
భారత్ రెమిటెన్సుల్లో యూఎస్, యూకే టాప్
ముంబై: అభివృద్ధి చెందిన దేశాల నుంచి ప్రవాస భారతీయులు మాతృదేశానికి పంపిస్తున్న రెమిటెన్స్‌లు (నిధుల బదిలీ) గణనీయంగా పెరుగుతున్నాయి. 2023–24లో 118.7 బిలియన్ డాలర్లను (రూ.10.32 లక్షల కోట్లు) ప్రవాసులు భారత్‌కు పంపించారు. 2010–11లో 55.6 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లతో పోల్చి చూస్తే రెట్టింపయ్యాయి. యూఎస్, యూకే తదితర దేశాల్లో స్థిరపడిన భారతీయులు 2023–24లో భారత్‌కు పంపించిన రెమిటెన్స్‌లు గల్ఫ్ దేశాలను మించిపోయినట్టు మార్చి నెలకు సంబంధించి విడుదలైన ఆర్‌బీఐ బులెటిన్ వెల్లడించింది.
భారతీయ నిపుణుల వలసల్లో మార్పులను ఇది ప్రతిఫలిస్తున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్ విభాగం ఈ నివేదికను రూపొందించింది. అయితే ఇందులోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, ఆర్‌బీఐ అభిప్రాయాలను ప్రతిఫలించవని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.
నివేదికలోని అంశాలు..
అంతర్జాతీయ వలసదారుల్లో భారత్‌కు చెందిన వారు 1990లో 66 లక్షలుగా ఉంటే, 2024 నాటికి 1.85 కోట్లకు పెరిగారు. అంతర్జాతీయ వలసదారుల్లో భారత్ వాటా 4.3 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయుల్లో సగం మందికి గల్ఫ్ సహకార సమాఖ్య (జీసీసీ) కేంద్రంగా ఉంది.
ఇంత కాలం భారత్‌కు రెమిటెన్స్‌ల్లో జీసీసీ దేశాల ఆధిపత్యం కొనసాగగా, క్రమంగా ఇది అభివృద్ధి చెందిన దేశాలైన యూఎస్, యూకే, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు మొగ్గుతోంది. 2023–24లో భారత్‌కు వచ్చిన మొత్తం రెమిటెన్స్‌ల్లో సగంపైన ఈ దేశాల నుంచే ఉంది.
పనిచేసే వయసులోని అధిక జనాభాతో 2048 నాటికి భారత్ మానవ వనరులను సరఫరా చేసే కీలక దేశం కానుంది.
8.1 శాతం తెలంగాణకు..
2023–24లో మొత్తం రెమిటెన్స్‌ల్లో 8.1 శాతం తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది.
అత్యధికంగా 20.5 శాతం మహారాష్ట్రకు వెళ్లింది. 2020–21లో ఇదే రాష్ట్రం వాటా 35.2 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గింది.
రెమిటెన్స్‌ల్లో కేరళ వాటా 10 శాతం నుంచి 19.7 శాతానికి పెరిగింది. తమిళనాడు 10.4 శాతం, కర్ణాటక 7.7% సొంతం చేసుకున్నాయి.
2023–24 రెమిటెన్స్‌ల్లో రూ.5లక్షలు అంతకుమించిన లావాదేవీలు 29 శాతంగా ఉన్నాయి.
భారత్‌కు గత ఆర్థిక సంవత్సరం వచ్చిన రెమిటెన్స్‌ల్లో యూఎస్ వాటా 27.7 శాతానికి చేరింది. 2020–21లో ఇది 23.4 శాతంగా ఉంది.
అలాగే యూకే నుంచి వచ్చిన రెమిటెన్స్‌లు ఇదే కాలంలో 6.8% నుంచి 10.8 శాతానికి
పెరిగాయి.యూఏఈ 19 శాతంతో రెమిటెన్స్‌లకు రెండో అతిపెద్ద కేంద్రంగా ఉంది. 2020–21 రెమిటెన్స్‌ల్లో యూఏఈ వాటా 18 శాతంగా ఉండడం గమనార్హం.
నిర్మాణ రంగం, హెల్త్‌కేర్, ఆతిథ్యం, పర్యాటకం తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలతో భారత కార్మికులకు యూఏఈ ఆశ్రయమిస్తుంటే.. భారత నిపుణులకు యూఎస్ కీలక ఉపాధి కేంద్రంగా ఉంది.
మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ నుంచి ఎక్కువ మంది విదేశీ విద్యకు వెళుతున్నారు. దీంతో దేశ రెమిటెన్స్‌ల్లో ఈ రాష్ట్రాల వాటా క్రమంగా పెరుగుతోంది.
ఇదీ చదవండి: మరో టెలికాం కంపెనీ 5జీ సేవలు షురూ..
వృద్ధికి పటిష్ట మూలాలు
బలమైన ద్రవ్య విధానాలు, మెరుగైన సమన్వయంతో కూడిన పరపతి విధాన కార్యాచరణ, డిజిటల్ వైపు మళ్లేందుకు తీసుకుంటున్న చర్యలు దీర్ఘకాలం పాటు స్థిరమైన ఆర్థిక వృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఆర్‌బీఐ బులెటిన్ పేర్కొంది. స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని, బలమైన దేశీ డిమాండ్, స్థిరమైన పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ మూలధన వ్యయాల పెంపు ఇవన్నీ కూడా నిలకడైన ఆర్థిక వృద్ధికి మద్దతునిస్తాయని తెలిపింది. ‘అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్ల వాతావరణలోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడింది. వ్యవసాయ రంగం పటిష్ట పనితీరుకు తోడు వినియోగం మెరుగుపడడం ఇందుకు సానుకూలించింది’ అని వివరించింది. టారిఫ్‌ల తీవ్రత, వాటి అమలుపై అనిశ్చితి నెలకొన్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశి్చత పరిస్థితుల వల్లే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు స్థిరంగా బయటకు వెళ్లిపోతున్నట్టు తెలిపింది. 2024–25 చివరి త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి) డిమాండ్ బలంగా ఉంటుందని కీలక సూచికలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment