పల్లెపల్లెనా ‘ఉపాధి’ లేమి!
పడకేసిన ఉపాధి హామీ పథకం
* వలసబాట పడుతున్న పేద కూలీలు
* ఇప్పటికే 13 లక్షల మంది కూలీల వలస!
సాక్షి, హైదరాబాద్: ఉపాధి పడకేసింది.. హామీ అటకెక్కింది! పల్లెల్లో ఉపాధి పనులు దొరక్క కూలీలు పొట్ట చేతబట్టుకొని పట్టణాలకు వలస వెళ్తున్నారు. అటు తీవ్ర వర్షాభావంతో వ్యవసాయ పనులు లేకపోవడం.. ఇటు ఉపాధి హామీ సిబ్బంది సమ్మె.. వెరసి కూలీలకు ఉపాధి గగనమైంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. రాష్ట్రంలో ఏకంగా 13 లక్షల మంది వలస బాట పట్టినట్టు తెలుస్తోంది!
తెలంగాణలో తొమ్మిది జిల్లాల్లోని(హైదరాబాద్ మినహా) 443 మండలాల్లో సుమారు 55.38 లక్షల మందికి ఉపాధి హామీ(జాబ్) కార్డులున్నాయి. దాదాపు 24 లక్షల మంది కూలీలు ఏటా ఉపాధి పనులతో పొట్టుబోసుకుంటున్నారు. వీరిలో ఈ నెలలో 1.5 లక్షల మందికి పనులు కల్పించగా.. గతవారం కేవలం 698 మందికే ఉపాధి చూపారు. ఈ వారం మరీ ఘోరంగా కేవలం 11 మందికే పని కల్పించినట్లు అధికారిక లెక్కలే చెబుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఉపాధి పొందుతున్న అరకొర మంది కూలీలకు కూడా వేతనం గిట్టడం లేదు. పెంచిన వేతనం ప్రకారం రోజుకు రూ.180 ఇవ్వాల్సి ఉన్నా.. సగటున రూ.90 మాత్రమే దక్కుతోంది. చిన్న పనులకు సైతం ఎక్కువ మంది వస్తుండడం.. ఆ మొత్తాన్నే అందరూ పంచుకోవాల్సి రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
చేసిన పనులకూ డబ్బుల్లేవ్!
పథకం పరిధిలోని సుమారు 16 వేల మంది ఉద్యోగులు 35 రోజులపాటు సమ్మె చేయడంతో దాని ప్రభావం కూలీల ఉపాధిపై కూడా బాగా పడింది. వీరిలో 8,600 మంది క్షేత్రస్థాయి సహాయకులు కాగా, మిగిలిన వారు ఏపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు. క్షేత్రస్థాయిలో కూలీలతో నేరుగా సంబంధాలుండే ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో ఉపాధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కూలీలు అంతకు ముందు చేసిన పనులకు సంబంధించిన చెల్లింపులు కూడా ఆగిపోయాయి.
సుమారు రూ.150 కోట్ల దాకా కూలీలకు చెల్లించాల్సి ఉంది. బ్యాంకు ఖాతాల ద్వారానే కూలీ చెల్లించాలంటూ కొత్త నిబంధన పెట్టడం, ప్రతి ఒక్కరి ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న సర్కారు నిర్ణయంతో గత నాలుగు నెలలుగా వేలాది మందికి చెల్లింపులు నిలిచిపోయాయి. చేసిన పనులకు డబ్బు రాక, కొత్తగా పనులు లభించక కూలీలు నరకయాతన అనుభవిస్తున్నారు.
పస్తులే దిక్కు..
కాలం లేక రైతులు కూడా దిగాలుగా ఉన్నారు. వానల్లేక చేనులో పంట ఎండిపోయే దశకు చేరుతోంది. దీంతో వ్యవసాయ పనులూ సాగడం లేదు. అటు సాగు పనులు, ఇటు ఉపాధి పనులు లేకపోవడంతో పేద కుటుంబాలు పస్తులుంటున్నాయి. కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ అప్పు కూడా దొరకని వాళ్లు పట్టణాలకు వెళ్లి దినసరి అద్దెపై ఆటోలు, రిక్షాలు తీసుకొని నడుపుతూ పొట్టబోసుకుంటున్నారు. మరికొందరు ప్రైవేటు సంస్థల్లో సెక్యూరిటీ గార్డులుగా చేరిపోతున్నారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లా నుంచి 2.75 లక్షల మంది, మహబూబ్‌నగర్ నుంచి 2.5 లక్షల మంది వలస వెళ్లినట్లు సమాచారం.
ఉద్యోగులకూ భరోసా లేదు
సమ్మె చేసినా ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కంటి తుడుపు చర్యగా ఒక కమిటీని వేసింది. ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ నోటీసులు రావడం, ఉపాధి హామీని పంచాయతీలకు అప్పగించాలని సర్కారు యోచిస్తుండడంతో.. తమ కొలువులు ఎక్కడ పోతాయోనని భయపడిన ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మెను విరమించారు. ఆరు వారాల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మళ్లీ సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి.
ఆటో నడుపుతున్నా..
గత నెల నుంచి ఉపాధి పనులు బంద్ అయ్యాయి. వ్యవసాయ కూలీ పనులు కూడా లేవు. కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నాను. పనుల్లేక వారం నుంచి దినసరి అద్దెపై ఆటో నడుపుతున్నా.
- ఆంజనేయులు, ఉపాధి కూలీ, మేళ్లచెర్వు, గద్వాల మండలం. మహబూబ్‌నగర్
బతుకు ఆగమైంది..
మాకు రెక్కల కట్టం తప్ప ఆస్తిపాస్తులు లేవ్. నేను, నా భార్య ఇన్ని దినాలు ఉపాధి పనికి వెళ్లినం. సమ్మెతో ఊళ్ల పనులు బందైనయ్. బ తుకు ఆగమైంది. పొలం పనులు కూడా సాగుతలేవ్. పూట గడుసుడు కట్టమైతంది.
- కొండపల్లి రాజం, నెన్నెల, ఆదిలాబాద్
పస్తులు ఉంటున్నం..
కొన్నాళ్ల నుంచి మా ఊళ్లో ఉపాధి హామీ పథకం పనులు లేవు. బయట పనులు దొరక్క, ఇప్పుడు ఉపాధి పనులు కూడా లేకపోవడంతో పస్తులుండాల్సి వస్తోంది. పంట చేలల్లో కూలీ పనులు కూడా కరువయ్యాయి. గ్రామాల్లో ఎలాంటి పనులు దొరకడం లేదు.
- సాయిలు, దామర్‌గిద్ద, కంగ్టి మండలం, మెదక్