రాంపూర్‌లో ఆవుపై దాడి
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో గత నాలుగు రోజులుగా పెద్దపులి హల్‌చల్ చేస్తోంది. గత రెండ్రోజులుగా నార్నూర్ మండలం చోర్గావ్ గ్రామంలో తిష్టవేసి ఆవును తింటున్న దృశ్యం అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కింది. దీంతో చోర్గావ్, సుంగాపూర్, బాబేఝరి, మంజ్రి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
గురువారం గాదిగూడ మండలం ఖడ్కి గ్రామం మీదుగా బుడుకుంగూడ, సావురి గ్రామం మీదుగా రాంపూర్ చేరుకుంది. వేకువజామున గిరిజన రైతు ప్రకాశ్‌కు చెందిన ఆవుపై దాడి చేసింది. కుటుంబ సభ్యులు అప్రమత్తమై చప్పుడు చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదేరోజు మధ్యాహ్నం నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామ శివారులో పత్తి ఏరుతున్న మహిళలకు పులి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు.
అక్కడి నుంచి గంగాపూర్, మాన్కాపూర్ వైపు పులి వెళ్లిందని ప్రచారం జరగడంతో మాన్కాపూర్, రాజులగూడ, నార్నూర్, మహగావ్, నాగల్‌కొండ, భీంపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. వ్యవసాయ పనులకు వెళ్లిన వారంతా మధ్యాహ్నం ఇంటిబాట పట్టారు. ఎఫ్‌ఎస్‌వో సుదర్శన్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు బృందాలుగా విడిపోయి పులి జాడకోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment