బలీన్ తిమింగలం జాతికి చెందిన ఒక మగ హంప్‌బ్యాక్ తిమింగలం వలస రికార్డు ఊహకందనిది. ఏకంగా మూడు మహా సముద్రాలు చుట్టొచ్చి.. రికార్డు క్రియేట్ చేసింది. ఈ మగ తిమింగలం దక్షిణ అమెరికా నుంచి ఆఫ్రికా వరకు సుమారు 8వేల మైళ్లకు పైగా ఈది ఆశ్చర్యపరిచింది. తన సహచర తిమింగలాన్ని వెతుక్కుఉంటూ ఇంత దూరం సముద్రంలో ఈది ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు.
ఈ తిమింగలం కదలికను శాస్త్రవేత్తల బృందం సుమారు 2013 నుంచి 2022 వరకు ట్రాక్ చేస్తూ వచ్చారు. ఇది దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి ఆఫ్రికాలోని జాంజిబార్‌లోని తిమింగలలా సంతానోత్పత్తి ప్రదేశం వరకు ఈదుకుంటూ వెళ్లినట్లు తెలిపారు. తిమింగలాల జాతిలోనే అత్యంత అరుదైన జాతి ఈ హంప్‌బ్యాక్ తిమింగలం. ఈ తిమింగల వెనుక ఉన్న విలక్షణమైన మూపురం కారణంగానే వీటిని హంప్‌బ్యాక్ తిమింగలంగా అని పిలుస్తారు. ఇవి మహాసముద్రాల్లోనే ఉంటాయి. వాణిజ్యపరంగా కూడా అత్యంత ఖరీదైన తిమింగలం ఇది.
అయితే వేట కారణంగా ఈ జాతి అంతరించిపోతున్నదశలో ఉంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తల బృందం హంప్‌బ్యాక్ తిమింగలాల తీరు, వలస విధానంపై అధ్యయనం చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ మగ హంప్‌బ్యాక్ తిమింగలం కదలికలను ట్రాక్ చేస్తూ వచ్చారు పరిశోధకులు. తొలిసారిగా ఈ తిమింగలాన్ని 2013లో గుర్తించి ఫోటోలు తీశారు. ఆ తర్వాత మళ్లీ 2022లో జాంజిబార్ తీరంలో నైరుతి హిందూ మహాసముద్రంలో గుర్తించారు.
మొదట్లో అదే తిమింగలమా కాదనే అనుమానం కలిగింది. అయితే దాని దాని జననేంద్రియ ప్రాంతంలో తీసిన ఫోటోల ఆధారంగా ఆ తిమింగలమే అని నిర్థారించారు శాస్త్రవేత్తలు. ఇంతకుముందు తాము ఎన్నో విలక్షణమైన తిమింగలాల శక్తిమంతంగా ఈదడం గుర్తించామని, కానీ అవి మధ్యలోనే దారితప్పేవని అన్నారు. అయితే ఈ తిమంగలం మాత్రం ఏదో వెతుకుతూ వచ్చినట్లుగా ఇంత దూరం ప్రయాణించడమే ఆశ్చర్యం కలిగించిందన్నారు.
వాస్తవానికి ఇవి చాలా శక్తిమంతంగా ఈదగలవు. కానీ ఇంతలా రికార్డు స్థాయిలో ఈదుకుంటూ వెళ్లడమే ఈ మగ హంప్‌బ్యాగ్ తిమింగలం ప్రత్యేకత అని చెప్పారు. అయితే కచ్చితంగా ఇలా అంత దూరం ఎందుకు ప్రయాణం చేసిందనేది చెప్పలేమన్నారు. కానీ ఇందుకు వాతావరణ మార్పు, పర్యావరణ మార్పులు పాత్ర ఉండొచ్చని అన్నారు. అలాగే ఆహార అన్వేషణ కూడా అయ్యి ఉండొచ్చన్నారు. ఒక రకంగా తమ పరిశోధన మహాసముద్రాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను హైలెట్ చేసిందని పరిశోధక బృందం తెలిపింది. ఈ అధ్యయనం రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.
(చదవండి: ‘సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్'తో అంతలా బరువు తగ్గొచ్చా..!)
Comments
Please login to add a commentAdd a comment