పులులొస్తున్నాయ్..
జన్నారం: ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అడవుల్లో పులుల జాడలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ అడవిని టైగర్ జోన్‌గా గుర్తించగా, తాజాగా మరోసారి పులుల రాకపోకలను కెమెరాలో బంధించారు. మహారాష్ట్రలోని పులుల టైగర్ జోన్ అయిన తాడోబ నుంచి ఇక్కడికి పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో టైగర్ జోన్ బఫర్ ఏరియాలో పులులు తిరుగుతున్నట్లు కెమెరాలకు చిక్కిన ఫొటోలను బట్టి అంచనా వేస్తున్నారు.
కాగజ్‌నగర్ అటవీ డివిజన్ కడంబా ప్రాంతంలో ఇటీవల నాలుగు పులులు కెమెరాలకు చిక్కినట్లు పేర్కొన్నారు. దీన్ని బట్టి టైగర్‌జోన్‌లోకి ఆరు పులుల వరకు వచ్చినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యుడు ఇమ్రాన్ సిద్దికీ పులుల రాకపోకలపై నిఘాపెట్టినట్లు తెలిసింది. డివిజన్‌లో మూడు పెద్ద పులులు, నాలుగు పులి పిల్లలు ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.