సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) అటవీ ప్రాంతంలో వివిధ రకాల జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీని పరిధిలోని చిరుతలు, అడవి దున్నలు, అడవి కుక్కలు, నక్కలు, జింకలు, దుప్పులు తదితర రకాల వన్యప్రాణులు సందడి చేస్తూ కనువిందు చేస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో వీటి కదలికలు తాజాగా రికార్డ్ కావడం, వీటి సంఖ్య పెరిగిన ఆనవాళ్లు కనిపించడం పట్ల అటవీశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జీవవైవిధ్యం, అన్నివిధాలా అనుకూల పరిస్థితులు, మెరుగైన సౌకర్యాలతో కవ్వాల్ వన్యప్రాణుల వైవిధ్య కేంద్రంగా నిలుస్తోంది. కవ్వాల్‌లో వివిధ జంతువులు సందడి చేస్తున్న దృశ్యాలను గురువారం తెలంగాణ అటవీ శాఖ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
పులుల కోసం ఎదురుచూపులే...
పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి పులుల సంచారం పెరిగినా, అనుకూల పరిస్థితులు ఉన్నా అవి ఇంకా కవ్వాల్‌లో స్థిరనివాసం ఏర్పరచుకోకపోవడం అటవీ శాఖకు, అధికారులకు సవాల్‌గా మారింది. అయినా ఇక్కడ పెద్దపులుల సంఖ్యే అధికం. ‘కోర్ టైగర్ ఏరియా’లోని 40 గ్రామాలను బయటి ప్రాంతాలకు తరలించకపోవడం కూడా పులులు స్థిరనివాసం ఏర్పరచుకోకపోవడానికి ఒక కారణమని అధికారులు అంటున్నారు.
ఈ అడవి పరిధిలోని కొన్ని గ్రామాల ప్రజలు, వారి పెంపుడు జంతువుల కదలికలు ఉండటంతో పులులు ఇబ్బంది పడుతున్నాయని అంటున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్‌టీసీఏ) నిబంధనలు, నియమావళిని బట్టి పులుల అభయారణ్యం నుంచి మొత్తం గ్రామాలను బయటి ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర తడోబా నుంచి నేరుగా పులులు వచ్చేందుకు జాతీయ రహదారితోపాటు రైల్వే కారిడార్, ఇతర ఆక్రమణలతో కొంత అంతరాయం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అండర్‌పాస్‌ల నిర్మాణం చేపడుతున్నందున త్వరలోనే అనుకూల మార్పులు చోటుచేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఫలితాలు ఇస్తున్న నియంత్రణ చర్యలు
మూడేళ్లుగా చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. విరివిగా గడ్డిభూముల పెంపకం, మా డివిజన్‌లో 200కుపైగా పర్‌క్యులేషన్ ట్యాంక్‌ల ఏర్పాటు, వాటర్‌షెడ్ పద్ధతుల ప్రకారం శాశ్వత నీటివనరుల కల్పన వంటివి ఎంతో దోహదపడ్డాయి. బయటి నుంచి మనుషులు, పశువులు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టకుండా గట్టి నియంత్రణ చేపట్టాం.
అడవిలో గందరగోళం, కలకలం వంటివి ఉంటే జంతువుల పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పశువులు తిరిగితే గడ్డి ఉండదు. సహజసిద్ధమైన పరిస్థితులకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
–మాధవరావు, ఎఫ్‌డీవో, జన్నారం
Comments
Please login to add a commentAdd a comment