Shashi Bhushan Kumar
-
మీ వైఫల్యం వల్లే.. సాగర్ స్పిల్ వే సగం స్వాధీనం
సాక్షి, అమరావతి : ఉమ్మడి ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కార్‌ను నియంత్రంచడంలో మీ వైఫల్యంవల్లే మా భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్‌వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను గురువారం స్వాదీనం చేసుకున్నామని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఏపీకి కేటాయించిన నీటిని తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు విడుదల చేశామని స్పష్టంచేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం రాత్రి లేఖ రాశారు. సాగర్ స్పిల్‌వేలో సగభాగాన్ని ఏపీ స్వాదీనం చేసుకుందని కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. కుడి కాలువకు నీటి విడుదలను ఆపేలా ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని ఆ లేఖలో కోరింది. తెలంగాణ సర్కార్ ఫిర్యాదుపై కృష్ణా బోర్డు ఏపీ సర్కార్‌కు శుక్రవారం లేఖ రాసింది. తక్షణమే నీటి విడుదలను నిలిపేయాలన్న కృష్ణా బోర్డు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చుతూ శశిభూషణ్‌కుమార్ బదులిచ్చారు. ఏపీ లేఖలో ప్రధానాంశాలివీ.. ► శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈకి, సాగర్ నిర్వహణ బాధ్యత ఆ ప్రాజెక్టు సీఈకి అప్పగించారు. 2014 నుంచే తెలంగాణ భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈకి అప్పగించకుండా.. తానే నిర్వహిస్తోంది. అదే సమయంలో మా భూభాగంలోని సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను సైతం తెలంగాణ తన అదీనంలోకి తీసుకుంది. ► గత తొమ్మిదేళ్లుగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ సాగర్‌కు తరలించి.. అటు సాగర్ ఎడమ కాలువలో తమ పరిధిలోని ఆయకట్టుకు నీళ్లందిస్తూ రాష్ట్ర హక్కులను తెలంగాణ హరిస్తోందని అనేకసార్లు బోర్డుకు ఫిర్యాదు చేశాం. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను స్వాదీనం చేసుకోవాలని బోర్డును అనేకసార్లు కోరాం. లేదంటే ఏపీ భూభాగంలోని సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఏపీకి అప్పగించాలని కోరాం. కానీ, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ► అక్టోబరు 6న త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, సాగర్ నుంచి 15 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ కృష్ణా బోర్డు అక్టోబరు 9న ఉత్తర్వులిచ్చింది. తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ యథావిధిగా అదే రోజున ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించి శ్రీశైలాన్ని తెలంగాణ సర్కార్ ఖాళీచేస్తూ వచ్చింది. దీనిపై అప్పుడే బోర్డుకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీనివల్ల శ్రీశైలంలో మాకు కేటాయించిన 30 టీఎంసీల్లో కేవలం 13 టీఎంసీలనే వాడుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ చర్యలవల్ల 17 టీఎంసీలను కోల్పోయాం. ► సాగర్ కుడి కాలువ కింద మాకు కేటాయించిన 15 టీఎంసీల్లో ఇప్పటివరకు ఐదు టీఎంసీలు వాడుకున్నాం. మిగతా పది టీఎంసీలను వాడుకోనివ్వకుండా సాగర్‌ను తెలంగాణ ఖాళీచేస్తే.. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చడం సవాల్‌గా మారుతుందన్న ఆందోళనతోనే సాగర్ స్పిల్ వేను స్వాదీనం చేసుకుని, కుడి కాలువకు నీటిని విడుదల చేసి మా హక్కులను పరిరక్షించుకున్నాం. నీటి విడుదలను ఆపే ప్రశ్నేలేదు. నేడు రెండు రాష్ట్రాలతో కేంద్రం భేటీ కృష్ణా జలాలపై హక్కులను కాపాడుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్ వే సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. సాగర్ వివాదంతోపాటు కృష్ణా జలాల పంపకాలు, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్, కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ తదితరులు పాల్గొనే ఈ సమావేశం శనివారం ఉ.11గంటలకు హైబ్రీడ్ విధానంలో (వీడియో కాన్ఫరెన్స్) జరుగుతుంది. గత తొమ్మిదేళ్లుగా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కార్ హరిస్తున్న తీరును ఈ సమావేశంలో కేంద్రం దృష్టికి మరోసారి తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. -
త్వరలో పీఆర్సీ అమలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు సాధ్యమైనంత త్వరలో పీఆర్సీ అమలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆర్థిక, సర్వీసెస్ శాఖ ము ఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అమలుపై శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ అ ధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. సుమారు పదహారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మూడు విడతల్లో మూడు గ్రూపులుగా జరిగిన ఈ సమావేశంలో ఫిట్మెంట్, పీఆర్సీ, నగదు ప్రయోజనాలు అమలు తేదీలు, నగదు రూపేణా ఎప్పటి నుండి అందజేయాలి తదితర అంశాలను సమగ్రంగా చర్చించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సేవలు) పి.చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక, ఏపీ సచివాలయం సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె.వెంట్రామిరెడ్డి, సూర్యనారాయణ, మిగతా ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశాల పేరుతో కాలయాపన పీఆర్సీపై సమావేశాల పేరుతో కాలయాపన చేస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంతో ఎలాంటి ఉపయోగం లేదు. వారం పది రోజుల్లో పీఆర్సీ ఇస్తామని సీఎం తిరుపతిలో చెప్పారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎంత పీఆర్సీ ఇస్తారో చెప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తున్నారు. సీఎస్ కమిటీ సిఫారసు ప్రకారం 14.29 శాతం ఫిట్‌మెంట్‌పైనే మాట్లాడుతున్నారు. దీనిని మేము పరిగణనలోకి తీసుకోలేం. 27 శాతానికి పైనే పీఆర్సీ ఇస్తేనే చర్చలకు వస్తాం. ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే ఉద్యమాన్ని కొనసాగిస్తాం. జనవరి 3న జరిగే జేఏసీ సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. – బండి శ్రీనివాసులు, ఏపీ జేఏసీ చైర్మన్ అలా చెప్పటం అన్యాయం ఉద్యోగులను అవమానించడానికే చర్చలు నిర్వహిస్తున్నట్టుంది. ఈరోజు సమావేశంలో అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కడా తగ్గలేదు. రూ.75 వేల కోట్లు ఉద్యోగుల కోసమే ఖర్చు చేస్తున్నామంటున్నారు. ఇది రాష్ట్ర ఆదాయంలో 33 శాతం మాత్రమే. వంద శాతం ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తున్నామనడం దుర్మార్గం. వారం రోజుల్లో సీఎం వద్దకు తీసుకెళ్తామని ఇప్పటివరకు పట్టించుకోలేదు. గతంలోనే ఎక్కువ జీతం తీసుకున్నారు.. దానికి తగ్గకుండా ఇస్తామని చెప్పటం అన్యాయం. అశుతోష్ మిశ్రా కమిటీ సిఫారసులను వెంటనే య«థాతథంగా అమలు చేయాలి. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ అధికారుల నిర్లిప్త ధోరణి శాఖాధికారుల నిర్లిప్త ధోరణితో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. సర్వీస్ ప్రయోజనాలను ఉద్యోగులకు భిక్ష వేయడం లేదు. చాయ్ పే చర్చ తరహా సమావేశాలతో ఎలాంటి ఉపయోగం ఉండదు. డిసెంబర్ 31 వరకు వేచి చూస్తాం. జనవరి నుంచి జిల్లా, తాలూకా స్థాయిలో ఉద్యోగుల చైతన్య యాత్ర నిర్వహిస్తాం. ఒక్క పీఆర్సీ అంశంపైనే కాకుండా అన్నింటిలో ఏపీలో ఉద్యోగ సంఘాల మధ్య అనైక్యత ఉంది. చర్చలు విఫలమైనప్పుడే ఆందోళనకు వెళ్లాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల్లో కరపత్రాల ద్వారా కార్యాచరణ ప్రకటిస్తాం. – కె.సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు త్వరలోనే పీఆర్సీ అంశానికి ముగింపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై ప్రభుత్వం చర్చించింది. కొద్ది రోజుల్లోనే పీఆర్సీ అంశానికి ముగింపు ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా ఉద్యోగ సంఘాలకు వివరించాం. త్వరలోనే ప్రభుత్వం నుంచి పీఆర్సీపై ప్రకటన వస్తుంది. ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి. – చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు -
చెప్పిందేమిటి చేసిందేమిటి?
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు లక్ష్యం మేరకు సాగకపోవడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం పనులు చేయకపోవడం.. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు సురక్షిత స్థాయికి (35 మీటర్ల ఎత్తు) పూర్తి చేయకపోవడం.. నిర్వాసితులకు పునరావాసం కల్పించే ప్రక్రియ స్తంభించిన నేపథ్యంలో ఎగువ కాఫర్ డ్యామ్ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. గోదావరి గట్టు ఎడమ వైపు(రీచ్–1), కుడి గట్టు(రీచ్–3) వద్ద కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించలేదు. ఆ పనులు చేయొద్దని, ఆ ఖాళీ ప్రదేశాల నుంచే వరద జలాలను దిగువకు వదలాలని పీపీఏ సూచించింది. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ), ఆడిటెడ్ స్టేట్మెంట్లను సమర్పిస్తేనే మిగతా నిధులు విడుదల చేస్తామని పునరుద్ఘాటించింది. ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) ఆర్కే జైన్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో, గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పునరావాస కాలనీల నిర్మాణ పనులను తనిఖీ చేసింది. శుక్రవారం విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ఆర్అండ్ఆర్ కమిషనర్ రేఖారాణిలతో పీపీఏ సమావేశమైంది. హెడ్ వర్క్స్ పనులపై తీవ్ర అసహనం.. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం) పనుల తీరుపై పీపీఏ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మే ఆఖరు నాటికే ఎగువ కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేస్తామని ఆరు నెలల క్రితం హామీ ఇచ్చారని, క్షేత్రస్థాయిలో ఆ మేరకు పనులు జరగలేదని వెల్లడించింది. జూన్ 15 నాటికే గోదావరికి వరదలు వస్తాయని, కాఫర్ డ్యామ్ పనులు కొనసాగిస్తే వరద ఉధృతికి కొట్టుకుపోయే అవకాశం ఉందని పేర్కొంది. గతేడాది గోదావరికి గరిష్టంగా 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, ఈ ఏడాది అంతకంటే ఎక్కువ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వరదల ధాటి నుంచి ఇప్పటిదాకా చేసిన పనులను, ముంపు గ్రామాలను రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గోదావరి వరద ప్రవాహం సులభంగా దిగువకు వెళ్లేలా చేయడానికి కాఫర్ డ్యామ్‌కు ఎగువన ఏవైనా అడ్డంకులు(ఇసుక దిబ్బలు, గుట్టలు) ఉంటే వాటిని తొలగించాలని సూచించింది. కాఫర్ డ్యామ్ పనులను నిలిసివేయడంతో పాటు ఇప్పటికే చేసిన స్పిల్‌వే, స్పిల్ చానల్, కటాఫ్ వాల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ పనులను రక్షించుకోవడానికి సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించి చర్యలు చేపట్టాలని సూచించింది. 2020 జూన్‌లోగా స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులను పూర్తి చేయగలిగితే.. వచ్చే సీజన్లో ఎగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయొచ్చని, వాటికి సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు చేపట్టి.. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుంటుందని దిశానిర్దేశం చేసింది. నిర్వాసితులకు ఇబ్బంది కలగొద్దు గోదావరికి 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తే 35 మీటర్ల కాంటూర్ వరకూ ముంపు గ్రామాలను వరద ముంచెత్తుతుందని, ఆయా గ్రామాల ప్రజలను జూన్ 15లోగా పునరావాస కాలనీలకు తరలించాలని పీపీఏ స్పష్టం చేసింది. 35 మీటర్ల కాంటూర్ వరకూ 18,635 కుటుంబాలు ముంపునకు గురవుతాయని, 3922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారని, మిగతా 14,713 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని అధికారులు వివరించారు. ఆరు నెలల క్రితమే తాము అప్రమత్తం చేసినా పునరావాస కాలనీల పనులను పూర్తి చేయకపోవడంపై పీపీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకవేళ పునరావాస కాలనీల పనులు పూర్తి చేయలేకపోతే నిర్వాసితులను వరద సహాయక శిబిరాలకు తరలించాలని సూచించింది. ఒక్క నిర్వాసితుడు కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. లెక్కలు చెబితేనే మిగతా నిధులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకూ చేసిన వ్యయంలో రూ.4,341.95 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని, వాటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని పీపీఏను ఏపీ జలవనరుల శాఖ అధికారులను కోరారు. 2014 ఏప్రిల్ 1 వరకూ పోలవరం ప్రాజెక్టుకు చేసిన వ్యయానికి సంబంధించిన ఆడిటెడ్ స్టేట్మెంట్, 2014 ఏప్రిల్ 1 తర్వాత చేసిన వ్యయానికి సంబంధించిన ఆడిటెడ్ స్టేట్మెంట్ను అడిగామని, ఇప్పటికీ ఆ లెక్కలు చెప్పలేదని పీపీఏ గుర్తుచేసింది. చేసిన ఖర్చులకు లెక్కలు చెబితేనే రీయింబర్స్ చేస్తామని తెలిపింది. పనులకు చేసిన వ్యయంతోపాటు భూసేకరణ, సహాయ పునరావాస పనులకు చేసిన ఖర్చులకు సంబంధించిన యూసీలు, ఆడిటెడ్ స్టేట్మెంట్లను ఇస్తే.. మిగతా నిధులు విడుదలయ్యేలా చూస్తామని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ స్పష్టం చేశారు. -
శశిభూషణ్ ఇంట్లో న్యూ ట్విస్ట్
-
ఏపీ ఐఏఎస్ అధికారి ఇంట్లో భారీ చోరీ
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. విజయవాడలోని సూర్యరావుపేట రైతుబజార్ సమీపంలో ఉన్న ప్రభుత్వ గృహంలో ఆయన నివసిస్తున్నారు. ఆయన ఇంటి వద్ద కాపలా ఉండే సెక్యూరిటీ గార్డే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారీ స్థాయిలో నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురికావడంతో చోరీ జరిగిన విషయాన్ని ఇటు ఐఏఎస్ అధికారి, అటు పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు రూ.85 లక్షల నగదు, రూ.24 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిసింది. దాదాపు నెల రోజుల కిందట ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అంత భారీ స్థాయిలో నగదు ఇంట్లో ఉన్న విషయం బయటికి పొక్కితే ఐటీ, ఏసీబీ, సీబీఐ అధికారులు రంగంలోకి దిగుతారని తెలిసి శశిభూషణ్ కుమార్ తూతూ మంత్రంగా కేసు పెట్టారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకుని కొంత సొమ్ము రికవరీ చేశారు. ఎంత సొమ్ము చోరీకి గురైంది? ఆభరణాల విలువ ఎంత? అనే వివరాలు మాత్రం వెల్లడించడానికి ఇరువర్గాలు ఇష్టపడకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటో అంతుచిక్కడం లేదు. చోరుడు.. సెక్యూరిటీగార్డే శశిభూషణ్‌కుమార్ ఇంటి వద్ద హైదరాబాద్‌లోని మెట్రో సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన బిస్వాస్‌ను సెక్యూరిటీ గార్డుగా నియమించుకున్నారు. బిస్వాస్‌ది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న అతన్ని అధికారి కుటుంబసభ్యులు కూడా చేరదీసి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. కుటుంబసభ్యుడిలాగే ఇంట్లోకి రానిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఇంట్లో భారీ ఎత్తున సొమ్ము సూట్‌కేసులో దాచి ఉంచిన విషయాన్ని గుర్తించిన బిస్వాస్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నగదుతోపాటు విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయాడు. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన శశిభూషణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కొంత సమయం తీసుకున్నారు. అనంతరం జరిగిన విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు చెప్పి సాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన ముఖ్యనేత ఒకరు ఈ కేసును రహస్యంగా నమోదు చేసి చోరీ అయిన సొత్తు రికవరీ చేయించాలని సూచించినట్లు తెలిసింది. సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి.. అనంతరం టాస్క్‌ఫోర్స్ విభాగానికి బదిలీ చేశారు. నిందితుడి కోసం వేట కొనసాగించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో నిందితుడు తలదాచుకున్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి బిస్వాస్‌ను అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. నిందితుడు బంగారు నగలతోపాటు చాలా మొత్తంలో నగదు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అసలే నగదుకు సంబంధించిన లెక్కలు ఏవీ లేకపోవడంతో ఐఏఎస్ అధికారి కూడా కిమ్మనకుండా అతడి వద్ద నుంచి పోలీసులు రికవరీ చేసిన దానితోనే సంతృప్తి చెందినట్లు సమాచారం. అంతా రహస్యమే.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో చోరీ జరిగింది. భారీ స్థాయిలో నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. కానీ, ఆయన తూతూ మంత్రంగా కేసు ఎందుకు పెట్టినట్లు? నిందితుడి నుంచి పోలీసులు రికవరీ చేసిన సొత్తు కూడా అంతంత మాత్రమే అని తెలిసినా ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. బంగారు ఆభరణాలకు సంబంధించిన లెక్కలు చూపినా.. పెద్ద ఎత్తున ఇంట్లో ఉంచుకున్న నగదు గురించి చెప్పేదెలా? ఒకవేళ చెబితే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలు పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. అదేసమయంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న కారణంతో పైస్థాయిలో పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల నుంచి సిఫార్సులు రావడంతో చేసేదేమీ లేక పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేసి.. చోరీ సొత్తును రికవరీ చేసి మూడో కంటికి తెలియకుండా నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. చోరీ జరిగిన ఘటనపై ‘సాక్షి’ పోలీసు అధికారులను వివరాలు కోరగా.. అందరి వద్ద నుంచీ ఆ కేసు వివరాలు తెలియదనే సమాధానం రావడం విశేషం. -
పింఛన్‌దారులకు శుభవార్త
కాగజ్‌నగర్ రూరల్ : జిల్లాలోని నెట్‌సిగ్నల్ లేని మారుమూల పింఛన్‌దారుల కష్టాలు తీరనున్నాయి. ప్రతి నెలా పింఛన్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి తీసుకుంటూ అష్టకష్టాలు పడేవారు. వారి ఇబ్బందులను గమనించిన గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శశిభూషణ్‌కుమార్ నెట్‌సిగ్నల్ లేని గ్రామ పంచాయతీలు గుర్తించి స్థానికంగానే పింఛన్లు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీల్లోనే పింఛన్లు పంపిణీకి చర్యలు తీసుకోవాలని లేఖ నంబర్ 6139/ఆర్డీ/డీబీఐ 2013 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అధికారులు జిల్లాలో 16 మండలాల్లో నెట్ సిగ్నల్ లేని 37పంచాయతీలను గుర్తించారు. ఈ పంచాయతీల ప రిధిలోని ఆయా గ్రామాల్లో పింఛన్‌దారుల నుంచి వేలి ముద్రలు సేకరించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కాగా కమిషనర్ ఆదేశాల మేరకు జూలై 1వ తేదీ నుంచి ఆయా పంచాయతీ కేంద్రాల్లోనే పింఛన్ పంపిణీకి జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేలిముద్రల సేకరణలో అధికారులు జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు ప్రతీ నెలా పంపిణీ చేస్తున్నారు. పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానాన్ని అవలంభిస్తుండడంతో నెట్సిగ్నల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ విధానం ద్వారా పింఛన్‌దారుడు వేలిముద్ర వేసి పింఛన్ పొందుతున్నాడు. వేలిముద్రను సరిచూడడానికి ఇంటర్నెట్ అవసరం. కొన్ని పంచాయతీల్లో నెట్‌సిగ్నల్ లేకపోవడంతో అధికారులు పక్కనే ఉన్న మరో పంచాయతీలో పింఛన్లు పంపిణీ చేసేవారు. దీంతో కొన్ని పంచాయతీలకు చెందిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇతర పంచాయతీ కేంద్రాలకు వెళ్లి పింఛన్ డబ్బులు తీసుకునేవారు. ఇటువంటి గ్రామాలు జిల్లాలో 37 పంచాయతీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి ఇబ్బందులను గుర్తించిన అధికారులు సిగ్నల్స్ లేకున్నా పింఛన్ డబ్బులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఆయా పంచాయతీ కేంద్రాల్లో పింఛన్‌దారుల వేలిముద్రలు ముందే సేకరిస్తారు. ఈ విధంగా సేకరించిన వేలిముద్రలను సర్వర్‌కు అప్డేట్ చేయడం ద్వారా ప్రతీ నెలా నెట్‌సిగ్నల్ లేకుండా ఆయా పంచాయతీ కేంద్రాల్లోనే పింఛన్లు పంపిణీ చేసే సౌలభ్యం ఉంది. మరో రెండు రోజుల్లో జిల్లాలో ఎంపిక చేసిన 37 పంచాయతీల పరిధిలోని పింఛన్‌దారుల వేలిముద్రలు సేకరించి సర్వర్‌కు అప్డేట్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో నెట్సిగ్నల్స్లేని పంచాయతీలు ఆదిలాబాద్ మండలంలోని సీహెచ్ ఖానాపూర్, కుంటాల, ఆసిఫాబాద్ మండలంలోని అడదస్నాపూర్, బజార్హత్నూర్ మండలంలోని పెంబి, బెజ్జూర్ మండలంలోని కమ్మర్గాం, మొర్లిగూడ, కొండపల్లి, సోమిని, దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్, దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ, చింతపల్లి, గూడెం, లింగాపూర్, గుడిరేవు, ఇచ్చోడ మండలంలో నేరడిగొండ(కె), గుడిహత్నూర్ మండలంలోని మాచాపూర్, ఇంద్రవెల్లి మండలంలోని పోచంపల్లి, వాయిపేట్, దొడంద, వల్గొండ, హీరాపూర్, వడేగాం, జన్నారం మండలంలోని కవ్వాల్, రోటిగూడ, కాగజ్‌నగర్ మండలంలోని మాలిని, లక్ష్మణచాంద మండలంలోని చింతల్‌చాంద, చామన్‌పల్లి, నిర్మల్ మండలంలోని మేడిపల్లి, ముక్తాపూర్, సిర్పూర్(టి)మండలంలోని చీలపల్లి, తానూర్ మండలంలోని తొండల, తిర్యాణి మండలంలోని లొద్దిగూడ, పంగిడిమాదర, మంగి, మాణిక్యాపూర్, రొంపల్లి పంచాయతీలను ఎంపిక చేశారు. -
ఉపాధి సిబ్బందికి ప్రతిభా అవార్డులు
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలులో అంకిత భావంతో సేవలందించిన పలువురు సిబ్బంది ఉత్తమ ప్రతిభ అవార్డులతోపాటు నగదు బహుమతులను అందుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వివిధ స్థాయి అధికారులు, సిబ్బంది సోమవారం హైదరాబాద్‌లోని గ్రామీణాభివృద్ధిశాఖ అపార్డ్ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శశిభూషణ్‌కుమార్ నుంచి ప్రశంసాపత్రం, నగదును అందుకున్నారు. ఉత్తమ ప్రతిభా అవార్డులు అందుకున్న ఏపీఓలు బి. రాజబాబు, ఎంకేఎస్ ప్రకాశరావు, జూనియర్ ఇంజనీర్ ఎం.ఈశ్వరరావు, ఇతర సిబ్బంది ఎం.వీరబాబు, టి.మురళీకృష్ణ, టి.శివ, టి.శేషగిరిరావు, ఎం.శివగణేష్, జి.రాజారావు, ఎం. విశ్వనాథ్‌లను జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ సంపత్‌కుమార్, ఏపీడీ భవానితోపాటు కార్యాలయ సిబ్బంది, ఉపాధి సిబ్బంది అభినందించారు. -
మన ఓటర్ల జాబితా ప్రపంచానికే ఆదర్శం
ఏలూరు, న్యూస్‌లైన్ : ఓటర్ల జాబితా రూపకల్పనలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, జిల్లా ఓటర్ల నమోదు పరిశీలకులు శశిభూషణ్‌కుమార్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు, ఎన్నికల సిబ్బందితో ఓటర్ల నమోదు కార్యక్రమంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్‌లోని దేశాలకు మిన్నగా మనదేశంలోనే పటిష్టమైన రీతిలో ఓటర్ల జాబితా రూపకల్పన జరిగిందన్నారు. పూర్తిస్థాయిలో పారదర్శకంగా అర్హత గల వారందరికీ ఓటు హక్కు కల్పించామన్నారు. తప్పొప్పులు లేని స్పష్టమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు ఈఆర్వో, బీఎల్వోల పాత్ర కీలకమైందన్నా రు. జిల్లాలో అర్హత కలిగిన లక్షా 80 వేలమంది ఓటర్లుగా నమోదు కావాల్సి ఉన్నట్లు గుర్తించామని, అందువల్లే ప్రత్యేక నమోదు కార్యక్రమాలు చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులను గుర్తించి వారిని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేయాలన్నారు. కలెక్టర్ సిద్ధార్థ జైన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి నకిలీ ఓటర్లను తొలగించడానికి చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో 40,963 మంది కొత్తగా దరఖాస్తు చేశారని వివరించారు. జేసీ టి.బాబూరావునాయుడు, డీఆర్వో కె. ప్రభాకరరావు ఓటర్ల నమోదు ప్రక్రియ, ఇతర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఓటర్ల నమోదుపై మంచి స్పందన యువతలో ఓటర్ల నమోదుపై మంచి స్పందన లభించిందని భవిష్యత్తులో మరింత సులభతరంగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టడానికి ఎంతో దోహదపడుతుందని శశిభూషణ్‌కుమార్ చెప్పారు. ఏలూరులోని సీఆర్ఆర్ మహిళా కళాశాల, సెయింట్ ఆన్స్ కళాశాలలో ఓటర్ల నమోదు కార్యక్రమంపై ఆయన విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. దేశ భవిష్యత్‌ను నిర్దేశించే శక్తి యువతరానికి ఉంటుందని, అటువంటి యువత ప్రతి ఒక్కరూ ఓటర్‌గా నమోదు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు హక్కు పొందిన యువత తమ పేర్లు ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నాయో పరిశీలించుకుని ఓటర్ ఫొటో గుర్తింపు కార్డులు ఉచితంగా పొందవచ్చన్నారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ ప్రతీ కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించడానికి ఆయా కళాశాలలో అంబాసిడర్లను నియమించామని వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ షౌర్లీ మాట్లాడుతూ కళాశాలలో 431 మంది విద్యార్థులు ఓటు హక్కుపొందేందుకు దరఖాస్తులు సమర్పించారని వివరించారు. సమావేశంలో జేసీ టి. బాబూరావునాయుడు, జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాస్ పాల్గొన్నారు. యువ ఓటర్ల నమోదు శాతం పెరగాలి దువ్వ (తణుకు రూరల్) : 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న వారి ఓటర్ల నమోదు స్వల్పంగానే ఉందని శశిభూషణ్ కుమార్ చెప్పారు. దువ్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి బీఎల్వోలతో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. జిల్లాలో రూ.1.28 లక్షల మంది 18 నుంచి 19 వయసున్నవారుండగా వారిలో 33 వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారని చెప్పారు. ఓటర్ల నమోదు కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, యువత తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని సూచించారు. రెండుసార్లు ఓటరుగా నమోదైన వివరాలను ఎలా తొలగిస్తారో అని బీఎల్వోలను అడిగి ఆ విధానాన్ని పరిశీలించారు. ఓటు తొలగింపు ప్రక్రియకు సంబంధించి ప్రత్యేక ఫైల్ ఏర్పాటు చేయాలని స్థానిక తహసిల్దార్ ఎం.హరిహరబ్రహ్మాజీకి సూచించారు. కలెక్టర్ సిద్ధార్థజైన్, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు.