మోర్తాడ్ (బాల్కొండ): రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా గల్ఫ్ వలస కార్మిక సంఘాలు అడుగులు వేస్తున్నాయి. తమ డిమాండ్లు సాధించుకోవాలంటే తమకంటూ ప్రత్యేకంగా ఒక పార్టీ అవసరమని ఆయా సంఘాలు అంటున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నవారు సుమారు 15 లక్షల మంది ఉంటారు. వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్యతో పాటు, గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చి స్థానికంగానే ఉంటున్నవారిని పరిగణనలోకి తీసుకుంటే గల్ఫ్‌తో ముడిపడి ఉన్నవారి సంఖ్య కోటి ఉంటుందని అంచనా.
వీరు రాష్ట్రంలోని 30 శాసనసభ నియోజకవర్గాలు, నాలుగు పార్లమెంట్ స్థానాల పరిధిలో అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వీరిలో ఎక్కువమంది సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారే. ప్రతి ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం వారి సమస్యల పరిష్కారానికి హామీలు గుప్పిస్తున్న రాజకీయ పార్టీలు.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
వీరి సమస్యలేమిటి?
ఎన్నో ఏళ్లుగా లక్షలాది మంది కార్మికులు రాష్ట్రం నుంచి వలస వెళ్లి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నా.. వారి సంక్షేమాన్ని పట్టించుకునే ఓ ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. ఉపాధిపై ఆశతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలకు వెళుతున్నవారు పలు సందర్భాల్లో వీసా మోసాలకు గురవుతుండటంతో పాటు, అక్కడ ఆశించిన విధంగా లేక అనేక కష్టాలు పడుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వాల తరఫున ఎలాంటి సాయం అందడం లేదు.
కార్మికులు చనిపోతే ప్రభుత్వాలు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం లేదు. మృతదేహాలు స్వదేశం చేరుకోవడం కష్టమవుతోంది. కొన్నిసార్లు అక్కడే అంత్యక్రియలు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ కార్మికుల సంక్షేమ కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని, ఎన్‌ఆర్‌ఐ పాలసీ లేదా గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతో కాలం నుంచి వినిపిస్తోంది.
భారీగా విదేశీ మారకద్రవ్యం వస్తున్నా..
విదేశాలకు వలస వెళ్లిన వారి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ మొత్తంలో ఆదాయం లభిస్తోంది. కేవలం గల్ఫ్ వలస కార్మికుల ద్వారానే ఏడాదికి రూ.2.50 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం మన దేశానికి చేరుతోంది. అందువల్ల గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత నిధులను కేటాయించాలనే డిమాండ్ ఉంది. అయితే ఏ బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించిన సందర్భాలు లేవు.
దీంతో ఎన్నో ఏళ్లుగా విసిగి వేసారిపోయిన గల్ఫ్ వలస కార్మికులందరినీ ఒక్క తాటిపై తీసుకురావడానికి కార్మిక సంఘాలు రాజకీయాల బాట పడుతున్నాయి. తమ లక్ష్యాలను చేరుకోవాలంటే తాము సభ్యులుగా ఉన్న ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం తప్పనిసరి అని ముక్త కంఠంతో చెబుతున్నాయి.
హుజూరాబాద్‌తో షురూ
హుజూరాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ సత్తా చాటడానికి గల్ఫ్ వలస కార్మికుల సంఘాలు సిద్ధమవుతున్నాయి. ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోషియేషన్‌ల అధ్యక్షులు స్వదేశ్ పరికి పండ్ల, నంగి దేవేందర్‌రెడ్డిల నాయకత్వంలో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
కార్మికులను ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో ఆత్మీయ సమ్మేళనాల పేరిట సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మొదటగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. దశల వారీగా గల్ఫ్ వలస కార్మికులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో దళిత బంధు మాదిరిగానే గల్ఫ్ బంధు ను అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ముందుకు సాగుతున్నాయి.
అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు
గల్ఫ్ వలస కార్మికుల కోసం రాజకీయ పార్టీని స్థాపించడం వల్ల మంచే జరుగుతుంది. ప్రతి ఎన్నికల్లో ఓట్ల కోసం గల్ఫ్ కార్మికులకు హామీల ఎర వేస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయడం లేదు.
– స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు
రాజకీయ పార్టీ ద్వారానే గుర్తింపు
గల్ఫ్ కార్మికులు ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురవుతున్నా రు. ఇప్పుడు వారి సమస్యలే ఎజెండాగా రాజకీయ పార్టీ స్థాపించడమనే ఆలోచన ఆహ్వానించదగ్గ పరిణామం. గల్ఫ్ కార్మికులకు గుర్తింపు లభించాలంటే రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది.
– నంగి దేవేందర్‌రెడ్డి, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
మా సత్తా ఏమిటో చూపిస్తాం
గల్ఫ్ కార్మికుల సత్తా ఏమిటో ప్రభుత్వాలకు తెలియజేయడానికే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాం. కార్మికుల కుటుంబాలను ఏకం చేసి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాం. మా సత్తాను చాటి చెబుతాం.
– గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్ జేఏసీ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment