జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు సాధ్యమైనంత త్వరలో పీఆర్సీ అమలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆర్థిక, సర్వీసెస్ శాఖ ము ఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అమలుపై శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ అ ధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. సుమారు పదహారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మూడు విడతల్లో మూడు గ్రూపులుగా జరిగిన ఈ సమావేశంలో ఫిట్‌మెంట్, పీఆర్సీ, నగదు ప్రయోజనాలు అమలు తేదీలు, నగదు రూపేణా ఎప్పటి నుండి అందజేయాలి తదితర అంశాలను సమగ్రంగా చర్చించారు.
ఉద్యోగ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సేవలు) పి.చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక, ఏపీ సచివాలయం సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె.వెంట్రామిరెడ్డి, సూర్యనారాయణ, మిగతా ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశాల పేరుతో కాలయాపన
పీఆర్సీపై సమావేశాల పేరుతో కాలయాపన చేస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంతో ఎలాంటి ఉపయోగం లేదు. వారం పది రోజుల్లో పీఆర్సీ ఇస్తామని సీఎం తిరుపతిలో చెప్పారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎంత పీఆర్సీ ఇస్తారో చెప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తున్నారు. సీఎస్ కమిటీ సిఫారసు ప్రకారం 14.29 శాతం ఫిట్‌మెంట్‌పైనే మాట్లాడుతున్నారు. దీనిని మేము పరిగణనలోకి తీసుకోలేం. 27 శాతానికి పైనే పీఆర్సీ ఇస్తేనే చర్చలకు వస్తాం. ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే ఉద్యమాన్ని కొనసాగిస్తాం. జనవరి 3న జరిగే జేఏసీ సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం.
– బండి శ్రీనివాసులు, ఏపీ జేఏసీ చైర్మన్
అలా చెప్పటం అన్యాయం
ఉద్యోగులను అవమానించడానికే చర్చలు నిర్వహిస్తున్నట్టుంది. ఈరోజు సమావేశంలో అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కడా తగ్గలేదు. రూ.75 వేల కోట్లు ఉద్యోగుల కోసమే ఖర్చు చేస్తున్నామంటున్నారు. ఇది రాష్ట్ర ఆదాయంలో 33 శాతం మాత్రమే. వంద శాతం ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తున్నామనడం దుర్మార్గం. వారం రోజుల్లో సీఎం వద్దకు తీసుకెళ్తామని ఇప్పటివరకు పట్టించుకోలేదు. గతంలోనే ఎక్కువ జీతం తీసుకున్నారు.. దానికి తగ్గకుండా ఇస్తామని చెప్పటం అన్యాయం. అశుతోష్ మిశ్రా కమిటీ సిఫారసులను వెంటనే య«థాతథంగా అమలు చేయాలి.
– బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్
అధికారుల నిర్లిప్త ధోరణి
శాఖాధికారుల నిర్లిప్త ధోరణితో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. సర్వీస్ ప్రయోజనాలను ఉద్యోగులకు భిక్ష వేయడం లేదు. చాయ్ పే చర్చ తరహా సమావేశాలతో ఎలాంటి ఉపయోగం ఉండదు. డిసెంబర్ 31 వరకు వేచి చూస్తాం. జనవరి నుంచి జిల్లా, తాలూకా స్థాయిలో ఉద్యోగుల చైతన్య యాత్ర నిర్వహిస్తాం. ఒక్క పీఆర్సీ అంశంపైనే కాకుండా అన్నింటిలో ఏపీలో ఉద్యోగ సంఘాల మధ్య అనైక్యత ఉంది. చర్చలు విఫలమైనప్పుడే ఆందోళనకు వెళ్లాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల్లో కరపత్రాల ద్వారా కార్యాచరణ ప్రకటిస్తాం.
– కె.సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
త్వరలోనే పీఆర్సీ అంశానికి ముగింపు
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై ప్రభుత్వం చర్చించింది. కొద్ది రోజుల్లోనే పీఆర్సీ అంశానికి ముగింపు ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా ఉద్యోగ సంఘాలకు వివరించాం. త్వరలోనే ప్రభుత్వం నుంచి పీఆర్సీపై ప్రకటన వస్తుంది. ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి.
– చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు
Comments
Please login to add a commentAdd a comment