‘ఉపాధి’కి ఊపు
Published Mon, Feb 17 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల గుర్తింపు ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. వచ్చే ఆర్థిక
సంవత్సరంలో రూ.140 కోట్లతో పనులు చేపట్టాలని డ్వామా అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఏటా డిసెంబర్ నెలలోనే పనులు గుర్తింపునకు చర్యలు చేపట్టాలని గతేడాది ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోగా ఇప్పటి వరకు చేపడుతున్న పనులకు అదనంగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో 16 రకాల కొత్త పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో గుర్తింపు ఆలస్యమయ్యింది. వాస్తవంగా జనవరి 22లోగా పనుల గుర్తింపు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలరీత్యా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడంలో కొంత జాప్యం జరిగింది. జిల్లాలో 46 మండలాల్లోని 888 గ్రామాల్లో 36,439 పనులు చేపట్టాలని అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. కూలీలకు వేతనాల కింద రూ.129.42 కోట్లు చెల్లించనున్నారు.
కొత్తగా చేపట్టనున్న పనులు ఇవే
గ్రామాల్లోని ఉమ్మడి భూముల్లో పొదలు, ముళ్లకంపలు కొట్టడం, భూమి చదును చేయడం, చేపలు, రొయ్యల చెరువుల పూడికలు, కంపోస్టు ఫిట్‌ల తవ్వకం, సాగునీటి డ్రెయిన్లు, కాలువలు, ప్రాజెక్టుల్లో గుర్రపుడెక్క తీత, మంచినీటి, రజక, దూడల చెరువుల పూడికలు, రోడ్లకు అడ్డంగా ఉన్న జంగిల్ క్లియరెన్స్, నేలనూతులు బాగు చేసుకోవటం, కొబ్బరిచెట్ల పెంపకం, అభివృద్ధి, వర్షాలు, వరదల వల్ల గండ్లు పడిన చెరువులను అభివృద్ధి చేసుకోవటం వంటి పనులకు ఉపాధి హామీలో కొత్తగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూ.105గా ఉన్న సరాసరి కూలీ రేటు వచ్చే సీజన్‌లో మరో రూ.20 పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఉపాధి కూలీలకు ప్రయోజనం కలగనుంది.
అత్యధిక బడ్జెట్ బుట్టాయగూడెంలో..
జిల్లాలోని 46 మండలాల్లో బుట్టాయగూడెంలో 441 పనులకు రూ.10.47 కోట్లతో అత్యధిక బడ్జెట్‌ను రూపొందించారు. డెల్టా మండలాల్లో రూ.79 లక్షల నుంచి అత్యధికంగా ఆరు కోట్ల వరకు నిధులు ఖర్చు చేయడానికి ప్రతిపాదించారు. అత్యల్పంగా పెరవలిలో రూ.79 లక్షలు మేర ఉపాధి పనులు చేయనున్నారు. పనులు చేసిన వెంటనే పోస్టాఫీసుల ద్వారా వేతనాలు చెల్లించే దిశగా డ్వామా అధికారులు అడుగులు వేస్తున్నారు.
Advertisement
Advertisement