5 గంటల పని.. కూలి రూ.50
మండుటెండలో నీరసిస్తున్న కూలీలు
మేట్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్ల చేతివాటం
జిల్లాలో సగటు వేతనం రూ.110
గరిష్ట వేతనం మార్చి వరకు 169..
ఏప్రిల్ నుంచి రూ.180
కర్నూలు(అగ్రికల్చర్) : చెమట చిందించినా.. కండలు కరిగించినా.. అందుతున్న కూలి అత్తెసరే. మండుటెండలో మధ్యాహ్నం వరకు నడుము వంచినా చేతికందేది చిల్లర పైసలే. ఉపాధి పనుల విషయంలో గొప్పలే తప్పిస్తే.. కూలీలకు చేకూరుతున్న లబ్ధి అంతంతే. స్థానికంగా పనుల్లేక.. కాంక్రీటు వనాల్లో బడుగు జీవుల పొట్టతిప్పలు వర్ణనాతీతం. కూలీలకు గరిష్ట వేతనం గత మార్చి వరకు రూ.169 కాగా.. ఏప్రిల్ నుండి రూ.180లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే అధిక శాతం కూలీలకు అందుతున్న వేతనం రూ.50 మాత్రమే కావడం గమనార్హం. జిల్లాలో ఉపాధి పనులకు 1.15 లక్షల మంది హాజరవుతుండగా.. 10 నుంచి 20 శాతం కూలీలకు వేతనం రూ.50 మించని పరిస్థితి. ఉపాధి కూలీలతో శ్రమశక్తి సంఘాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో సంఘంలో 10 నుండి 15 మంది కూలీలు ఉంటారు. స్థానిక టీడీపీ నేతల ఒత్తిళ్లతో చాలా చోట్ల మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు బోగస్ మస్టర్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
10 మంది హాజరైతే 15 మంది.. ఆరుగురు హాజరైతే 10 మంది వచ్చినట్లు చూపుతుండటంతో కూలీల నోట్లో మట్టి పడుతోంది. పార్ట్ మిషన్ల ద్వారా పోస్టల్ సిబ్బంది ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లిస్తారు. కూలీల వేలి ముద్రల ఆధారంగా పేమెంట్ జరుగుతోంది. ఆ వెంటనే రెండు రశీదులు వస్తే.. ఒకటి కూలీకి అందజేయాలి. అయితే ఎక్కడా ఇలా చేస్తున్న దాఖలాల్లేవు. పోస్టల్ సిబ్బంది కొందరు రశీదులు ఇవ్వకుండా వేతనంలో పది శాతం స్వాహా చేస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే మేట్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు అంతోఇంతో ముట్టజెబితే రోజుకు రూ.120 నుంచి రూ.150 వరకు వేతనం వస్తోందని.. లేదంటే కొలతల్లో కోత కోస్తుండటంతో కూలి గిట్టుబాటు కావడం లేదని కూలీలు వాపోతున్నారు.
కల్పించే పనులు కూడా కారణమే..
ఉపాధి కూలీలకు గిట్టుబాటు వేతనం లభించకపోవడానికి కల్పిస్తున్న పనులు కూడా ఒక కారణమే. మామూలుగా అయితే ఫీల్డ్ అసిస్టెంట్ మార్కింగ్ ఇవ్వాలి. వారంలో ఎంత పని చేస్తే ఎంత కూలీ వస్తుందో స్పష్టంగా చెప్పాలి. అయితే 60 శాతం వరకు మార్కింగ్ ఇవ్వడం లేదు. ఇక్కడ పని చేయండని చెబుతున్నారు తప్ప.. ఎంత పని చేస్తే ఎంత కూలీ వస్తుందో మార్కింగ్ ఇవ్వకపోవడంతో కూలి గిట్టుబాటు కావడం లేదు. దీనికి తోడు పనులు కూడా బరువుగా ఉంటున్నాయి. దాదాపు ఆరు నెలలుగా వర్షాలు లేకపోవడంతో భూములు గట్టిపడి బండను తలపిస్తున్నాయి. బరువైన పనులను కనీసం ఐదారు గంటలు చేస్తున్నారు. కానీ వేతనం రూ.50లే వస్తోంది.
సగటు వేతనం రూ.110 మాత్రమే..
ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు గరిష్ట వేతనం రూ.169లు కాగా.. ఏప్రిల్ 1 నుండి రూ.180లకు పెంచారు. ఈ మొత్తానికి వేసవి అలవెన్స్ అదనం. కానీ ఉపాధి కూలీలకు సగటున పడుతున్న వేతనం రూ.110 మాత్రమే. దీనిని రూ.135లకు పెంచాలని లక్ష్యంగా తీసుకున్నా సాధ్య పడని పరిస్థితి. సగటు వేతనాన్ని పెంచేందుకు అధికారులు గ్రామస్థాయిలో మేట్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణనిచ్చారు. వేతనం పెంచుకోవాలంటే ఏమేమి చేయాలనే విషయమై వివరించారు. అయినప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు ఖాతరు చేయకపోవడంతో కూలీలు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
రోజుకు రూ.30 పడుతోంది
ఎండలో పని చేయలేక సచ్చిపోతున్నాం. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా కూలి అంతంతే వస్తోంది. చెరువు పూడికతీత పనులకు వెళ్తున్నాం. రోజుకు రూ.30 పడుతోంది. సారోళ్లు రూ.168 ఇస్తున్నామంటారే కానీ.. యానాడు అంత డబ్బు కళ్ల చూడలేదు.
- కాశన్నగారి రుక్మిణమ్మ,కొలుములపల్లె గ్రామం
కూలి డబ్బులూ ఆలస్యమే
చేసిన పనికి ఇచ్చే నాలుగు దుడ్లు కూడా ఆలస్యమే. పనులకు పోవాలంటే ఎవరూ ముందుకు రావడం లేదు. పోస్టాఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఫీల్డ్ పరంగా అధికారులు వచ్చి న్యాయం చేయాల. ఇట్లయితే ఇల్లు ఎట్టా నడుస్తాది.
-ఆవుల మాబున్ని,ఆర్‌ఎస్ రంగాపురం
కూలీల నోట్లో మట్టి
Published Wed, May 6 2015 4:33 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement