన వన్యప్రాణుల గణన పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే గణనలో శాఖహార, మాంసహార జంతువులను లెక్కిస్తారు. రెండు విడుతల్లో జిల్లా వ్యాప్తంగా 1లక్ష76 వేల 100 చదరపు కిలోమీటర్లతో పాటు కవ్వాల్ టైగర్‌జోన్‌లోని 892.23 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1123.12 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాలోని అటవీ ప్రాం తంలో వన్యప్రాణుల గణన జరిగింది. మంచి ర్యాల జిల్లాలోని జన్నారం, మంచిర్యాల, చె న్నూరు, బెల్లంపల్లి అటవీడివిజన్‌లలో 195 బీట్లలో 400 మంది అటవిశాఖ సిబ్బందితో పాటు వందమంది వరకు కళాశాల విద్యార్థులు, హైదరాబాద్‌లోని ఫారెస్ట్ కళాశాల సిబ్బంది పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు విడుతలుగా గణన జనవరి 22 నుంచి 24 వరకు మాంసహార జం తువులను 27 నుంచి 29 వరకు శాఖహార జం తువులను లెక్కించారు. ఒక్కో బీట్‌కు ఒక బృం దం చొప్పున నియమించారు.బీట్ పరిధిలో బీట్ అధికారితో పాటు బేస్‌క్యాంపు సిబ్బంది, స్టూడెంట్ను అధికారులకు జత పరిచారు. ఎలా లెక్కించారంటే... జిల్లాలో ఎకలాజికల్ యాప్ ద్వారా వన్యప్రాణుల వివరాలను సేకరించి, క్షేత్రస్థాయి నుంచి ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రతిరోజు ఉద యం అడవిలో తిరుగుతూ అడుగుల ద్వారా, అ ధికారులు ఏర్పాటు చేసుకున్న 2 కి.మీ ట్రాన్సెక్ట్ పాయింట్ ద్వారా వన్యప్రాణుల గణన చేపట్టారు. ఈ పాయింట్ పరిధిలో సంచరించే జం తువుల వివరాలను సేకరించి యాప్‌లో అడిగిన విధంగా ఆన్లైన్లో నమోదు చేశారు. వన్యప్రాణుల మల విసర్జన, వెంట్రుకలు, అరుపులు, కాలిముద్రల ఆధారంగా జంతువుల గణన ని ర్వహించారు. నీటిగుంతల వద్ద కాలిముద్రలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో అచ్చులను సేకరించి ఆరబెట్టిన అనంతరం వాటి జాతి ఆడ, మగ, వాటి ఎత్తు, బరువు, వయస్సు నిర్దారిస్తారు. జిల్లాలో రెండు చోట్ల పులి అడుగులు జిల్లాలో గణన సందర్భంగా రెండు చోట్ల పులి అడుగులను, ఆనవాళ్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధి లోని ఖానాపూర్ డివిజన్లోని కోర్ ఏరియా ప్రాంతంలో ఒకచోట పులి అడుగు కనిపించినట్లు, చెన్నూరు డివిజన్ నీల్వాయి ప్రాంతంలో మరో పులి అడుగుతో పాటు అరుపులు కూడ వినిపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆసిఫాబాద్ డివిజన్లో రెండు పులులున్నట్లు అధికారులు అడుగుల ద్వారా గుర్తించారు. జిల్లాలో సుమారుగా 20 వరకు చిరుతలున్నట్లు గుర్తించినట్లు అధికారుల ద్వారా తెలిసింది. జన్నారం డివిజన్లో కానరాని పులి అడుగులు ఇందన్పల్లి, తాళ్లపేట్ రేంజ్, జన్నారం అటవీరేంజ్‌లలో ఆరుచోట్ల చిరుతపులి అడుగులు, ఆనవాలు కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎలుగుబంట్లు, రేసుకుక్కలు, తోడేళ్ల స ంఖ్య పెరిగినట్లు చెబుతున్నారు. శాఖహార జం తువులు అడవి దున్నలు, నీలుగాయి, చుక్కల దుప్పులు, సాంబర్, మెకాలు, గడ్డి జింకలు, కొండగొర్రెలు, అడవి పిల్లులు, కుందేళ్లు తదితర వాటిని అధిక సంఖ్యలో చూసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే జంతువుల సంఖ్య మాత్రం చెప్పలేకపోతున్నారు. లెక్క ఎప్పుడు తేలుతుంది? అధికారులు చేసిన గణనలో లెక్క ఎప్పుడు తే లుతుందనేది స్పష్టంగా చెప్పడం లేదు. యాప్‌ద్వారా ఆన్లైన్లో నమోదైన వన్యప్రాణుల వివరాలు డివిజన్ వారిగా డెహ్రడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపుతారు. ప్రస్తుతం డివిజన్లోని వివిధ బీట్ల వారిగా వివరాలను సేకరిస్తున్నారు. ఫిబ్రవరి రెండోవారంలో ఇన్స్టిట్యూట్కు పంపిస్తే అక్కడ ఏప్రాంతంలో ఏ జం తువులు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గుర్తిస్తారు. పూర్తి వివరాలు మార్చి చివరివారం లేదా ఏప్రిల్‌లో వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. వణ్యప్రాణుల గణన విజయవంతంగా పూర్తి చేశాం. అటవీ అధికారులతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు పాల్గొన్నారు. ప్రత్యేక మోబైల్‌యాప్ లో నమోదు చేయడం వల్ల ఇప్పుడు పూర్తి సంఖ్య చెప్పలేకపోతున్నాం. ప్రస్తుతం డివిజన్ల వారిగా వివరాలను సేకరించి డెహ్రడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపిస్తాం. – రామలింగం, జిల్లా అటవీసంరక్షణ అధికారి -
పులులొస్తున్నాయ్..
జన్నారం: ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అడవుల్లో పులుల జాడలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ అడవిని టైగర్ జోన్‌గా గుర్తించగా, తాజాగా మరోసారి పులుల రాకపోకలను కెమెరాలో బంధించారు. మహారాష్ట్రలోని పులుల టైగర్ జోన్ అయిన తాడోబ నుంచి ఇక్కడికి పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో టైగర్ జోన్ బఫర్ ఏరియాలో పులులు తిరుగుతున్నట్లు కెమెరాలకు చిక్కిన ఫొటోలను బట్టి అంచనా వేస్తున్నారు. కాగజ్‌నగర్ అటవీ డివిజన్ కడంబా ప్రాంతంలో ఇటీవల నాలుగు పులులు కెమెరాలకు చిక్కినట్లు పేర్కొన్నారు. దీన్ని బట్టి టైగర్‌జోన్‌లోకి ఆరు పులుల వరకు వచ్చినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యుడు ఇమ్రాన్ సిద్దికీ పులుల రాకపోకలపై నిఘాపెట్టినట్లు తెలిసింది. డివిజన్లో మూడు పెద్ద పులులు, నాలుగు పులి పిల్లలు ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.